Monday, May 20, 2024
Homeసినిమాఅటు యుద్ధం .. ఇటు ప్రేమ .. మధ్యలో 'సీతా రామం'

అటు యుద్ధం .. ఇటు ప్రేమ .. మధ్యలో ‘సీతా రామం’

Movie Review: నిజమైన ప్రేమకు నిదర్శనం లేదు .. నిర్వచనం లేదు. ఎన్నో ప్రేమకథలు .. ఎన్నో ప్రేమజంటలు. ఎవరి కథ చూసినా కొత్తగానే కనిపిస్తుంది .. కొత్తగానే వినిపిస్తుంది. అలాంటి ప్రేమకథలో ఒకటిగా ‘సీతా రామం‘ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. దుల్కర్ – మృణాలిని ఠాకూర్ జంటగా నటించించిన ఈ సినిమాలో, రష్మిక ..  ప్రకాశ్ రాజ్ .. సుమంత్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించాడు.

“లెఫ్టినెంట్ రామ్ నాకు ఇచ్చిన లెటర్ ను సీతామహాలక్ష్మికి అందజేయి. అప్పుడే నా ఆస్తిపాస్తులు నీకు చెందుతాయి” అనే తాతయ్య నిర్ణయం తెలుసుకున్న అఫ్రీన్ (రష్మిక) ఆశ్చర్యపోతుంది. 1964లో తన తాతయ్య పాకిస్తాన్ ఆర్మీలో పనిచేశాడు. ఆ ఉత్తరం రాసిన రామ్ ఇండియన్ ఆర్మీలో పనిచేశాడు. అంతకి మించిన వివరాలు తెలుసుకోవడానికి తాతయ్య బ్రతికిలేడు. 1985లో అఫ్రీన్ ఆ ఉత్తరం పట్టుకుని గమ్యం లేని ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. ఆ ప్రయాణంలో ఆమెకి ఎదురయ్యే అనూహ్యమైన అనుభవాలే ఈ కథ.

ఫస్టాఫ్ కాస్త  కథను సాగదీసినట్టుగా అనిపించినా, విశ్రాంతి తరువాత కథ దార్లో పడిపోతుంది. లవ్ .. ఎమోషన్ మధ్య  నలుగుతూ నడుస్తుంది. సెకండాఫ్ లో వచ్చే ట్విస్టులు కథను ఒక్కోమెట్టూ పైకి ఎక్కిస్తూ .. పట్టు బిగిస్తూ వెళతాయి  క్లైమాక్స్ కూడా ప్రేక్షకుల ఊహకు అందనిదిగానే ఉంటుంది. రామ్ గా దుల్కర్ లుక్ .. నటన ఆకట్టుకుంటాయి. సీతామహాలక్ష్మిగా మృణాల్ నటన సహజంగానే ఉంది. గ్లామర్ పరంగా ఆమెను తీసుకోలేదనే విషయం అర్థమవుతూనే ఉంటుంది. కథానాయిక తరువాత వరుసలో పాత్రని చేయడానికి రష్మిక ఒప్పుకోవడంగా విశేషమే.

విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన పాటలు ఫరవాలేదు .. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మాత్రం ప్రేక్షకులను మూడ్ లోకి  తీసుకుని వెళ్లాడు. పీ ఎస్ వినోద్ ఫొటోగ్రఫీ ప్రతి దృశ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. అటు యుద్ధాన్నీ ..  ఇటు ప్రేమభరితమైన ఉద్వేగాన్ని తన కెమెరా కన్నుతో గొప్పగా చూపించాడు. సంభాషణలు కూడా కావాలని రాసినట్టుగా కాకుండా, సహజంగా వచ్చినట్టుగా అనిపిస్తాయి. యుద్ధం కోసం ప్రేమను త్యాగం చేసేవారు ఒకరైతే .. ప్రేమ కోసం జీవితాన్ని అంకితం  చేసినవారుగా మరొకరు కనిస్తారు. జీవితంలో ఒక్కసారైనా ప్రేమలో పడినవారికి ఈ కథ అందంగా కనిపిస్తుంది. లేదంటే ఈ కథ నిదానంగా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది.

Also Read మన అనుభూతి ప్రేక్షకులు కూడా ఫీల్ అయితే…: ఎన్టీఆర్  

RELATED ARTICLES

Most Popular

న్యూస్