చిన్నప్పుడు స్కూళ్లలో భూత-భవిష్యత్-వర్తమాన కాలాలు చెప్పేవారు…భవిష్యత్తులో దేనికయినా ఉపయోగపడతాయని. భూతంలో భూత ప్రేత పిశాచ శాకినీ ఢాకినీ గాలి దయ్యాలున్నాయనుకుని ఏ భయాలూ లేని ఇంగ్లీషు పాస్టెన్స్ ను ఆశ్రయించాం. ఫ్యూచర్ మన చేతిలో ఉండదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ గా కంటిన్యూ అవుతుందని అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి నికరంగా మిగిలింది పాస్టెన్స్ ఒక్కటే. టెన్స్- tense అంటే కాలం, ఆత్రుత, ఆందోళన. పాస్ట్ టెన్స్ అంటే ఇంగ్లీషు వ్యాకరణంలో భూతకాలిక పదం. ఇది బూతు మాటలా ధ్వనిస్తుంది కాబట్టి భూతకాలాన్ని బొందలో పెట్టి పాస్టెన్స్ అనే వాడుతున్నారు.
కొందరికి ఫ్యూచర్ భయం.
కొందరికి ప్రెజెంట్ భయం.
తెలుగు పాటకు ప్రెజెంట్ లో పాస్టెన్స్ భయం.
ఫ్యూచర్ ను కూడా పాస్టెన్స్ చేసే కాలాతీత భయం.
ప్రెజెంట్ లో పవర్ కు గేట్లెత్తాల్సిన లాఠీ గాయక్ గేయక్ గాయాల భయం.
రక్తం కారకుండా కొట్టి బుర్ర రామ్ కీర్తన పాడించి, కళ్లల్లో గుంటూరు కారం చల్లే రచయిత మమకార భయం.
పాటలో మాటవరసకు అన్న “పాస్టెన్స్” కాదిది. హీరో యూనిఫామ్ తీసి కొడితే ప్రేక్షకులు పాస్టెన్స్ లో పడి ఉంటారని లిటరల్ మీనింగ్. హీరో దెబ్బకు పాస్ట్ టెన్స్…అంటే ఆందోళన ఒక్కటే మిగిలి చాలా టెన్స్ గా ఉండిపోతారని ఇన్నర్ మీనింగ్. దీన్నే లాక్షణికులు అభిదార్థం, లక్ష్యార్థం అంటారు. నిఘంటువులు, వ్యాకరణ శాస్త్రాలు చెప్పలేని ఇతరేతర మీనింగ్ లు కూడా ఉండి ఉండవచ్చు. కవి నియంత. కవి సృష్టికర్త. అతడి సృష్టిని మనం అనుభవించి…ఆపై అర్థమైతే సంతోషించాలే కానీ…అర్థమైతేనే సంతోషిస్తామని మొండికేసే హక్కు లోకానికి ఉండదు. ఉండాలని కోరుకోకూడదు.
మనం రేపటి మీద ఆశతో కలల్లో ఈరోజు బతుకుతూ ఉంటాం. ఆ కలల గాలిమేడలను కూడా పాస్టెన్స్ లోకి తన్ని, మనల్ని దోచుకునే దొరలు కలాలు పట్టుకుని కాలానికి సంకెళ్లు వేయడానికి సిద్ధంగా ఉంటారు.
ఉపమా కాళిదాసస్య
దండినః పద లాలిత్యం
భారవే అర్థ గౌరవాః…
సమస్త భారతీయ సాహిత్యంలో పోలిక చెప్పాలంటే కాళిదాసే. సుకుమార పద లాలిత్యం కావాలంటే దండి మహా కవే. పదానికి హిమాలయమంత అర్థ గౌరవం కావాలంటే భారవే…అని రెండు వేల ఏళ్లుగా ఆలంకారిక శాస్త్రవేత్తలు చెప్పుకుని పొంగిపోతూ ఉంటారు.
ప్రతి ముప్పయ్ ఏళ్లకు ఒక టార్చ్ బేరర్ టార్చ్ పట్టుకుని పదాల సృష్టి చేస్తూ భవిష్యత్తు వెలుగులను చీకటి పాస్టెన్స్ లోకి నెట్టేస్తుంటాడు. అతడు నడిచిన చీకటి దారుల్లో లోకం నడవాల్సి వస్తుంది. ఇదొక ఉచిత నిర్బంధ ప్రాథమిక పాస్టెన్స్ విద్య.
కాలమెప్పుడూ ఒకేలా ఉండదు. ఉండకూడదు. ఉండలేదు. ఈరోజుకు రేపు ఫ్యూచర్ టెన్స్. ఈరోజుకు నిన్న పాస్టెన్స్. నిన్నకు ఈరోజు ఫ్యూచర్ టెన్స్. ఈరోజుకు ఈరోజు ప్రెజెంటెన్స్. ఇప్పటికిప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యుయస్ టెన్స్. రేపటికి ఈరోజు, నిన్న రెండూ పాస్టెన్స్.
మన రచయిత రాస్తే…
పదాల్లో పడకుండా మన హీరో లేస్తే…
అన్ని టెన్సులకు పాస్టెన్సే.
ప్రస్తుత తెలుగు పాట లక్షణ శాస్త్రాన్ని పైపైన పరిశీలిస్తే టెన్స్ లు ఈ విధంగా ఉంటాయి.
పాడు తెలుగు “గో”:-
ప్రెజెంటెన్స్
పాడు తెలుగు “హ్యస్ బీన్ గోయింగ్”:-
ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యుయస్ టెన్స్
పాడు తెలుగు “వెంట్”:-
పాస్టెన్స్
పాడు తెలుగు “గాన్”:-
పాస్ట్ పార్టిసిపిల్
పాడు తెలుగు “గాయబ్”:-
ఆపరేషన్ సక్సస్. పేషంట్ డైడ్.
ఇంకా స్పీడ్ గా, లోతుగా పాస్టెన్స్ లోకి వెళ్లదలుచుకున్నవారు రెన్ అండ్ మార్టిన్ హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ కంపొజిషన్ బుక్ గానీ; తెలుగు చిన్నయసూరి బాల వ్యాకరణం పుస్తకం గానీ వెంటతీసుకుని యూ ట్యూబ్ ను సంప్రదించగలరు. ఇక మీరు పొరపాటున కూడా ప్రెజెంట్ టెన్స్ లోకి రాలేరు. ఫ్యూచర్ టెన్స్ ఉండనే ఉండదు!
మాట వినకపోతే హీరో వచ్చి వెన్నుపూస విరిచి వెన్న పూస్తాడని పుత్ర సంబోధన సహిత హెచ్చరిక ముందే ఉంది.
మాట వింటారో!
వినకుండా వెన్నెముక విరగ్గొట్టించుకుంటారో!
మీ ఇష్టం!!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read:
Also Read: