Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమందు బాబుల దేశ సేవ

మందు బాబుల దేశ సేవ

liquor as income source: ప్రపంచాన్ని ఆర్ధిక సంక్షోభం చుట్టుముడుతోంది.
దానికి తోడు కోవిడ్ మహమ్మారి వల్ల ప్రజల ఆదాయం, ప్రభుత్వాల ఆదాయం గణనీయంగా పడిపోయింది.
ప్రభుత్వాలు నడవడానికి నానా కష్టాలు పడుతున్నాయి.
ప్రభుత్వాలకు ఆదాయం లేక అభివృద్ధి- సంక్షేమం మూలన పడే పరిస్థితి వస్తోంది.
అలాంటి సమయంలో ప్రభుత్వాలను ఆదుకొంటున్న ‘దేశ భక్తులు’ కేవలం ‘మందు బాబులే’
తమ శాయశక్తులా తాగుతూ ప్రభుత్వాల ఆదాయాలు విపరీతంగా పెంచుతున్నారు.
తాము ఆర్ధికంగా, శారీరకంగా, మానసికంగా కష్టపడ్డా, నష్టపోయినా ప్రభుత్వ ఆదాయాలకు మాత్రం లోటులేకుండా చూస్తున్నారు.
జీవితం క్షణభంగురం. కష్టాలు, సుఖాలు వస్తూ, పోతూ ఉంటాయి.
మనకు సంతోషం వచ్చిన కాసేపు జీవితం బాగానే ఉన్నట్టు అనిపించినా దుఖం వచ్చినప్పుడే అనుభవించడం కాస్త కష్టం.
ఆమాట కొస్తే దక్కిన సుఖం పూర్తిగా అనుభవంలోకి తెచ్చుకోవాలన్నా లేదా
దుఖాన్ని దైర్యంగా ఎదుర్కొని, తట్టుకొని తలెత్తి నిలబడాలన్నా..
గట్టి మనో నిబ్బరం ఇవ్వగల ఒక తోడు కావాలనిపిస్తుంది.

ఇక ఆ తోడు అనేది…. ఈ క్షణ భంగుర జీవితాలతో బ్రతకలేక బతికే తోటి మనుషులలోనో, రాయి-రప్ప లోనో, చెట్టూ-పుట్ట లోనో  వెదికే కంటే.. నాలుగు రూకలు వెచ్చిస్తే వచ్చే ‘మద్యం’లోను, కాస్త కడుపులో పడగానే అదిచ్చే కిక్కు లోనూ వెతుక్కొంటున్నట్లున్నాడు… సగటు మానవుడు.

‘పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్’  అని మన గురజాడ వారి గిరీశం బలగుద్ది మరీ చెప్పాడు కాబట్టి అలాగే మందు తాగనివాడు కూడా అలాంటిదో మరో శునకమో, సూకరమో, మార్జాలమో అయి పుడతాననే భయమే ఏమో జనం తెగ తాగేసి ఆకాశ హార్మ్యాలలో విహరిస్తున్నారు.

నిజానికి ‘నిషా ఇచ్చే వేరే కిక్కే వేరబ్బా’ ఇది మందురాయుళ్లు మాకుమ్మడిగా చెప్పే మాట.

ఒకప్పుడు విలాసమైన ‘సురా పానం’..

క్రమంగా ‘సౌకర్యాల’ హద్దు దాటి.. ఇప్పుడు ‘అవసరమై’ కూర్చుంది.
ఒకసారి ‘అవసరం’ అనిపించాక ఇక తప్పదు కాబట్టి అన్నం తిన్నట్లు, గాలి పీల్చినట్లు, మందూ తాగాల్సిందే. విందు, వినోదం, విషాదాలలో పరువు కోసమో, ప్రతిష్ఠ కోసమో, మర్యాద కోసమో, సరదా కోసమో, మొదలైన ఈ ‘సురా పానం’ దాదాపు ప్రతి వాడికి ఇప్పుడో ఒక ‘వ్యసనమై’ కూర్చుంది.

ధనిక-పేద, పెద్దా-చిన్నా, ఆడ-మగ తేడా లేదు.
నలుగురూ కలిసే ఆనందకర సన్నివేశమైనా..
వరో ఒకరు ‘పోయిన’ విషాద సన్నివేశమైనా..
రెండు జీవితాలను ముడి వేసే పెళ్లి అయినా.. ‘మందు’ పుచ్చుకోవడం కామన్ అయిపొయింది

ఇలా ‘అవసరమై’ కూర్చున్న ఈ ‘మద్య సేవనం’ సగటు, బీద మధ్య తరగతి జీవుల ఆస్తులను కరిగించడంతో పాటు, అస్తులను కుళ్ళబొడుస్తోంది. సంసార జీవితాలను ఛిద్రం చేసి, వారి జీవితాలలో విషాదం నింపి, అప్పులపాలు చేసి, ఆత్మహత్యలకు పురిగొల్పుతోంది.  ఈ నిషాచరుల కుటుంబాలలో పిల్లల ‘బాలారిష్ట బాధలు’ వర్ణనాతీతం.

