Warning to Millers: ధాన్యం సేకరణలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రైతుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం కొనుగోలు చేయవద్దని రైస్ మిల్లర్లను హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించే మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ధాన్య సేకరణలో ఈసారి నుంచి సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. అక్కడక్కడా తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల ఉన్నతాధికారులతో తణుకు మునిసిపల్ హాల్ లో మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించి 21రోజుల్లోనే నగదు చెల్లిస్తున్నామని చెప్పారు. కనీసం మద్దతు ధరతో పాటు గోనె సంచుల డబ్బులు, హమాలీల ఛార్జీలు నేరుగా రైతుల అకౌంట్ లోకి జూమ్ చేస్తున్నామని వివరించారు. కొత్తగా ప్రవేశపెట్టిన పద్దతిలో కలిగే ఇబ్బందులను అధిగమించి అధికారం యంత్రాంగం ముందుకు వెళుతుందని అన్నారు. దీనిని రాజకీయం చేయాలనుకుంటే సహించబోమని తీవ్రంగా హెచ్చరించారు.
ఈ క్రాప్ ద్వారా నమోదు చేసుకున్న రైతులు తమ పంటను నేరుగా ఆర్బీకేల వద్దకు తీసుకుని రావాలని ఆయన సూచించారు. రైస్ మిల్లర్లు వద్దకు వెళ్లవద్దని చెప్పారు. ఆర్బీకేల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మాత్రమే మిల్లింగ్ చేయాలని ఆదేశించారు. రైతులు ధాన్యాన్ని మిల్లర్లకు విక్రయించ వద్దని స్పష్టం చేశారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్బీకే ల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. అవసరమైన చోట ఆర్బీకేల సంఖ్యను పెంచాలని అధికారులకు సూచించారు.
రైతులకు నష్టం కలిగించే ఎలాంటి చర్యలను సిఎం జగన్ ఉపేక్షించరని మంత్రి స్పష్టం చేశారు. రైతుల ముసుగులో కొందరు ధాన్య సేకరణ విషయంలో రాజకీయం చేస్తున్నారని అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ధాన్యం సేకరణను ఛాలెంజ్ గా తీసుకుని అధికారం యంత్రాంగం పని చేస్తుందని మంత్రి వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో పౌరసరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండ్యన్, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.