Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంగాడ్స్ మదర్ టంగ్

గాడ్స్ మదర్ టంగ్

Have Gods and Deities Language Preference?

భూత – భవిష్యత్- వర్తమాన మూడు కాలాలకు అతీతుడు దేవుడు. అందుకే త్యాగయ్య స్పష్టంగా కృష్ణుడిలో రాముడిని చూసి…కాలాతీత విఖ్యాత…సామజ వరగమనా! అన్నాడు. సామజ వరగమనా అంటే ఏనుగులా గంభీరంగా నడిచేవాడా! అని ఎక్కువమంది అనుకుంటున్న ఒక అర్థం. పట్టపుటేనుగు మీద, తెల్లటి గొడుగు నీడలో వెళ్లే సర్వంసహా చక్రవర్తి అన్నది మరొక అర్థం. నిజానికి సామజవరగమన అంటే పట్టపుటేనుగుపై విహరించేవాడా! అన్నదే సందర్భోచితమయిన అర్థం.

“గరుడ గమన తవ చరణకమలమిహ
మనసిల సతు మమ నిత్యం”
అని భారతీర్థ స్వామి రచించి లోకానికి ఇచ్చిన అనన్యసామాన్యమయిన సంస్కృత కీర్తన బాగా ప్రచారంలో ఉంది. సామజవరగమనా! అంటే ఏనుగులా నడిచేవాడా! అని ఒప్పుకుంటే…
గరుడగమనా!
అంటే గద్దలా నడిచేవాడా! అని కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది.
గరుడగమన
అంటే గరుడ వాహనం మీద ప్రయాణించే మహా విష్ణువు అయినప్పుడు…
సామజవరగమన అన్నప్పుడు పట్టపుటేనుగు మీద ప్రయాణించేవాడు అన్న అర్థమే తీసుకోవాలి.

చివరికి అంతటి సామజ వరగమనను నీ కాళ్లు పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు…దయలేదా అసలు…కళ్లు…పళ్లు…ఒళ్లు…కుళ్లు…అంటూ హీరోయిన్ కాలిగోటి ధూళికి దించేశాము.

ఆ కాలాతీత విఖ్యాతుడికి మనలా పుట్టుక- వృద్ధి- చావులు ఉండవు. మనకు గతం – వర్తమానం- భవిష్యత్తులు ఉంటాయి. ఆయన – ఆమె- అది కాలానికి అతీతం కాబట్టే కాలాతీత విఖ్యాత అని కీర్తిస్తున్నాం. పూజిస్తున్నాం.

దేవుడితో మనకెప్పుడూ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. అది కూడా దేవుడి మాయేనేమో!
ఏ భాషలో మాట్లాడితే పలుకుతాడు?
ఏ స్వరంతో పిలిస్తే పలుకుతాడు?
ఒక దీపం పెడితే కనపడతాడా?
రెండు వైపులా రెండు ఒత్తులు పెడితేనే కనపడతాడా?
గంట కొట్టి పిలిస్తేనే వస్తాడా?
ఉత్తరీయం కుడి భుజానికి వేసుకున్నందుకు గుమ్మం దాకా వచ్చిన దేవుడు గూట్లోకి రాకుండానే వెళ్లిపోతున్నాడా?
అరటిపండు తొక్క ఒలిచి ప్రసాదం పెట్టాలా?
పండు పండుగానే పెట్టాలా?
నుదుట కుంకుమ ఏ వేలితో పెట్టుకోవాలి?
కొబ్బరికాయ కొట్టి చిప్పలకు కుంకుమ పెట్టాలా? వద్దా?
కొట్టిన తరువాత పిలక తీయకపోతే మహాపరాధామా?
ఉత్తర ద్వార దర్శనం తప్ప మిగతా ద్వారాల దర్శనాలన్నీ ఎందుకూ కొరగానివేనా?

ఇలా ఆధ్యాత్మిక ఆచార వ్యవహారాల్లో మన ప్రశ్నలకు యక్షుడే మూర్ఛపోతున్నాడు. భక్తి ఛానెళ్లు, సోషల్ మీడియా పెరిగిన తరువాత పొద్దున్నే మంచం దిగడం, అన్నం వండడానికి కూడా ప్రవచనకర్తలే డైరెక్షన్ ఇస్తున్నారు.

ఒక్కో యుగానికి ఒక్కో ధర్మం, ఆచారం ఉంటుందని శాస్త్రమే అంగీకరించింది. దేశ కాల పరిస్థితులే ప్రమాణం. వినేవాళ్లు ఎర్రోళ్లోయితే చెప్పేవాడు ప్రతివాడు వేదం తనే రాసినట్లు చెబుతాడు.

