Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆధునిక ధర్మ సూక్ష్మం

ఆధునిక ధర్మ సూక్ష్మం

Modern Dharma: వాల్మీకి రామాయణం కిష్కింధ కాండలో వాలి వధ, ఉత్తరకాండలో ఒక భిక్షువు- కుక్క సంవాదం…రెండు సందర్భాల్లో రాజు శిక్షించండం వల్ల పాపం పోతుందని ఒక ధర్మసూక్ష్మ విశ్లేషణ ఉంటుంది. వాలిని చంపకపోతే రాజుగా రాముడికి ధర్మపాలన చేయని దోషం అంటుకుంటుంది. రాజు చేతిలో శిక్ష అనుభవించాడు కాబట్టి వాలికి పాపం పోయి మోక్షం లభించింది.

అలాగే ఉత్తరకాండలో ఒక భిక్షువు వీధిలో తన మానాన తనున్న ఒక కుక్కను అకారణంగా కొడతాడు. రక్తం కారుతూ ఆ కుక్క న్యాయం కోసం అయోధ్యలో రాముడి అంతః పురంలో ప్రజల వినతులు వినే చోటుకు వెళ్లి పంచాయతీ పెడుతుంది. అకారణంగా కొట్టిన మాట నిజమే అని భిక్షువు నేరాన్ని అంగీకరించినా… చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, సన్యాసులు చేసిన మొదటి తప్పును మన్నించాలని న్యాయపరిషత్– ఇప్పటి భాషలో కోర్టు ఫుల్ బెంచ్ అభిప్రాయపడింది. చేసిన నేరాన్ని అంగీకరించావు, భిక్షువు కాబట్టి మొదటి తప్పుగా పరిగణించి వదిలేస్తున్నాం… జాగ్రత్త…ఇకపై సంయమనంతో ఉండు…పో…అంటాడు రాముడు. “రామ! రామ! నాకు శిక్ష వేయకపోతే నీమీద పాలనా దోషం పడుతుంది. పైగా నేను శిక్ష అనుభవించడం వల్ల…నా పాపం పోతుంది…” అని భిక్షువు ప్రాధేయపడతాడు. ఏ శిక్ష వేద్దాం? అని రాముడు కుక్కనే అడిగాడు. అయోధ్యలో ఏదయినా గుడికి ధర్మకర్తగా వేయండి స్వామీ! అని కుక్క విన్నవించుకుంది. రాముడు అలాగే చేశాడు.

(గుడికి ధర్మకర్త అంటే గొప్ప వరం కదా? శిక్ష ఎలా అవుతుంది? అని అనుకుంటాం. అక్కడ కుక్కగా ఉన్నది గత జన్మలో ధర్మకర్త హోదాలో గుడి నిర్వహణ వెలగబెట్టిన మనిషే. ఆ విషయం ఆ కుక్కకు తెలుసు. రాముడికి తెలుసు. వాల్మీకికి తెలుసు. మనకు తెలియాలనే ఈ కథను అంత విస్తారంగా వాల్మీకి రికార్డ్ చేశాడు.)

ఇందులో ధర్మ సూక్ష్మం ఏమిటంటే ఏదయినా తప్పు చేస్తే…ఆ తప్పుకు శిక్ష అనుభవిస్తే ఆ అకౌంట్ సెటిలవుతుంది. పాపం మూట కట్టుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది.

చక్రవర్తులు, రాజులు, సామంత రాజులు పోయి ప్రజలే ఎన్నుకునే ప్రజాస్వామ్యం వచ్చిందని చాలాసార్లు మురిసిపోతూ ఉంటాం. స్వరూపం మారినా స్వభావం మారదని చాలా సందర్భాలు మనకు ఎరుకపరుస్తూ ఉంటాయి. ప్రజాస్వామ్యం గొప్పతనమదే.

ప్రపంచంలో ప్రజస్వామ్యమంత అరాచకమయినది మరొకటి లేదు; దానికి మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు” అని ఒక తత్వవేత్త నిట్టూర్పు.

రామరాజ్యం పోయిందని మనం బాధపడాల్సిన అవసరం లేకుండా అప్పుడప్పుడూ రామరాజ్యం మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతూ ఉంటుంది. మన అనుభవంలోకి వస్తూ ఉంటుంది. అలాంటి పులకింత ఇది. అనివార్య కారణాలవల్ల డొంకతిరుగుడుగా ఉన్నా…ముళ్ల మీద వేసిన వస్త్రంలా ఇందులో నీతిని జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి.

ఒకానొక చక్రవర్తి తినే అన్నం మీద రోజుకు మూడు పూటలా పన్నులు వేస్తూ ఉంటాడు. చక్రవర్తి పూటకు ముప్పావలా పన్ను వేస్తే…సామంతరాజులు పూటకు పావలా పన్ను వేయాల్సిన రాచరిక పాలనా సంవిధానం ఒకటి ఉండి చచ్చింది. కొన్నేళ్ల తరువాత సామంతరాజులు నీళ్లు నములుతూ… “మహా ప్రభో! రోజుకు మూడు పూటలా పన్నులు వేయడంతో మన రాజ్యం ప్రజలు పళ్లున్నా…పళ్లు తినడం మానేసి…గోళ్లు తింటున్నారు…దీనితో అంతా గోళ్ల గోలగోలగా ఉంది. గోళ్లులేని వాళ్లు…వేళ్లు తింటున్నారు…వేళ్లు కూడా అయ్యాక…చేతులు తింటున్నారు…రాజ్యమంతా అవిటిదవుతోంది…”
అని గుండెలు బాదుకున్నారు.

అంతే…చక్రవర్తి అగ్గిమీద గుగ్గిలం అయిపోయాడు.
“ఠాట్!
వాట్ నాన్సెన్స్ యూ ఆర్ టాకింగ్?
నా ప్రియతమ ప్రజల మీద పూటకు పావలా పన్ను వేస్తున్నారా?
మీరు మనుషులేనా?
మీకసలు జాలి, దయ లేవా?
వెంటనే ఆ పావలా తగ్గించండి…అని హుకుం జారీ చేశాడు.

సరిగ్గా అదే సమయానికి భోజనం వేళ అయ్యింది. ఆ పూటకు చక్రవర్తిగారు భోజనం మీద పెంచిన ముప్పావలా పన్ను ఉత్తర్వును చర్మం మీద రాసి రాజ ముద్ర వేసిన ఆదేశాన్ని పరివారకుడు తెచ్చి సమావేశానికి వినిపించి వెళ్లాడు. ఇదో అంతులేని కథ.

తెలిసి చేసినా, తెలియక చేసినా…తప్పు తప్పే. పాపం పాపమే. అప్పుడు వాలి, భిక్షువు శిక్ష అనుభవించడం వల్లే పాపంలో పడకుండా జాగ్రత్త పడ్డారు. అది రామరాజ్యం. ఇప్పుడు కూడా రామరాజ్యమే. మన పాపాలు మనకు తెలియవు. ప్రభువు చేతిలో శిక్షలు పడేకొద్దీ…ఆ పాపాలు పటాపంచలవుతూ ఉంటాయి. మనల్ను శిక్షించకపోతే ప్రభువుకు పాలనా దోషం అంటుకుంటుంది.

ధర్మ ప్రభువు చల్లగా ఇలాగే రోజుకు మూడు పూటలా శిక్షిస్తూ ఉండాలి!
శిక్షించు ప్రభూ!
బాగా శిక్షించు!
ఇంకా ఇంకా శిక్షించు!!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

రాయినయినా కాకపోతిని…

Also Read :

రాములో! రాములా! ఇంతకూ నీవెవరు?

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్