Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ఒక్కోసారి సినిమా పాటలవల్ల జరిగే మేలు గురించి చెప్పడానికి మాటలు చాలవు. తాజాగా చంద్రబోసు వాల్తేరు వీరయ్య కోసం రాసిన పాట, ఆ పాట మీద వ్యక్తమయిన అభ్యంతరాలు, దానికి ఆయన ఇచ్చుకున్న వివరణ వల్ల ప్రత్యక్షంగా తెలుగు అలంకార శాస్త్రానికి…పరోక్షంగా తెలుగు భాషకు జరిగే మంచి చాలా ఉంది.

ఎప్పుడో ముప్పయ్, నలభై ఏళ్ల కిందట…అది కూడా తెలుగు పండితలోకానికి, భాషాశాస్త్ర విద్యార్థులకు మాత్రమే పరిమితమై…ఆ తరువాత సోదిలో లేకుండా కనుమరుగైపోయిన విరోధాభాసాలంకారానికి మళ్లీ ఇంత ప్రచారం కల్పించినందుకు తెలుగు భాషాభిమానులందరు చంద్రబోసుకు కృతఙ్ఞతలు చెప్పుకోవాలి.

తుపాను అంచున వసిష్ఠుడి చేత విశిష్టంగా తపస్సు చేయించినందుకు కూడా అభినందించాలి. ఊర మాస్ వాల్తేరు వీరయ్యలో వసిష్ఠుడిని దర్శించడం తపస్సమాధిలో మాత్రమే సాధ్యమయ్యే యోగవిద్య. శివుడి మూడో కన్ను చీకటి అయితే వెలుగుకు, వెలుగు అయితే చీకటికి విరోధ అభాస అలంకారం చేసి వాడుకున్నానని ఆయన లక్షణ శాస్త్ర ప్రమాణంతో వివరణ ఇచ్చుకున్నారు కాబట్టి…ఆ విషయంతో విభేదించేవారు…ముందుగా అలంకార శాస్త్రాన్ని సమగ్రంగా చదువుకుని…తరువాత ఆ పాటలో వైరుధ్యాలను నిర్నిరోధంగా, అవిరోధంగా అర్థం చేసుకోవాల్సిందిగా మనవి.

తెలుగు పాటల తిమిరావరణంలో ఇది నిప్పులు చిమ్ముతూ తెరుచుకున్న త్రినేత్రంగా చిరు అభిమానులు అనుకుంటున్నట్లే మనం కూడా అనుకుందాం. తప్పు లేదు.

భగ భగ భ్భగ
మగ మగ మ్మగ
అనడంలో ధ్వన్యనుకరణ అని మరో అలంకారం కూడా ఉంది. ఎందుకో చంద్రబోసు గారు అది చెప్పుకున్నట్లు లేరు.

“భగభగ భ్భగభగ మండే మగాడురా వీడే
జగజగ ఝగజగ జగాన్ని చెండాడే
ధగధగ ద్ధగధగ జ్వలించు సూరీడే
అగాధ గాథల అనంత లోతుల
సముద్ర సోదరుడే వీడే
వినాశకారుల స్మశానమవుతాడే
తుపాను అంచున తపస్సు చేసే వశిష్టుడంటే అది వీడే
తలల్ని తీసే విశిష్టుడే వీడే
మృగ మృగ మృగాన్ని వేటాడే
పగ పగ పగ ప్ఫగ ప్రతిధ్వనించే శతాఘ్నిరా వీడే


భుగ భుగ భ్భుగ విషాన్ని మింగే
థెగ థెగ థెగ థెగించి వచ్చే త్రిశూలమయ్యాడే
ఎకా ఎకా ఎకి అకౌంటు రాసే కవిత్వమంటే అది వీడే
నవ శకాన ఎర్రని కపోతమే వీడే
తరాలు చూడని యుగాలు చూడని
సమర్థ శిఖరం అది వీడే
తనొంక తానే తలెత్తి చూస్తాడే
ఢం ఢం అగ్నివర్షమై అడుగులేస్తున్నా అసాధ్యుడే
బం బ్భం బడ బ్భడ మృత్యు జననమై ముంచుకొచ్చిన అనంతుడే
రం రం రగ రగ శౌర్య సంద్రమై ఆక్రమించిన అమర్త్యుడే
ధం ధం ధమ యుద్ధ శకటమై ఎగిరి దూకిన అబేధ్యుడే
థం థం తక తక తిమిర నేత్రమై ఆవరించిన త్రినేత్రుడే
గం గం ఘం గడ గడ మరణశంఖమై మారుమోగిన ప్రశాంతుడే”

శాస్త్ర పండితులు కొంచెం శ్రద్ధగా వింటే ఇందులో శబ్దాలంకారాలైన- వృత్యనుప్రాసలు; ముక్తపదగ్రస్తాలు; అంత్యప్రాసలు…
అలాగే అర్థాలంకారాలైన-
అతిశయోక్తులు; భ్రాంతిమదాలు; వ్యతిరేకలు; శ్లేషలు; దృష్టాంతాలు…
ఇంకా ఎన్నెన్నో దొరకవచ్చు.

రాసిన రచయితే తన రచనలో ఫలానా ఫలానా అలంకారాలున్నాయని చెప్పుకోవాల్సిరావడం ఏమీ బాగోలేదు. అలంకారశాస్త్రజ్ఞులు పెద్ద మనసు చేసుకుని ఇందులోని అలంకారాలను విడమరచి చెప్పాల్సిందిగా ప్రార్థన.

నలభై ఏళ్ల నా జీవితంలో తొలిసారి విరోధాభాసాలంకార ప్రేమలో పడ్డాను. అందుకు వాల్తేరు వీరయ్యకు, చంద్రబోసుకు, దేవిశ్రీ ప్రసాదుకు అవిరోధాభినందన వందనాలు.

ఇట్లు,
-తెలుగు అభిమాని

(ఈమధ్య వచ్చిన ఈ సినిమా పాట, దాని మీద చర్చ నేపథ్యంలో “తెలుగు అభిమాని” పేరుతో సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న ఒకానొక పోస్టు ఇది. రచయిత ఎవరో తెలిస్తే వారి పేరును తరువాత అయినా ప్రస్తావిస్తాం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com