9.7 C
New York
Saturday, December 2, 2023

Buy now

HomeTrending Newsమద్రాసు జూ... మ్యూజియం

మద్రాసు జూ… మ్యూజియం

నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ పెంచిన సింహం చెన్నై సెంట్రల్ స్టేషన్ వెనుక ఉండిన మై లేడీస్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన జంతు ప్రదర్శనశాలలో ఉండేది. ఇప్పుడు వండలూరులో ఉన్న జంతు ప్రదర్శనశాల కన్నా చాలా చిన్నది ఈ జంతుప్రదర్శనశాల. దీనిని చెన్నై కార్పొరేషన్ నిర్వహించేది. ఈ జంతు ప్రదర్శనశాల కన్నా ముందర ఓ జంతుప్రదర్శనశాల చెన్నైలో ఉండేది.

చెన్నై మ్యూజియానికి వ్యవస్థాపకుడిగా ఎడ్వర్డ్ గ్రీన్ బాల్ఫర్ ఉన్నప్పుడు చనిపోయిన జంతువులను తగురీతిలో జాగర్త చేసి ఇక్కడ ఉంచేవారు. ఈ ఆవరణలోనే జీవమున్న జంతువులనూ ఉంచినప్పుడు ప్రజల నుంచి మంచి ఆదరణే లభిస్తుందని అనుకున్నారు. సుమారు మూడు వందల జంతువులను ఇక్కడి బోనులలో ఉంచారని అప్పట్లో అనుకునేవారు. పులి చిరుతపులి, రకరకాల పక్షులు ఇక్కడ ప్రేక్షకులకోసం ఉంచారు. ఒకే ఆవరణలో బతికిన జంతువులన్న భాగాన్ని బతికిన కాలేజీ అని, చనిపోయిన జంతువులున్న భాగాన్ని చచ్చిన కాలేజీ అనేవారు. వీటన్నింటిని ప్రేక్షకులకు వివరించడానికి ఓ గైడ్ ఉండేవారు.

అది ఎడ్వర్డ్ గ్రీన్ బాల్ఫర్ Edward Green Balfour (1813 సెప్టెంబర్ 6 – 1889 డిసెంబర్ 8) స్కాట్లాండ్ సర్జన్. మన దేశంలో పర్యావరణ పరిరక్షణకు అధికప్రాధాన్యమిచ్చిన వారిలో ఈయనొకరు. మద్రాసు, బెంగళూరులలో ఈయనే మ్యూజియంలను నెలకొల్పారు. అలాగే మద్రాసులో జూ ఏర్పాటవడానికి ముఖ్యకారకులు ఈయనే. అడవుల పరిరక్షణ, ప్రజారోగ్యం కోసం ఎంతో కృషి చేశారు. సైక్లోపీడియా ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ప్రచురించారు.

ఇప్పటికీ చెన్నై చెట్ పట్లో బాల్ఫర్ రోడ్డు ఉంది. ఆయన అక్కడే ఉండేవారు. నేను పుట్టడానికి సరిగ్గా వంద సంవత్సరాల ముందర అంటే‌ 1854లో ఏర్పాటు చేసిన ఈ జంతు ప్రదర్శన శాలను మరో పదేళ్ళకు రిప్పన్ బిల్డింగ్ వెనుకవైపు ఉన్న ప్యూపుల్స్ పార్క్ సమీపానికి మార్చారు. అయితే చచ్చిన కాలేజీ అనగా మ్యూజియం మాత్రం ఉన్న చోటనే ఇప్పటికీ ఉంది.

రమారమి 116 ఎకరాల విస్తీర్ణంలో ఈ జంతు ప్రదర్శనశాల ఉండేది. అప్పట్లో ఇక్కడి జంతువులకు వీధికుక్కలను ఆహారంగా పెట్టేవారు. వీధికుక్కలను పట్టుకుపోవడానికి వాహనాలు వచ్చేటప్పుడల్లా స్థానికులు ఈ విషయాన్ని గుర్తు చేస్తుంటారు. 1970 వరకూ వీధికుక్కలను ఇక్కడి జంతువుల మేతకు వినియోగించేవారు. దీనిని ఖండిస్తూ జంతుప్రేమికులు జరిపిన ఉద్యమంతో ఆ విధానానికి తెర దించారు.

