Sunday, January 19, 2025
HomeTrending NewsRice crop: సన్నరకం ధాన్యానికి భారీ డిమాండ్‌

Rice crop: సన్నరకం ధాన్యానికి భారీ డిమాండ్‌

సన్నరకం ధాన్యానికి భారీగా డిమాండ్‌ పెరిగింది. యాసంగి సీజన్‌లో గతంలో ఎప్పుడూ లేనివిధంగా క్వింటాలుకు రూ.2,500 వరకు ధర పలుకుతున్నది. అయినప్పటికీ మిల్లర్లు, వ్యాపారులు పొటీపడి కొనుగోలు చేస్తున్నారు. రైతులు పంట కోసిందే ఆలస్యం మిల్లర్లు, వ్యాపారులు పొలంలోకే వెళ్లి ధాన్యం కొంటున్నారు. కొందరైతే రైతులకు ముందుగానే అడ్వాన్స్‌ చెల్లిస్తున్నారు. దేశంలో డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోటమే దీనికి కారణమని వ్యాపారులు చెప్తున్నారు.

ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా వరిసాగు భారీగా తగ్గింది. అదే సమయంలో ఒక్క తెలంగాణలో మాత్రమే వరి సాగు పెరగటం గమనార్హం. ప్రస్తుతం వరికి మద్దతు ధర క్వింటాలుకు రూ.2060 ఉన్నది. ఈ లెక్కన రైతులకు మద్దతు ధరకు మించి సుమారు రూ.400-500 వరకు దక్కుతున్నది. ధాన్యం కొనుగోలు సమయంలో 17 శాతం వరకు తేమను అనుమతిస్తారు. కానీ 27-30 శాతం తేమ ఉన్నా, వ్యాపారులు భారీ ధర వెచ్చించి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా మిల్లర్లు పచ్చి ధాన్యమే కొంటుడటంతో తూకం పెరిగి.. రైతులకు మద్దతు ధరకు అదనంగా మరో రూ.100-200 వరకు గిట్టుబాటవుతున్నది.

యాసంగిలో రికార్డు ధర
————————–
సాధారణంగా సన్నాలకు వానకాలంలో భారీ ధర పలుకుతుంది. ఆ సీజన్‌లో ఎక్కువగా సన్నాలు సాగు చేస్తారు. దీంతో పాటు ధాన్యం కూడా నాణ్యత ఎక్కువగా ఉంటది. దీంతో క్వింటాలు రూ.2,500 వరకు ధర పలుకుతుంది. యాసంగిలో ఆస్థాయిలో ధర ఉండదు. కానీ ఈ సీజన్‌లో మాత్రం వానకాలాన్ని మించి సన్నాలకు ధర పలుకుతుండటంపై వ్యాపారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో ఈస్థాయి ధర ఎప్పుడూ లేదని చెప్తున్నారు.

తగ్గిన పంట.. పెరిగిన డిమాండ్‌
—————————
యాసంగిలో పలు రాష్ర్టాల్లో వరిసాగులో తగ్గుదల నమోదైంది. మరీ ముఖ్యంగా సన్నాలసాగు మరింత తగ్గింది. అదే సమయంలో తెలంగాణలో మాత్రం యాసంగిలో వరిసాగు పెరిగింది. ఈ యాసంగి సీజన్‌లో వరిసాగులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 56.44 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. రాష్ట్ర వ్యాపారులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర వ్యాపారులు కూడా తెలంగాణకు వచ్చి ధాన్యం కొనుగోలుకు పోటీ పడుతుండటం గమనార్హం.

బియ్యం ధరలపైనా ప్రభావం
——————————
సన్నధాన్యం ధర పెరుగుదల ప్రభావం బియ్యం ధరపై పడే అవకాశం ఉన్నదని వ్యాపారులు తెలిపారు. కిలోపై రూ.5కు పైగా పెరిగే అవకాశం ఉన్నదని చెప్పారు. వ్యాపారులకు గిట్టుబాటు కావాలంటే ధర పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతున్నదని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్