మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని ప్రభుత్వంలో ఈ రోజు పూర్తిస్థాయి మంత్రి వర్గం కొలువు దీరింది. శివసేన చీలికవర్గం-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో కొత్తగా 18 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండు వర్గాల నుంచి తొమ్మిది మంది చొప్పున సమానంగా మంత్రి పదవుల పంపకం జరిగింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలుపుకొని మొత్తంగా కేబినెట్ సంఖ్య 20కి చేరింది. పోర్ట్‌ఫోలియోల కేటాయింపు కూడా ఇవ్వాళే పూర్తి కానుంది. సాయంత్రానికి మహారాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడనున్నాయి.
బీజేపీ కోటా నుంచి ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, సుధీర్ ముంగంటివర్, గిరీష్ మహాజన్, సురేష్ ఖడే, రాధాకృష్ణ వీఖే పాటిల్, రవీంద్ర చవాన్, మంగళ్ ప్రభాత్ లోధా, విజయ్ కుమార్ గవిట్, అతుల్ సవేను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన చీలిక వర్గం నుంచి దాదా భుసె, శంభురాజె దేశాయ్, సాందీపన్ భుమ్రే, ఉదయ్ సామంత్, తానాజీ సామంత్, అబ్దుల్ సత్తార్, దీపక్ కెసర్కర్ గులాబ్ రావ్ పాటిల్, సంజయ్ రాథోడ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
నిన్నటి వరకు మహారాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి వేంద్ర ఫడ్నవిస్ ఇద్దరే ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ వీరిద్దరే ఆయా శాఖల రోజువారీ సమీక్షలు, కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ వస్తోన్నారు. తాజాగా మంత్రివర్గంలోకి కొత్తగా 18 మందిని తీసుకున్నారు. ముంబై రాజ్‌భవన్‌లో కొద్దిసేపటి కిందటే గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
Also Read : బలపరీక్షలో నెగ్గిన సీఎం షిండే