Saturday, November 23, 2024
HomeTrending Newsమ‌ల్ల‌న్నసాగ‌ర్ ప్రాజెక్టు జాతికి అంకితం

మ‌ల్ల‌న్నసాగ‌ర్ ప్రాజెక్టు జాతికి అంకితం

Mallannasagar Project : కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మ‌ల్ల‌న్న సాగ‌ర్ జ‌లాశ‌యంలో అద్భుత దృశ్యం ఆవిష్కృత‌మైంది. మల్లన్నసాగర్‌ జలాశయాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం జాతికి అంకితం చేశారు. ఈ సంద‌ర్భంగా కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న‌కు కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం స్విచ్ఛాన్ చేసి మ‌ల్ల‌న్నసాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్‌లోకి సీఎం కేసీఆర్ నీటిని విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు హ‌రీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. ఏరియ‌ల్ వ్యూ ద్వారా కేసీఆర్ ప్రాజెక్టును ప‌రిశీలించారు. ముఖ్యంగా మల్లన్నసాగర్‌ తెలంగాణకు గుండెకాయ. మొత్తం ప్రాజెక్టులోనే అత్యధిక నీటి నిల్వ సామర్థ్యమున్న, అత్యంత ఎత్తున ఉన్న జలాశయం ఇదే. సిద్దిపేట జిల్లాలో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ మహా జలాశయానికి 5 ఓటీ స్లూయిస్‌లు (తూములు) ఉన్నాయి. ఆ తూముల ద్వారానే కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్‌కు, సింగూరు ప్రాజెక్టుకు, తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు, మిషన్‌ భగీరథకు నీటిని తరలిస్తారు.

8 లక్షల ఎకరాల ఆయకట్టు
మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ ఎఫ్‌ఆర్‌ఎల్‌ 535 మీటర్లు. అంటే చాలా ఎత్తులో ఉన్న ప్రదేశం. దీంతో మెదక్‌, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు కేవలం గ్రావిటీ ద్వారా జలాల్ని తరలించే వెసులుబాటు లభించనున్నది. మల్లన్నసాగర్‌ కింద 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్యాకేజీ-13 కింద మల్లన్నసాగర్‌ నుంచి 8.733 కిలోమీటర్ల మేర నిర్మించే గ్రావిటీ కాల్వ ద్వారా 53వేల ఎకరాలు సాగు కానున్నది. ప్యాకేజీ-17, 18, 19 కింద 11.670 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ, 11.525 కిలోమీటర్ల టన్నెల్‌ ఆపై మరో 2.505 గ్రావిటీ కాల్వ ద్వారా గోదావరి జలాల్ని హల్దీ నదిని దాటిస్తారు. అవసరమైతే అక్కడ నేరుగా హల్దీ నదిలోకి కూడా గోదావరిజలాల్ని పోసే వెసులుబాటు ఉంటుంది. ఆపై 34 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ, 3.65 కిలోమీటర్ల టన్నెల్‌ నిర్మాణంతో జలాలు మంజీరా నదిని దాటుతాయి. అక్కడి నుంచి 37.900 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా సింగూరు రిజర్వాయర్‌ సమీపంలోని ముదిమానిక్‌ తండా వద్ద నిర్మించే పంపుహౌజ్‌ వరకు తరలిస్తారు.

ప్యాకేజీ-18 కింద 15వేల ఎకరాలు, ప్యాకేజీ-19 కింద 1.17 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. మల్లన్నసాగర్‌ నుంచి 8.175 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా 530 కాంటూర్‌ వద్ద నిర్మించే ఆనకట్ట దగ్గరకు గోదావరి జలాల్ని తరలిస్తారు. అక్కడ నుంచి నల్లగొండ జిల్లాలో నిర్మించే గంధంమల్ల రిజర్వాయర్‌కు గోదావరి జలాల్ని తరలిస్తారు. ఈ క్రమంలో ప్యాకేజీ-15 కింద 55వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. అదే మార్గంలో జలాల్ని ప్యాకేజీ-16 ద్వారా 11.39 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే బస్వాపూర్‌ రిజర్వాయర్‌లో పోస్తారు. తద్వారా ఈ ప్యాకేజీ కింద 1.88 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. దీనితో పాటు ఆనకట్ట నుంచి ప్యాకేజీ-14 కింద 4.850 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ, 8.950 కిలోమీటర్ల టన్నెల్‌ నిర్మాణం ద్వారా జలాల్ని కొండపోచమ్మ రిజర్వాయర్‌ సమీపంలో మెదక్‌ జిల్లా వర్గల్‌ మండలం పాములపర్తి వద్ద నిర్మించే పంపుహౌజ్‌ వరకు తరలిస్తారు. ఈ క్రమంలో ప్యాకేజీ-14 ద్వారా గ్రావిటీపైనే 2.27 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. పాములపర్తి దగ్గర కూడా కేవలం 89 మీటర్ల మేర మాత్రమే లిఫ్టు ఉంది. ఇలా మొత్తంగా దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలకు గ్రావిటీపై సాగునీరు అందించవచ్చు.

Also Read : మానేరు రివర్ ప్రంట్ పనులు త్వరలో ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్