Friday, November 22, 2024
HomeTrending Newsమహబూబ్ నగర్ దంగల్

మహబూబ్ నగర్ దంగల్

మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం వర్తమాన రాజకీయాల్లో ప్రత్యేకత సంతరించుకుంది. సిఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ దీని పరిధిలో ఉండటంతో ఓటర్లు ఎవరిని కరుణిస్తారో అనే చర్చ జరుగుతోంది. మాజీ సిఎం కెసిఆర్, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డిలు ప్రాతినిద్యం వహించిన ఇక్కడ కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి, బిజెపి నుంచి డీకే అరుణ, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపి మన్నే శ్రీనివాస్ రెడ్డి తలపడుతున్నారు.

దీని పరిధిలో మహబూబ్ నగర్, కోడంగల్, నారాయణ్ పెట్, దేవరకద్ర, జడ్చర్ల, షాద్ నగర్, మక్తల్ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం ఓటర్లు 15 లక్షల 40 వేల వరకు ఉండగా 16 శాతం SC, ST-9 శాతం, ముస్లింలు – 10 శాతం వరకు ఉన్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎంపి కాగా రెండోసారి గెలిచేందుకు పార్టీ నేతలతో కలిసి ప్రచారంలో నిమగ్నం అయ్యారు. శ్రీనివాస్ రెడ్డికి మొదట్లో టికెట్ రాదని వార్తలు వచ్చినా… శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆయనే దిక్కయ్యారు. 2019 ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించిన ఎంపి అన్న కుమారుడు మన్నే జీవన్ రెడ్డి బాబాయ్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటే.. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి మంచి మనిషే అయినా.. నియోజకవర్గ సమస్యలు పార్లమెంటులో ఏనాడు ప్రస్తావించలేదని ప్రత్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

వివాదరహితుడిగా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి రెట్టించిన ఉత్సాహంతో నియోజకవర్గం మొత్తం కలియ తిరుగుతున్నారు. రాష్ట్రంలో అందరి కన్నా ముందు వంశీ పేరు ఖరారు కావటం… పార్టీ నేతలు అందరు సహకరించటం ఆయనకు కలిసివస్తోంది. గతంలో కల్వకుర్తి ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవంతో పార్టీ నేతలను సమన్వయము చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకొని నియోజకవర్గంలో ఇప్పటికే రెండు మూడు సార్లు సభలు నిర్వహించారు.

గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన వంశీచంద్ రెడ్డి ఈ దఫా పార్టీ అధికారంలో ఉండటం, సిఎం సహకారంతో గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఇతర పార్టీల నేతలు వెల్లువలా పార్టీలో చేరటంతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాయి. మాజీ ఎంపి జితందర్ రెడ్డి బిజెపి టికెట్ కోసం చివరివరకు యత్నించి కుదరక కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన రావటం వంశీకి బోనస్ అని కాంగ్రెస్ అంచనా.

బిజెపి అభ్యర్థి డీకే అరుణ గతంలో మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గామంతా పరిచయాలు, సుధీర్గమైన రాజకీయ అనుభవం ఉన్న డీకే అరుణ గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు. ఈ ప్రాంతంలో కమలం క్యాడర్ బలంగా ఉంది. అరుణ గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి వరిస్తుందని పార్టీ శ్రేణులు ఓటర్లను కమలం గుర్తును ఆదరించాలని కోరుతున్నారు. ఈసారి సానుభూతి ఓట్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిష్మా… కేంద్ర ప్రభుత్వ పథకాలతో గట్టెక్కే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భరోసాతో ఉన్నారు.

పార్టీగా బిజెపి, అభ్యర్థిగా డీకే అరుణ నియోజకవర్గంలో సుపరిచితమే అయినా కాంగ్రెస్ బలంగా ఉండటం సిఎం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గతంలో ఓ సమావేశంలో రెడ్డిలకు రెడ్డిలు సహకరిస్తే తప్పేంటి అన్న డీకే అరుణ, రేవంత్ రెడ్డిలు ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోవటం గమనార్హం.

గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్, పట్టణ ప్రాంతాల్లో బిజెపి పైచేయి ఉన్నట్టుగా వివిధ సర్వేల్లో వెలుగు చూసింది. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద వ్యతిరేకత కాంగ్రెస్ కు అవకాశం వచ్చేలా చేసిందని చర్చ జరుగుతోంది. మహబూబ్ నగర్ లో ఈ దఫా పోయిన ఎన్నికల్లో తలపడిన అభ్యర్థులే బరిలో ఉన్నా లెక్కలు తారుమారవుతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానం కాగా బీఆర్ఎస్ ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ – బిజెపిల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్