తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి సేవలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని మంత్రి కోరారు. రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, కిస్మత్పూర్ గ్రామంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన మొబైల్ వాహనాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి పేర్కొన్నారు.
1 కోటి 30 లక్షల రూపాయల విలువ చేసే అత్యాధునిక టెక్నాలజీతో డయాగ్నస్టిక్ మొబైల్ వాహనాన్ని సత్యసాయి సేవ సమితి వారు ఇవ్వడం సంతోషాన్ని కలిగించిందని మంత్రి అన్నారు. నూతనంగా ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి ఏర్పాటు చేయడం వలన రాజేంద్రనగర్ ప్రజలకు నగరానికి వెళ్లే పరిస్థితి తప్పిందన్నారు. త్వరలోనే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని, ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు.
Also Read : వెలుగుల్లో తెలంగాణ పారిశ్రామికవాడలు