Winners in Prakash Raj Panel resigned….తెలుగులో విభక్తి ప్రత్యయాలు చాలా గొప్పవి. మీ నాన్న ఇంట్లో ఉన్నారా? అంటే మీ “యొక్క” నాన్న అని వినిపించని విభక్తి ఉండి తీరుతుంది. రామ అన్న సంస్కృతం మాట “డు” ప్రథమావిభక్తి ఏకవచనం కలిస్తే…రామడు అయి…డు కు ముందున్న అ కూడా ఉ అయి…చివరికి రాముడు అవుతుంది. తెలుగులో అలవోకగా రాముడు అంటుంటాం కానీ…రామ్…రామ మాటలు రాముడు కావడం వెనుక ఇంత వ్యాకరణం ఉంటుందని చాలామందికి తెలియదు. తెలిస్తేనే పలుకుతానని ఆ రాముడు అనడు కాబట్టి…తెలియకుండానే పిలుస్తుంటాం. అందుకే త్యాగయ్య తెలిసి రామ చింతన సేయవే! ఓ మనసా! అని చెప్పాడు.
ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం.
“మా కు
మా యొక్క
మా కొరకు
మా తో
మా డు
మా లు
మా గూర్చి
మా గురించి
మా వలనన్
మా కంటెన్
మా పట్టి
మా లోపల
మా వెలుపల
మా అందున్
ఓ మా
ఓయీ మా
ఓసీ మా”
అని తెలుగు భాషాభిమానులు కొత్త విభక్తి ప్రత్యయాలు రాస్తున్నారు.
మాలో మేము ఉండకపోవచ్చు. మాలో మీరు ఉండకపోవచ్చు. మాతో మేమే ఉండకపోవచ్చు. మా లోకల్లో మీ నాన్ లోకల్ కలవకపోవచ్చు. మా మంచు కొండ మరొకరికి గుదిబండగా కనిపించవచ్చు. మా మనుషులు కరచవచ్చు. మా చేతులకు పంటిగాట్లు మిగలవచ్చు. మా ది నటన కాదు- నిజం అన్నా నటనగానే చూడ్డం నిజంగా నాటకం.
మా గెలుపు ప్రతిపక్షం.
మా ఓటమి అధికార పక్షం.
మా కు మేము స్వపక్ష విపక్ష దీక్షా దక్షులం.
ప్రపంచ మానవేతిహాసంలో ఒక ఎన్నిక ఫలితాల తరువాత భూమి రెండుగా చీలింది మా తోనే.
నిన్నటినుండి నిలువునా చీలిన మా భూమి మీద మనం నిలుచున్నాం.
మ కు దీర్ఘమిస్తే- మా!
మా కు ఎన్నికలొస్తే-అమ్మో!
మా ఫలితాలు వస్తే- వామ్మో!
మా చీలిపోతే- ఓయమ్మో!
ఇంతకూ-
గెలిచిందెవరు?
ఓడిందెవరు?
గెలిచి ఓడిందెవరు?
ఓడి గెలిచిందెవరు?
ఆడలేక మద్దెల ఓడు ఎవరు?
ఓర్నాయనో!
రెండేళ్లు ఇక మా యుద్ధ వార్తలే మా ప్రారబ్ధమా?
మా పూర్వ జన్మల సంచిత పాప కర్మల ఖర్మ ఇంతగా కాలిందా?
మా గ్రహచార దోష నివారణకు మార్గమే లేదా?
-పమిడికాల్వ మధుసూదన్