Launch Of Pharma City In Hyderabad :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ.. ప్రారంభానికి సిద్ధమవుతున్నది. రోడ్లు, లైట్ల ఏర్పాటు పనులు దాదాపు పూర్తయ్యాయి. వ్యర్థ జలాల శుద్ధి ప్లాంటు (సీఈటీపీ) నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. దీంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వచ్చే నెలాఖర్లో ఫార్మాసిటీని ప్రారంభించేందుకు టీఎస్‌ఐఐసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో వేలాది ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఔషధ, పరిశోధన సంస్థలకు సంబంధించి ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన ఎకోసిస్టంను ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు. మొదటి దశలో భాగంగా ఇప్పటికే 9,212 ఎకరాల భూమిని సేకరించగా, 6,719 ఎకరాల్లో రోడ్ల నిర్మాణం, విద్యుత్ లైన్ల ఏర్పాటు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తయ్యాయి. మిగిలిన భూముల సేకరణ వివిధ దశల్లో ఉండగా, భూ సేకరణకు సంబంధించి గ్రామసభల నిర్వహణ ప్రక్రియ కూడా ముగిసింది. కేంద్రం ఇదివరకే ఈ ఫార్మాసిటీని నేషనల్ ఇండస్ట్రియల్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)గా గుర్తించింది. పర్యావరణ అనుమతులు సైతం మంజూరయ్యాయి. స్థలాల కేటాయింపు కోరుతూ 200లకుపైగా ఔషధ, పరిశోధన సంస్థలు టీఎస్‌ఐఐసీకి దరఖాస్తు కూడా చేసుకున్నాయి.
రూ.2వేల కోట్లతో సీఈటీపీ..
———————————
సీఈటీపీ నిర్మాణానికి సుమారు రూ.2,000 కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనా. అయితే నిమ్జ్ మార్గదర్శకాల ప్రకారం ఫార్మాసిటీ అభివృద్ధి, విస్తరణ, మౌలిక సదుపాయాల కోసం రూ.4,922 కోట్లు మంజూరు చేయాలని అధికారులు ఇదివరకే కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. పలుమార్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సైతం కేంద్రానికి లేఖలు రాశారు. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) బడ్జెట్‌లో కనీసం రూ.870 కోట్లనైనా కేటాయించాలని కోరినా కేంద్రం మొండిచేయే చూపింది. ఇక మొదటి దశలో 400 కంపెనీలకు స్థలాలు కేటాయించాలని నిర్ణయించారు. ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా అర ఎకరం, ఎకరం నుంచి పది ఎకరాలకుపైగా స్థలాలు ఇవ్వనున్నారు.
ఫార్మా @ హైదరాబాద్
—————————–
ఔషధ రంగంలో హైదరాబాద్ నగరానికి ప్రత్యేక స్థానం ఉన్న సంగతి విదితమే. ఇప్పటికే దేశీయ ఔషధ ఉత్పత్తుల్లో మూడో వంతు మన రాష్ట్రం నుంచే ఉన్నందున నగరానికి ఫార్మా క్యాపిటల్‌గా ఖ్యాతి లభించింది. నగరంలో దాదాపు 300 ఫార్మా కంపెనీలు ఔషధాలను తయారు చేస్తున్నాయి. ఇందులో చాలా కంపెనీలు యూఎస్‌ఎఫ్‌డీఏ గుర్తింపు పొంది అమెరికా, ఐరోపా దేశాలతోపాటు ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫార్మా రంగంలో మరింత అభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో పర్యావరణ హిత పరిశ్రమలను నెలకొల్పడానికి అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో ముచ్చెర్ల ఫార్మాసిటీని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. నిమ్జ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మన రాష్ట్రం ప్రపంచ ఔషధ హబ్‌గా మారుతుందనడంలో సందేహం లేదని అధికారులు చెప్తున్నారు.
ఫార్మాసిటీ విశేషాలు
—————————-
• మొత్తం విస్తీర్ణం 18,304 ఎకరాలు
• మొదటి దశలో అందుబాటులోకి9,212 ఎకరాలు
• పెట్టుబడుల అంచనా 64,000 కోట్లు
• వార్షిక ఎగుమతులు 58,000 కోట్లకు అవకాశం
• ఉపాధి-ఉద్యోగావకాశాలు 5.60 లక్షలు
Also Read : విజయపథంలో వి-హబ్