ఒకసారి ఇది అవసరంగా మారాక,

స్వదేశీయో-విదేశీయో.. బ్రాండెడో- లోకలో..
కాష్ట్ లీయో-చీపో, చివరికి నాటుదో..దొంగదో అయినా సరే ‘సారా’ కావాల్సిందే.
ఉంటే డబ్బులిచ్చో, లేదంటే అప్పు చేసో,
అప్పు ఇవ్వనంటే.. పెళ్ళాం మెడలో పుస్తెలు తాకట్టుపెట్టి గానీ, అమ్మేసి గానీ తాగాల్సిందే.
మందు ఊళ్ళో దొరకకపోతే.. ఊరి పొలిమేరలు, రాష్ట్ర పొలిమేరలు దాటి అయినా తెచ్చుకొని తాగేయాలి.
అంతే కాని దొరక్కపోతే ‘’తాగేదేలే’ అని తగ్గేదేలేదు.

కాబట్టి ప్రభుత్వం వారు కూడా ప్రజలు తాగడానికి పడే నానా కష్టాలను అర్ధం చేసుకొని, జాలిపడి,
తాగేది దొరికిచ్చుకోవడానికి ఎక్కువ కష్టపడకుండా సందు సందు కు , గొందు గొందు కో “వైన్ షాప్” ఇచ్చి..
ఇంకా ఉదారంగా గల్లీ గల్లీ కో, ఇంటి-ఇంటికో “బెల్ట్ షాప్” కు కూడా అనుమతి ఇచ్చేస్తున్నారు.

తాగేవాడు ఎలాగో మానడు. మనం అమ్మకపోతే, దొరికే చోట కొనుక్కొచ్చి మరీ తాగుతాడు.
ఆపాటి దానికి మన ఆదాయం పోగొట్టుకోవడం ఎందుకు..అని ప్రభుత్వాలు కూడా వైన్ షాప్ లకు పోటా-పోటీగా అనుమతులు ఇచ్చి, వాటి మధ్య ఒక ‘ఆరోగ్యకరమైన పోటీ’ పెట్టి  ‘సరసమైన ధరలకే నాణ్యమైన సరుకు’ ప్రజలకు అందించి ‘అనారోగ్యాన్ని’ శాయశక్తుల పెంచుతున్నాయి.
ప్రజలు తాగుతున్న మద్యంపై వస్తున్న ఆదాయాన్ని ప్రభుత్వాలు పైసా కూడా దాచుకోకుండా ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికే పోటీ పడి మరీ ఖర్చు చేస్తున్నాయి.
మరి జనం తాగకపోతే, అభివృద్ధి అర్ధసున్న, సంక్షేమం గుండు సున్న అవుతుంది.
కాబట్టి మందుబాబుల దేశ సేవను గుర్తించాలి.
కాబట్టి ప్రతి వాడి తాగే ప్రతి చుక్కను ఆధార కు అనుసంధానం చేసి, సగటున సంవత్సరం లో వాడు తాగి ప్రభుత్వానికి కట్టిన పన్ను ను ఆధారం చేసుకొని ‘మందు శ్రీ’  ‘మందు రత్న’ వంటి బిరుదులు కూడా ఇవ్వాలి.

న్యూ ఇయర్ సంబరాల్లో భాగంగా రెండ్రోజుల్లో తెలంగాణా లో 248 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ లో 124 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి.

కాబట్టి ఎప్పుడో ఆత్రేయ చెప్పినట్లు..

తాగితే మరిచి పోగలను తాగనివ్వరు
మరిచిపోతె తాగగలను మరువనివ్వరు.. అని ప్రభుత్వాలను అడిపోసుకోకుండా
జనాన్ని తాగానివ్వాలి, మరిచిపోనివ్వాలి, మళ్ళీ తాగానివ్వాలి, మళ్ళీ మళ్ళీ తాగానివ్వాలి.
మనిషి బ్రతుకింతే, తాగలేని మనిషికీ సుఖము లేదంతే” అని పాడు కోవాలి.

మన ప్రజాస్వామ్య దేశంలో

రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్చ, స్వాతంత్రం,
ప్రభుత్వాలు అమ్మే “సారాయి”
ఇక ప్రజలను తాగకుండా ఎవరు ఆపగలరు?

కాబట్టి మందుబాబులు-  తాగండి, తాగండి.. కానీ గుర్తు పెట్టుకోండి.. ప్రభుత్వం మీ సంక్షేమం కోసం ఖర్చుపెడుతున్న ప్రతిపైసా మీరు తాగుడు కోసం పెడుతున్న ఖర్చు ద్వారానే వస్తోందని గమనించండి.

– శ్రీ వెంకట సూర్య ఫణి తేజ

Also Read :

ముగ్గు.. ఓ అందమైన కళ

RELATED ARTICLES

Most Popular

న్యూస్