Saturday, July 27, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతోడుపెట్టిన రుచులు

తోడుపెట్టిన రుచులు

Milk Cream, Bread with Honey: ఏ దేశమేగినా…ఎందు కాలిడినా…వెతకరా వెజిటేరియన్ ఫుడ్డు! అన్నట్లు ఉంటుంది నా పరిస్థితి. సాధారణంగా బయట దేశాల్లో వెజిటేరియన్ ఫుడ్ అంటే బ్రెడ్డు, బిస్కట్లు, పండ్లు, ఉడకబెట్టిన కూరగాయలు– అంతే. కొన్ని చోట్ల మరమరాల సైజులో ఉన్న అన్నం మెతుకులు ఉంటే ఉంటాయి. అది అన్నం అనుకుంటే అన్నం; సున్నమనుకుంటే సున్నం.  మొన్న టర్కీలో కొన్ని రోజులు తిరిగాను. అన్ని హోటళ్లలో వెజిటేరియన్ కౌంటర్ వైపు వెళ్లగానే… తేనె తుట్టె, మీగడ, పెరుగు, ఇతర పాల పదార్థాలున్నాయి. అలా నేను ఇప్పటికి తిరిగిన ఏ దేశంలోనూ చూడలేదు.

తేనె తుట్టెను ముక్కలుగా కత్తిరించుకుని ప్లేట్లలో పెట్టుకుని టిఫిన్ గా తింటున్న దృశ్యం చూడగానే నాకు సగం కడుపు నిండిపోయింది. ఎప్పుడో చిన్నప్పుడు లేపాక్షిలో తేనెతుట్టెను అలా తిన్నవాడిని. టర్కీలో రోజూ ఉదయం మొదటి ఫుడ్డు తేనె తుట్టే. (బాటిళ్లలో తేనె కంటే తుట్టె తేనె ఇంకా మధురం. కాసేపు నమిలి…తేనెను మింగుతూ…చివర పిప్పిని పడేయాలి. పిప్పిని తిన్నా ఏమీ ప్రమాదం లేదు) ఆపై రెండు బ్రెడ్డు ముక్కలకు మీగడ రాసుకుని…తిని…విడిగా ఒక కప్పు మీగడ తింటుంటే…నాసామి రంగా! నాలుక నా కంట్రోల్లో ఉండేది కాదు. భోజనంలో గేదె పాల పెరుగు ప్రత్యేకం. ఎక్కడో ఐరోపా- ఆసియా ఖండాల నడిమధ్యలో ఉన్న టర్కీలోనే ఆవుపాల మీగడ, గేదెపాల పెరుగు, తేనె తుట్టెలను గిన్నెలకు గిన్నెలు పెడితే…నిత్యం ఆవును పూజించే…ఆవు పాలను నిత్యం స్మరించే జంబూ ద్వీపే…భరత వర్షే…భరత ఖండేలో కూడా ఇలా ఉండి ఉండాల్సింది కదా అని అనిపించింది.

ఒక్క చుక్క తేనె తయారు కావాలంటే తేనెటీగ ఆరు వందల సార్లు పూల మీద ఎగరాలని ఎక్కడో చదివినట్లు గుర్తు. తేనెటీగ నిస్వార్థ జీవి. నానా పూల మకరందాన్ని తెచ్చి తుట్టెలో పెడితే…మనం మంటపెట్టి…తేనెటీగలను తరిమి…తేనెను పిండుకుని…జుర్రుకుంటాం. తేనె తుట్టె నిర్మాణం, అందులో వరుస గదులు, ఆ గదుల్లో తేనె భద్రంగా ఒదగడం చూసి తీరాల్సిన సృష్టి వింత. తలచుకుంటే- తేనె రుచికంటే అది మధురమైన భావన.

టర్కీ హోటళ్లలో పెట్టినవి కృత్రిమంగా పలకల్లో తేనె తుట్టెను పెంచే పరిశ్రమల నుండి తెచ్చినవి. ఎంత తిన్నా తనివి తీరదు. జున్ను, మీగడ నా బలహీనత. టర్కీ నా బలహీనతను బాగా పిండుకుంది. నేను అన్నం మానేసి జున్ను భోంచేసే సందర్భాలు ఇప్పటికీ ఉన్నాయి. చిన్నప్పుడు మీగడమీద చక్కెర వేసుకుని తినేవాడిని. ఇప్పుడు ఒట్టి మీగడ భోంచేస్తూ ఉంటాను.