మననాత్ ఇతి త్రాయతేతి…మంత్రానికి నిర్వచనమిది. పదే పదే మననం చేసుకోవడం వల్ల ఏది రక్షిస్తుందో…అది మంత్రం. సంస్కృతంలో ఉంటేనే మంత్రం అని మనం పొరబడ్డాం. మంత్రం అన్న మాట వ్యుత్పత్తిలో మనమనుకునే సంస్కృతం ప్రస్తావన లేనే లేదు.

భారతీయ ఆధ్యాత్మిక సాహిత్య చరిత్రను మలుపు తిప్పింది 12 వ శతాబ్దంలో మరాఠీ భజన సంప్రదాయం. అప్పటిదాకా సంస్కృతానికే పరిమితమయిన భక్తి సాహిత్యాన్ని జ్ఞానదేవ్, నామ్ దేవ్, ఏక్ నాథ్, తుకారాంలు జనం భాషలో- మరాఠీలోకి మళ్లించారు. అభంగాల పేరుతో మహారాష్ట్ర పురందర విఠ్టలుడిని భజించే ఈ కీర్తనలు అత్యంత సరళంగా ఉంటాయి. చిన్న చిన్న మాటల్లో ఎంతో తాత్వికత ఉంటుంది. ఎవరయినా, ఏ పని చేస్తున్నా పరవశించి పాడుకోవడానికి వీలుగా ఉంటాయి. చివర విట్టల విట్టల అంటూ వేగం పెరుగుతుంది. అదొక తాదాత్మ్యం. నామగాన సామగానం. వింటే…వారితోపాటు అంటే ఒళ్లు పులకిస్తుంది.

అప్పటిదాకా కేవలం అగ్రవర్ణాలకే పరిమితమయిన హిందూ భక్తి సాహిత్యం కేవలం మరాఠీ భజనలవల్లే అందరికీ చేరింది. మరాఠీ భజనలు వెనువెంటనే కన్నడ భాషను ఆక్రమించాయి.
“తంబూర మీటిదవా!
భవాబ్ది దాటిదవా!”
లాంటి కన్నడ జన సామాన్య భాషలో పురందాదాసు లాంటి వారు ఒక కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆ మరాఠి, కన్నడ భజనల ప్రభావమే మన అన్నమయ్య మీద పడింది. అందరికీ అర్థం కాని సంస్కృతంలో రాయడం కంటే…సామాన్యుల భాషలో పదాలు అల్లాలని అన్నమయ్య నిర్ణయించుకోవడానికి ఇదే నేపథ్యం. రామదాసు, త్యాగయ్య ఈ దారినే అనుసరించారు.

అంతెందుకు?
దక్షిణ భారతంలో వాల్మీకి రామాయణం ప్రామాణికం. ఉత్తర భారతంలో తులసీ దాస్ రామచరిత మానస్ ప్రామాణికం. పారాయణ గ్రంథం. అది సంస్కృతం కాదు. అవధి భాష. తన మాతృభాషలోనే రాసుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు భక్తి ప్రపత్తులతో భజిస్తున్న హనుమాన్ చాలీసా కూడా సంస్కృతం కాదు. అవధి. రాసింది తులసీదాస్. సకల భాషల్లో ఉన్న హనుమ మంత్రాలు, స్తోత్రాలు, కీర్తనలు ఎన్ని తక్కెడలో వేసినా…మరోవైపు హనుమాన్ చాలీసా పెడితే…ఆ బరువు ముందు మిగతావన్నీ తేలిపోతాయి.

తమిళంలో నయనార్ల భక్తి సాహిత్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు.

సకల వైష్ణవాగమాలన్నింటిని కాదని వెంకన్న అన్నమయ్య తెలుగు పదాల్లోనే ఇష్టంగా బందీ అయిపోయాడు.
“దాచుకో నీపాదాలకు తగ నే చేసిన పూజలివి”
అని అన్నమయ్య తెలుగు పద పుష్పాలను ఇస్తే…అయిదు వందల ఏళ్లయినా వాడని ఆ పుష్పాలను మెడలో వేసుకుని మురిసిపోతున్నాడు. ఎన్ని యుగాలకయినా ఇంకో అన్నమయ్య పుట్టి అలాంటి తెలుగుపూలతో వెంకన్నకు పూజ చేయగలడా?

