జమ్ముకశ్మీర్‌లోని ఉత్తర ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు పెరిగాయి. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్న ఉగ్రవాదులు వేసవి మొదలవటంతో బయటకు వచ్చి దాడులకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు సోపోర్‌లో లష్కరే తొయీబా ఉగ్రవాదిని భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసులు, ఇండియన్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ పోలీసులు సోపోర్‌లోని పెత్ సీర్ రైల్వే స్టేషన్ సమీపంలో సయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలను చూసి ఓ వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో అదుపులోకి తీసుకున్నారు.
Sopore: కశ్మీర్‌లో పెరిగిన ఉగ్రవాదుల కదలికలు
అనంతరం అతడిని ఉమర్ బషీర్ భట్‌గా గుర్తించారు. అతడు లష్కరే తొయీబా ఉగ్రసంస్థలో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతని నుంచి హ్యాండ్ గ్రనేడ్, పిస్తోల్, పిస్తోల్ మ్యాగజైన్, 15 పిస్తోల్ లైవ్ రౌండ్లు, మొబైల్ ఫోన్, ఒక సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అతనిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.