మా నాన్న నాకు మధుసూదన్ అని పేరెందుకు పెట్టారో కానీ…మీగడ పెరుగు కనపడితే గిన్నె మాయం. వెన్న, జున్ను కనపడితే ఒళ్లు తెలియదు. అలా తింటే గొంతు బొంగురుపోదా? అని చూసినవారు పెదవి విరిచి…విరిచి…వారి పెదవులే విరిగిపోయాయి కానీ...నా పొట్టలో యాభై ఏళ్లుగా చిక్కటి పాలు మాత్రం విరగలేదు. బాగా పేరుకుని…ఆరోగ్యంగా గడ్డ కట్టి…భద్రంగా ఉన్నాయి.

“ఓ యమ్మ ! నీ కుమారుడు మాయిండ్లలొ పాలు పెరుగు మననీడమ్మా !

పోయెద మెక్కడికైనను మా యన్నల సురభులాన మంజుల వాణీ !” 
అని యశోద దగ్గరికెళ్లి గోపకాంతలందరూ నెత్తీ నోరు కొట్టుకున్నారని తెలుగు పద్యాన్ని మంత్రమయం చేసిన పోతన అన్నాడు. అలా లేపాక్షిలో మా అమ్మ దగ్గరికొచ్చి ఎవరూ ఏడవాల్సిన అవసరం లేకుండా మా అమ్మే నాకు కావాల్సినదానికంటే ఎక్కువగా పాలు, పెరుగు పెట్టింది.

లేపాక్షిలో మా నాన్న తెలుగు అధ్యాపకుడు. అందరూ గ్రామీణ విద్యార్థులే. ఎవరింట్లో ఆవు, గేదె ఈనినా ఉచితంగా జున్ను పాలు తెచ్చి ఇచ్చేవారు. గురువులకు ఆరోజుల్లో అదొక మర్యాద. ఇప్పటిలా పాతరాతియుగం పాచి ఫుడ్డును కూడా దాచుకుని తినే రిఫ్రిజిరేటర్లు లేవు కాబట్టి…బెల్లం వేసి…యాలకుల పొడి చల్లిన జున్ను గడ్డ కడితే సాయంత్రం లోపు తినేయాల్సిందే. దాంతో మధ్యాహ్నం స్కూల్ కు లంచ్ బాక్సులో కూడా రెండు గిన్నెల జున్నే అమృతమయమైన ఆహారమయ్యేది.

పాలు తోడుపెడితే పెరుగు కావడం ఒక అద్భుతమయినట్లే పెరుగు మాట కూడా ఒక అద్భుతం. పెరుగు- కర్డ్ (నామవాచకం); పెరుగు – గ్రో- పెరగడం(క్రియాపదం).

“ఎండన్ మ్రగ్గితి రాఁకటం బడితి రింకేలా విలంబింపఁగా
రండో బాలకులార! చల్ది గుడువన్ రమ్యస్థలం బిక్క డీ
దండన్ లేఁగలు నీరు ద్రావి యిరవందం బచ్చికల్ మేయుచుం
దండంబై విహరించుచుండఁగ నమందప్రీతి భక్షింతమే?”

పిల్లల్లారా! ఎండలో తిరిగి…తిరిగి…అలసిపోయారు. ఈ చెట్టు కిందికి రండి. అక్కడ యమునలో ఆవులు, దూడలు నీళ్లు తాగుతాయి. మనమందరం ఈ చెట్టు నీడలో కూర్చుని తిందాం.

“జలజాంతస్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న ఱే
కుల చందంబునఁ గృష్ణునిం దిరిగిరాఁ గూర్చుండి వీక్షించుచున్
శిలలుం బల్లవముల్ దృణంబులు లతల్ చిక్కంబులుం బువ్వు లా
కులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా!”

తామర పువ్వు రేకుల మధ్యలో దుద్దు ఉన్నట్లు…కృష్ణుడు మధ్యలో కూర్చుంటే పిల్లలందరూ ఆయన చుట్టూ కూర్చున్నారు. చేతిలో ఆకుల్లో పెరుగన్నం పెట్టుకుని కృష్ణుడిని చూస్తూ తిన్న ఆ పిల్లల ఆనందమే ఆనందం.

