కజకిస్తాన్ లో అల్లర్లు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అల్లరి మూకలను కట్టడి చేసేందుకు దేశాధ్యక్షుడు కాసిం జోమర్ట్ తోకయేవ్ భద్రతా బలగాలకు అపరిమిత అధికారాలు కట్టబెట్టారు. అల్లర్లకు కారణమైన వారిని హెచ్చరిక లేకుండానే కాల్చివేసేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఇప్పటివరకు జరిగిన హింసలో 18 మంది భద్రత సిబ్బంది తోపాటు 26 మంది పౌరులు మృత్యువాతపడ్డారు. కజక్ ప్రభుత్వం సుమారు నాలుగు వేలమందిని నిర్భందించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. జాతీయ భద్రతా కమిటీ మాజీ అధిపతి కరీం మసిమోవ్ ను దేశద్రోహం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అల్లర్లకు కరీం కూడా సూత్రధారి అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఎల్పీజీ ధరల పెంపుకు వ్యతిరేకంగా కజికిస్థాన్‌లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నిరసనకారులతో పాటు పోలీసులు కూడా ఉన్నారు. చములు ధరలు పెరగడంతో ఆగ్రహానికి గురైన ప్రజలు తొలుత రాజధాని అల్మాటీ నగరంలో మేయర్ భవనాలకు, అధ్యక్ష భవనాలకు నిప్పంటించారు. తర్వాత ఆందోళనలు దేశమంతటా వ్యాపించాయి. ఆందోళనల్లో పదుల సంఖ్యలో నిరసనకారులు చనిపోగా… 853 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలామంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
ఆందోళనలను అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నించగా వారు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఓ పోలీస్ అధికారిని తల నరికి చంపేశారు. ఈ ఘర్షణలను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదనపు భద్రతా బలగాలను సమకూర్చాలని కోరుతూ దేశాధ్యక్షుడు ఖాసిమ్ జోమార్ట్ టోకాయేవ్.. రష్యాకి విజ్ఞప్తి చేశారు. దీంతో రష్యా దళాలు అక్కడకు చేరుకున్నాయి.
ఘర్షణలు జరుగుతోన్న అల్మాటీ, మాంగిస్టౌ ప్రావిన్స్ ప్రాంతాల్లో ప్రభుత్వం జనవరి 19 వరకు అత్యవసర పరిస్థితి విధించింది. ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేసింది. సోమవారం వరకు టర్కీ , కజికిస్థాన్ మధ్య అన్ని ఫ్లైట్లను నిలిపివేసినట్టు టర్కీ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. కజికిస్థాన్ ప్రజలు ఎల్పీజీ గ్యాస్‌ని ఎక్కువగా కార్లలో వినియోగిస్తారు. అయితే ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం చమురు ధరలపై సబ్సిడీలను ఎత్తేసింది. దాంతో ధరలు పెరిగాయి. ధరల పెంపుకు నిరసనగా ప్రజలు గత ఆదివారం నుంచి నిరసనలకు దిగారు. కాగా 1991లో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన కజికిస్థాన్ అప్పటి నుంచి ఒకే పార్టీ పాలనలో ఉంది.