ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలు విభిన్నంగా .. విలక్షణంగా ఉంటాయి. ఇంతవరకూ ఆయన చేసిన సినిమాలు ఆ విషయాన్ని నిరూపిస్తూ ఉంటాయి. ఆయన తాజా చిత్రంగా ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి‘ ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇంద్రగంటి మాట్లాడుతూ .. “నేను ఎంతో ఇష్టపడి రాసుకున్న కథ ఇది. ఎంతో ప్యాషన్ తో చేసిన సినిమా ఇది. కమర్షియల్ డైరెక్టర్లకు నేను ఈ సినిమాను అంకితం చేస్తున్నాను.
కమర్షియల్ డైరెక్టర్ల పట్ల సరైన అవగహన లేక, డబ్బుల కోసం సినిమాలు తీస్తారా అనుకునేవాడిని. వాళ్ల లోపల ఎలాంటి కళాకారులు ఉంటారనే విషయాన్ని నేను నెమ్మదిగా అర్థం చేసుకుని తీసిన సినిమా ఇది. ఐటమ్ సాంగ్ బాగుందంటూ హరీశ్ శంకర్ గారు .. అనిల్ రావిపూడి గారు నన్ను దీవించారు. ఐదుగురు దర్శకులు .. ముగ్గురు హీరోలు ఈ ఫంక్షన్ కి రావడం ఒక నిండుదనాన్ని తీసుకుని వచ్చింది. సుధీర్ బాబు మా ఫేవరేట్ యాక్టర్ .. ప్రతి స్టేజ్ పై నేను ఇదే మాటను చెబుతూ ఉంటాను. పాత్ర కోసం ప్రాణం పట్టే హీరో అతను.
ఇందాక హరీశ్ అన్నట్టుగా సుధీర్ బాబు స్థాయికి తగిన కథలు ఇంకా పడలేదనే నేను కూడా భావిస్తున్నాను. అలాంటి ప్రాజెక్టులు ఆయనకి రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా చేసినందుకు సుధీర్ బాబు గర్వపడతారు .. ఆయన పెర్ఫార్మెన్స్ చూసి మహేశ్ బాబు అంతకుమించి గర్వపడతారు. కృతి శెట్టి విషయానికి వస్తే .. ఈ సినిమాలో సరికొత్త కృతి శెట్టిని చూస్తారు. బేబమ్మను ఎంతగా ఆదరించారో .. అంతకంటే ఎక్కువగా ఈ పాత్రను ఆదరిస్తారు. ఇంత చిన్న వయసులో ఆమె ఈ స్థాయి పెర్ఫార్మెన్స్ ను చూపడం నిజంగా గొప్ప విషయం. ఈ నెల 16న థియేటర్స్ కి వెళ్లి ఈ సినిమాను చూడండి” అంటూ చెప్పుకొచ్చాడు.