ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బిజెపికి నిరాశ కలిగించాయి. కేరళపై ఆ పార్టికి ఎలాంటి ఆశలు లేవు గాని పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమాతో వున్నారు. అయితే వారి అంచనాలు తలక్రిందులయ్యాయి. జాతీయ పార్టీలకు తమ రాష్ట్రంలో స్థానం లేదని తమిళ ప్రజలు మరోసారి తేల్చి చెప్పారు. అన్నాడిఎంకే పరిపాలన పట్ల ప్రజల్లో అంతగా వ్యతిరేకత లేకపోయినా ఆ పార్టీ బిజెపితో కలిసి పోటి చేయడాన్ని తిరస్కరించారు. కేరళలో పినరాయ్ విజయన్ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచారు. రెండేళ్ళ క్రితం సంభవించిన వరదలు, సంవత్సర కాలంగా కోవిడ్ నియంత్రణకు విజయన్ చేపడుతున్న చర్యలకు ప్రజలు మద్దతుగా నిలిచారు. అస్సోంలో మాత్రం బిజెపికి ఊరట లభించింది. ఆ రాష్ట్రంలో అధికారాన్ని బిజెపి నిలబెట్టుకోగలిగింది. పుదుచ్చేరిలో ఎన్డీయే-కాంగ్రెస్ కూటమి మధ్య హోరాహోరి పోరు సాగుతోంది. సాయంత్రానికి ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు ఈ విధంగా వున్నాయి.
పశ్చిమ బెంగాల్లో మొత్తం 292 సీట్లు వుండగా తృణమూల్ కాంగ్రెస్ 212, బిజెపి-78, ఇతరులు-2 సీట్లలో గెలుపు దిశలో సాగుతున్నారు.
తమిళనాడులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు వుండగా డిఎంకే కూటమి 153, అన్నా డిఎంకే కూటమి 80, కమల్ హాసన్ పార్టీ 1 స్థానంలో ఆధిక్యాన్ని సంపాదించాయి.
కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాలు వుండగా వామ పక్షాల నేతృత్వంలోని ఎల్.డి.ఎఫ్ 100 స్థానాల్లో; కాంగ్రెస్ మిత్ర పక్షాల కూటమి యుడిఎఫ్ 40 స్థానాల్లో విజయం దిశగా పయనిస్తున్నాయి.
అస్సోంలోని 126 స్థానాల్లో….బిజెపి కూటమి-74; కాంగ్రెస్ కూటమి-50; ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిన్స్తున్నాయి.
పుదుచ్చేరిలో మొత్తం ౩౦ స్థానాలు వుండగా 29 సీట్లలో ఫలితాలు అందుబాటులోకి రాగా ఎన్డీయే కూటమి-14 , కాంగ్రెస్ కూటమి-13; ఇతరులు 2 స్థానాల్లో విజయం బాటలో ఉన్నారు.