1963 నుంచి 1984 వరకూ ఇక్కడే జంతుప్రదర్శనశాల ఉండేది. చిన్నతనంలో చూడటమే ఈ జుని. ఊరి నుంచి ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు వారు మద్రాసు నగరంలో దర్శించే వాటిలో ఈ జంతుప్రదర్శనశాల తప్పనిసరిగా ఉండేది. ఎంజిఆర్ పెంచిన సింహం ఇక్కడే ఉండేది. ఆ సింహం ఉన్న చోట ఓ బోర్డు ఉండేది. ఎంజిఆర్ ఈ సింహాన్ని ప్రసాదించారని ఆ బోర్డులో రాసి ఉండేది. ఆ సింహం పేరు రాజా. రాజా అని పిలవడంతోనే అది చూసేది. అది చూడనప్పుడు కొందరు ఎంజిఆర్ గొంతులో పిలిచేవారు. అడిమైప్పెన్ అనే సినిమాలో ఓ సింహంతో పొర్లే సన్నివేశముంది. ఇదే ఆ సింహం. ఎంజిఆర్ ఇంట కనుసన్నల్లో పెరిగిన ఈ సింహం చివరిరోజుల్లో నిరాదరణతో గడిపిందని ఎంజిఆర్ అభిమానులు బాధపడేవారు. 1980 దశకంలో ఓరోజు ఎంజిఆర్ జుకొచ్చి దానిని చూసివెళ్ళారు. ఆ తర్వాత కొంతకాలానికే ఎంజిఆర్ పెంచిన సింహం ఇక లేదన్న వార్త పత్రికలలో వచ్చింది. అది చనిపోయిన తర్వాత దాన్ని ఎంజిఆర్ స్మారక మందిరంలో ఉంచారు.

అలనాటి జూని చూడాలనుకుంటే ఎస్ఎస్ఆర్ – విజయకుమారి నటించిన కాక్కుం కరంగళ్ అనే.సినిమాలో చూడాలి. అల్లిత్తండు కాలెడుత్తు అడిమేల్ అడి ఎడుత్తు …..అనే పాట మొత్తాన్ని ఈ జూలోనే చిత్రీకరించారు. నా చిన్నతనంలో యాభై పైసలలోపే ఉండేది ప్రవేశరుసుం. చాలా వరకు జూలలో మొదటగా కనిపించేవి పక్షులు లేదా కోతుల రకాలు. బెఃగళూరు, తిరువనంతపురం, మైసూరు, చెన్నై జూలలో మొదటగా కనిపించేవి కోతులే. రైల్వ స్టేషన్ విస్తరణ కోసం ఇక్కడున్న జూని వండలూరుకి మార్చారు.

దీనికి దగ్గర్లోనే మూర్ మార్కెట్ ఉండేది. ఇక్కడ దొరకని వస్తువంటూ ఉండేది కాదు. కోతులు చిలుకలు, స్కౌట్ డ్రెస్, రంగుల చేపలు, అరుదైన పాత పుస్తకాలు (ఈ పుస్తకాలకోసం నేను మూర్ మార్కెట్టుకి వెళ్ళిన రోజులున్నాయి), నాలుగు బ్యాండ్ల రేడియోలు, భూతద్దాలు, రికార్డు ప్లేయర్ వంటివన్నీ ఇక్కడ దొరికేవి. ఈ నాలుగు మాటలూ రాస్తుంటే నా మనసంతా పార్క్ రైల్వే స్టేషన్ సమీప ప్రాంతాలలోనే విహరించింది. పుట్టి పెరిగిన ఊరవడంవల్లే మద్రాసుమీద నాకంత మమకారం. కానీ పరిస్థితుల కారణంగా హైదరాబాదులో ఉంటున్నాను. అందుకే కొన్ని మాటలు రాస్తూ కాస్సేపైనా మద్రాసులో ఉన్నట్టు మానసికానుభూతి చెందుతుంటాను.

– యామిజాల జగదీశ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్