We Support: అంగన్‌వాడీ, ఆశావర్కర్ల ఉద్యమాన్ని అణచివేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఎన్నికలకి ముందు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరితే అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
అంగన్ వాడీలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవు మంజూరు చేయాలని, సర్వీసులో ఉండి చనిపోయిన వారికి 50 లక్షలు పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రేషన్‌కార్డులు తొలగించి సంక్షేమ పథకాలు అందకుండా చేయొద్దని, ఖాళీగా వున్న అంగన్‌వాడీ వర్కర్లు-హెల్పర్లు పోస్టులు భర్తీ చెయ్యాలని వారు డిమాండ్ చేస్తున్నారని, తమ న్యాయపరమైన కోర్కెలు పరిష్కరించాలని ఆందోళన చేయడం నేరమా అని ప్రశ్నించారు. ఈ మేరకు అయన ట్వీట్ చేశారు.
కరోనా సమయంలో తమ ప్రాణాలు పణంగాపెట్టి విధులు నిర్వర్తించిన ఆశా వర్కర్లని ప్రంట్‌లైన్ వారియర్స్ గా గుర్తించిన ప్రభుత్వం వారికి కనీసం మాస్కులు, చేతికి గ్లౌజులు, ఇతర రక్షణ పరికరాలు ఇవ్వకపోవడం వివక్ష చూపడమేనన్నారు. కోవిడ్-19 మెడికల్ టీములతో వెళ్లి విధి నిర్వహణలో కోవిడ్ సోకి మరణించిన ఆశ కార్యకర్తలకు ఎటువంటి పరిహారం ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ఇచ్చిన నిరసన తెలిపే హక్కుని నిర్బంధాల ద్వారా హరించడం సిఎం జగన్ మానుకోవాలని సూచించారు. అంగన్ వాడీ, ఆశాల న్యాయమైన డిమాండ్లు తక్షణమే నెరవేర్చాలని ప్రభుత్వానికి హితవు పలికారు.
Also Read : ఉద్యోగులపై ఎందుకంత కక్ష? లోకేష్