“మాటిమాటికి వ్రేలు మడిఁచి యూరించుచు- నూరుఁగాయలు దినుచుండు నొక్క;
డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగి-“చూడు లే”దని నోరు చూపునొక్కఁ;
డేగు రార్గురి చల్దు లెలమిఁ బన్నిదమాడి-
కూర్కొని కూర్కొని కుడుచు నొక్కఁ;
డిన్నియుండఁగఁ బంచి యిడుట నెచ్చలితన-మనుచు బంతెనగుండు లాడు నొకఁడు;
కృష్ణుఁ జూడు” మనుచుఁ గికురించి పరు మ్రోల
మేలి భక్ష్యరాశి మెసఁగు నొకఁడు;
నవ్వు నొకఁడు; సఖుల నవ్వించు నొక్కఁడు;
ముచ్చటాడు నొకఁడు; మురియు నొకఁడు”

వేళ్ళ మధ్యలో పెట్టుకున్న ఆవకాయ ముక్కలను చప్పరిస్తూ ఒకడు;
ఇంకొకడి కంచంలో ముద్దలను లాక్కుంటూ ఒకడు;
అదిగో కృష్ణుడిని చూడు అని చూపిస్తూ…ఈలోపు ఎదుటివాడి కంచంలో ముద్ద లాక్కున్నవాడొకడు;
అందరినీ నవ్విస్తూ తింటున్నవాడొకడు.

“కడుపున దిండుగాఁ గట్టిన వలువలో-
 లాలిత వంశనాళంబు జొనిపి
విమల శృంగంబును వేత్రదండంబును-
జాఱి రానీక డాచంక నిఱికి
మీఁగడ పెరుగుతో మేళవించిన చల్ది-
 ముద్ద డాపలిచేత మొనయ నునిచి
చెలరేఁగి కొసరి తెచ్చిన యూరుగాయలు-
 వ్రేళ్ళ సందులయందు వెలయ నిఱికి
సంగడీల నడుమఁ జక్కగఁ గూర్చుండి
నర్మభాషణముల నగవు నెఱపి
యాగభోక్త కృష్ణుఁ డమరులు వెఱఁగంద
శైశవంబు మెఱసి చల్ది గుడిచె”

కడుపుకు కట్టుకున్న వస్త్రంలోకి వేణువును జొనుపుకుని;
కొమ్ము బూరను చంకలో పెట్టుకుని;
మీగడ పెరుగుతో కట్టిన చద్ది అన్నం మూట విప్పి;
వేళ్ళమధ్యలో పెట్టుకున్న ఊరగాయ ముక్కలను మధ్యలో చప్పరిస్తూ…పిల్లల మధ్యలో కూర్చున్న కృష్ణుడిని చూసి…ఆ పిల్లల అదృష్టానికి దేవతలే అసూయపడ్డారు.

ఈ దృశ్యం చూసిన బ్రహ్మ-
తొక్కలో బ్రహ్మ పదవి ఎందుకు నాకు?
ఈ పిల్లల్లో ఒక పిల్లాడిగా పుట్టి ఉంటే చాలు కదా! అనుకున్నాడు. కనీసం ఈ పిల్లల కాలి ధూళి నెత్తిన చల్లుకున్నా చాలు కదా! అనుకున్నాడు.

ఈ పద్యాలు చదువుకుంటూ…అర్థాన్ని దృశ్యంగా ఊహించుకుంటూ...ఊరవతల పొలాల్లో చెట్టు నీడన…మట్టిలో గుండ్రంగా కూర్చుని…చేతిలో మీగడ పెరుగు ముద్ద పెట్టుకుని...ఆవకాయ ముక్కలు చప్పరిస్తూ…నవ్వుతూ…నవ్విస్తూ…ఒకసారి తిని చూడండి. మీ మధ్యకు పోతన పోతపోసిన యాగభోక్త కృష్ణుడు వచ్చి ఒక ముద్ద లాక్కోకపోతే…నా పేరు మార్చుకుంటాను.

మీదు ప్లస్ కడ ఈజ్ ఈక్వల్ టు “మీగడ” అన్న సంధి సూత్రం తెలిసినరోజునుండి మీగడ మాట మీద నాకు అపారమైన గౌరవం ఏర్పడింది. ఆ గౌరవమే రుచిగా మారి…“ప్రాతాదుల తొలియచ్చు మీది వర్ణంబులకెల్ల లోపంబు బహుళంబుగా” అయి నా నోట్లో పడుతోంది. మా ఇంట్లో పాలు, పెరుగుల మీద మీగడలు మాయం కాకుండా రక్షించుకోవడానికి మా ఆవిడ ఎన్నెన్నో వినూత్న ప్రయత్నాలు చేసి…పాక్షిక విజయమే సాధిస్తూ ఉంటుంది.

ఈ జిహ్వచాపల్య నేరం నాది కాదు;
చిన్నయసూరి వ్యాకరణ సూత్రానిది!
పోతన పద్యాలు తోడుబెట్టిన వెన్న మీగడ పెరుగుది!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్