Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

నకిలీ విత్తన తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జైలుకు వెళ్ళాల్సి వస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ప్రధానంగా పత్తి, మిరప విత్తనాలలో నకిలీ విత్తన సమస్య  ఉన్నదన్నారు. వానాకాలం వ్యవసాయ ప్రణాళికలో భాగంగా నకిలీ విత్తనాల అమ్మకాలను అరికట్టేందుకు అన్ని జిల్లాల ఎస్పీలు, డీఎఓ, ఎఓలతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.

తక్కువ ధరకు విత్తనాలు లభిస్తుండడం మూలంగానే రైతులు నకిలీ విత్తనాల వైపు మొగ్గుచూపుతున్నారని, ప్రధానంగా సాగులో ఉండే కలుపు సమస్యను ఎదుర్కోవడానికి  గడ్డి మందు కొట్టేందుకు అవకాశం ఉండడంతో కలుపుకూళ్లు తగ్గుతున్నాయని రైతులు నకిలీ విత్తనాల వైపు ఆకర్షితులవుతున్నారని మంత్రి పేర్కొన్నారు. గడ్డి మందు గ్లైఫో సెట్ అమ్మకాలపై వ్యవసాయ అధికారులు నిఘాపెట్టాలన్నారు. లైసెన్స్  లేకుండా విత్తనాలు అమ్మినా, కాలంతీరిన విత్తనాలను అమ్మినా కఠినచర్యలు తీసుకోవాలి .. హెచ్ టీ కాటన్ విత్తనాలను అరికట్టాలని ఆదేశించారు.

రైతులు తక్కువ ధరకు వస్తున్నాయన్న ఉద్దేశంతో నకిలీ విత్తనాలను కొనవద్దని మంత్రి కోరారు. ఈ ఏడాది పత్తి సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి .. అంతర్జాతీయంగా తెలంగాణ పత్తికి డిమాండ్ ఉన్నదని, గత ఏడాది వర్షాలు వెనకాముందు కావడం, అధికవర్షాల మూలంగా పెద్దఎత్తున సాగు చేయలేకపోయారన్నారు. తనిఖీలలో నిబంధనల మేరకే టాస్క్ ఫోర్స్ టీం వ్యవహరించాలని, తనిఖీలలో అత్యుత్సాహం ప్రదర్శించడం, తనిఖీల పేరుతో భయబ్రాంతులకు గురిచేయడం సరికాదని సూచించారు. నకిలీ విత్తనాలతో పట్టుబడ్డ వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

విత్తనరంగంలో తెలంగాణకు ఉన్న ఖ్యాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నదని, నకిలీ విత్తనాల కేసులను విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు. చట్టంలోని లొసుగులతో దోషులు తప్పించుకోకుండా వెంటనే  శిక్షలు అమలయితే నకిలీ విత్తన తయారీదారులలో మార్పు వస్తుందన్నారు. దోషులు తప్పించుకోవద్దు .. నిర్దోషులు ఇబ్బందులు ఎదుర్కోకూడదు .. రైతుల కష్టం వృధాకావద్దని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ఈ కార్యక్రమంలో  హోమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి  రఘునందన్ రావు,  సీపీలు  మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, ఐజీ నాగిరెడ్డి, ఐజీ డీఎస్ చౌహాన్, అడిషనల్ డీజీ ఇంటలిజెన్స్  అనిల్ కుమార్, ఐజీపీ ఇంటలిజెన్స్  రాజేష్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు,  రంగారెడ్డి కలెక్టర్ అమేయ్ కుమార్, సీడ్స్ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com