Saturday, April 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసరికొత్త సినిమా కంస వధ

సరికొత్త సినిమా కంస వధ

No Basics: ఈ మధ్య పొన్నియన్ సెల్వం అనె తమిళ సినిమాకి తెలుగుభాష తర్జుమా చేస్తూ భాషాన్వయంగా పాటలు వ్రాశారు మన తెలుగు చలనచిత్ర ప్రముఖ పాటల రచయిత. ఆయనెవరో కాదు ఈ మధ్య గరికపాటివారిని చిరంజీవి గారి విషయంలో గరికతో పోల్చి ఏదో తన ధోరణిలో తూలనాడాడు.  ఆయనే ఆ సినిమాలో భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ, కంసువధకు సంబంధించిన పాట ఒకటి వ్రాశారు. ఆ సన్నివేశం ఒక ప్రదర్శనగా ఆ సినిమాలో ఒక సందర్భంలో అద్భుతముగా చొప్పించారు దర్శకుడు మణిరత్నం గారు. కాని ఆ సన్నివేశాన్ని పాటరూపంలో, కొంతయక్షగాన రూపకంగా చిత్రీకరించారు. ఆ రూపకానికి సంబంధించిన పాటను, సదరు మన తెగులు రచయిత…అదేలేండి తెలుగుకు తెగులు పట్టించిన రచయిత అనుకోండి…ఆయన వ్రాశారు. ఆ పాటలో కంసమామని సంబోధిస్తూ…కృష్ణ పాత్ర ధారి…మత్తెక్కిన పెద్దత్తకు భర్త అని పిలుస్తుంది(లేక స్తాడు). ఇలా ఎందుకంటే ఆ కృష్ణ పాత్ర మన ధూళిపాళ గారి మనవరాలు వేశారు. సరే అది పక్కన పెడితే… ఆ పాట వింటూ నా పదకొండేళ్ల కుమారుడు…కృష్ణుడి పెద్దత్త కుంతీదేవి కదా? కంసమామ కుంతీ దేవి భర్త కాదు కదా? ఆమె పాండురాజు భార్య కదా? మరి కంసమామని మత్తెక్కిన పెద్దత్తకు భర్త అంటాడేమిటి? అని అడిగాడు.

ఇక నేను ఆలోచనలో పడి…రచయితకు మత్తెక్కిందా? ఆయన పెద్దత్తకు మత్తెక్కితే…అది ఊహించుకుని వాళ్ల మామతో చెప్పాల్సినది ఇక్కడ చెప్పాడా? అసలు కృష్ణ పరమాత్మకు కంసుడి భార్య ద్వారా కంసుడు మామ అయ్యాడా? లేక జరాసంధుని కూతురు కృష్ణునికి పెద్దత్త ఎలా అయింది? అని తల పట్టుకుని నేను చదివిన భారతం తప్పేమోనని తడబడుతూ…ఆ సదరు రచయిత మీద నమ్మకంతో నా భారత, భాగవత విజ్ఞానాన్ని మరొకసారి సరిచూసుకుందామని అనుకున్న తరుణంలో…మరలా నాకుమారుడే నువ్వేమి మరలా భారతాన్ని చూడక్కరలేదు… ఆ వ్రాసిన ఆయనకు భారతం తెలియదు…భాగవతం తెలియదు…కంసుడు ఎవరు? కృష్ణుడెవరు? వారి సంబంధం ఇక అసలు తెలియదు…అని చెప్పి…విక్రమార్క, భేతాళ కథలలో ప్రశ్నలలాగా… నా మెదడును ఆ రచయిత వాడిన పదాలు, చేసిన పదప్రయోగం తొలుస్తున్న వేళ చాలా ఉపశమనం కలిగించాడు. ఆ రచయితకి ఎవరన్నా చెప్పాల్సిన అవసరం ఉంది.

-శేషశైలేంద్ర కొప్పరపు

(ప్రభుత్వ ఉన్నతోద్యోగి. పద్య, గద్య రచనలో అందె వేసిన చేయి)

Also Read :

అనంత తిమిర జ్ఞానం

Also Read :

అవిరోధాభాసాలంకారం

Also Read :

అంతా మనమే

RELATED ARTICLES

Most Popular

న్యూస్