ధనుర్మాసంలో శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పవిత్రంగా పారాయణ చేసే తిరుప్పావై సంస్కృతం కాదు; తెలుగు కాదు. తమిళం. స్కంధ షష్టి కవచం తమిళం.

సిరికి చెప్పకుండా అల వైకుంఠపురం మందార వనాలను వదిలి, గరుత్మంతుడిని కూడా వదిలి మహా విష్ణువు ఉన్నఫళాన వచ్చింది మన పోతన తెలుగు విని. తెలుగునాట సంస్కృత భాగవతం వినని వారు ఉండవచ్చు. పోతన భాగవతం వినని వారు మాత్రం ఉండరు. పోతన తెలుగులో చెప్పిన మహత్వ కవిత్వ పటుత్వ సంపద అంతా మంత్రమయమే. ఆయన భాగవతమంతా తెలుగు మంత్రాలే.

భద్రాద్రి రాముడితో రామదాసు మాట్లాడిందంతా తెలుగులోనే.

నీ దయరాదా?
అని తెలుగు త్యాగయ్య తమిళ కావేరీ తీరంలో గొంతెత్తి పాడితే అయోధ్య రాముడు-
అయ్యో రామా!
ఎందుకంతగా బాధపడుతున్నావు? అని వెంటనే బదులు పలికాడు.

ధూర్జటి తెలుగు పద్యాలను మహార్భటితో స్వర్ణముఖిలో గానం చేస్తే కాళహస్తీశ్వరుడు పొంగిపోయాడు.

శ్రీనాథుడు తెలుగు సీస పద్యాలు, తేటగీతులతో విజృంభిస్తే కాశీ తెలుగు గంగలో మునిగి తేలింది.

దేవుడు కాలాతీతుడే కాదు. భాషాతీతుడు కూడా. భాషలో దేవుడు ఉండడు. భావంలో ఉంటాడు.

అందుకే అన్నమయ్య పల్లవి ఎత్తుగడలోనే-

“భావింప సకల సంపద రూపమదిగో!”

“భావమునందున
భాగ్యమునందున”

“భావింపనున్నాడిందరి భాగ్యము వలెను”

పద చిత్రంగా ఫోటో తీసి మనకు అర్థమయ్యేలా పటం బిగించి ఇచ్చాడు.

ఎంత పూజ చేసినా,
ఎన్ని క్రతువులు చేసినా…
చివర-
“మంత్ర హీనం
క్రియా హీనం
భక్తి హీనం సురేశ్వర!
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అపరాధ సహస్రాణి…”
అని చెప్పి క్షమాపణలు అడగాల్సిందే.

దేవుడికి తగిన పూజలు మనమెప్పటికీ చేయలేం. మనకు తగినవే, మనకు చేతనయినట్లు, మన శక్తిమేర, మన నోరు తిరిగినట్లు చేస్తాం.

దేవుడి భాషలో మనం మాట్లాడగలిగితే మనం కూడా దేవుళ్లం అయిపోయినట్లే. నిజానికి దేవుడికి భాష లేదు.

“మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానమ్‌”
అన్నాడు శంకారాచార్యులు. మౌనంగా ఉండి కూడా దేవుడు మాట్లాడగలడు. ఆ మౌనంలోనే మనకు వ్యాఖ్యానం అందించగలడు.

మనం అరిస్తే కానీ మాట్లాడినట్లు కాదు. మన అలవాటు అది. దేవుడి స్థాయికి మనం ఎదగలేం కాబట్టి…దేవుడిని మన స్థాయికి దించేసుకుంటాం.

తమిళనాడు హై కోర్టు ముందుకు దేవుడి భాషకు సంబంధించిన ఒక కేసు వచ్చింది. ఒక గుడిలో తమిళ భాషలోనే మంత్రాలు, స్తోత్రాలు, పూజలు చేయడం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక సంప్రదాయవాది కేసు వేశాడు. విచారణ తరువాత కోర్టు ఇచ్చిన తీర్పు ఇది:-

“ప్రజలు మాట్లాడే ప్రతి భాషా దేవుడి భాషే. సంస్కృతమే దైవ భాష అన్న ప్రచారంలో నిజం లేదు. దేశవ్యాప్తంగా దేవుడి భాష గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.”

దేవుడా!
ఇంతకూ నీదే భాష?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: 

గోశాస్త్రం

Also Read: 

జనాభాను నియంత్రించారుగా! ఇక మీకు ఎంపీలెందుకు?

Also Read: 

కొళాయిల్లో శుద్ధ జలం

RELATED ARTICLES

Most Popular

న్యూస్