ఆఫ్రికా ఖండంలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం నత్త నడకన సాగుతోంది. ఇప్పటివరకు కోటి ఇరవై లక్షల జనాభాకు పూర్తి స్థాయిలో టీకా ఇవ్వటం పూర్తైంది. అయితే ఇది ఆఫ్రికా జనాభాలో ఒక శాతం కన్నా తక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O) వెల్లడించింది. ప్రపంచ దేశాలు థర్డ్ వేవ్ ఎదుర్కునేందుకు సిద్దమవుతుండగా ఆఫ్రికా దేశాల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని W.H.O వర్గాలు తెలిపాయి.
మరోవైపు ఆఫ్రికాలో కరోన కేసులు వారానికి 20 శాతం చొప్పున పెరుగుతున్నాయి. కోవిడ్ కేసులు, మరణాలు 22 దేశాల్లో చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. గత నెలతో పోలిస్తే ఇప్పుడు టీకా కార్యక్రమం ఉదృతంగా సాగుతోంది. గతంలో వారానికి కేవలం 35 లక్షల జనాభాకు టీకా ఇవ్వగా, ఇప్పుడు యాభై లక్షల జనాభాకు ఇస్తున్నారు. దక్షిణాఫ్రికా, బోట్స్ వాన , ఈజిప్ట్, కాంగో, జింబాబ్వే తదితర కొన్ని దేశాల్లో తప్పితే చాలా దేశాల్లో ప్రజలకు వ్యాక్సిన్ సరిగా అందటం లేదు.
టీకా అందకపోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. వ్యాక్సిన్ చేర్చాల్సిన ప్రాంతాలకు ఉగ్రవాదులు, వేర్పాటువాదులతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజల కోసం తరలిస్తున్న టీకాల్ని రెబెల్ గ్రూపులు ఎత్తుకుపోతున్నాయి. అంతర్గత కుమ్ములాటలు, తిరుగుబాట్లు, పేదరికం కారణంగా చాలా దేశాలు ఇతరుల సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. వైద్య, పరిపాలనా యంత్రాంగం సరిగా లేక 23 దేశాల్లో ఇప్పటివరకు మొదటి డోసు కూడా ప్రజలకు అందటం లేదు.