Sunday, January 19, 2025
HomeTrending Newsఉమా నోరు అదుపులో పెట్టుకోవాలి: అంబటి

ఉమా నోరు అదుపులో పెట్టుకోవాలి: అంబటి

Counter: గోదావరికి కనీ వినీ ఎరుగని రీతిలో వరద వచ్చిందని, ఈ విపత్తు సమయంలో అధికార యంత్రాంగం, ప్రజలు, వాలంటీర్ల సహకారంతో తమ ప్రభుత్వం సమర్ధవంతంగా సహాయ పునరావాస చర్యలు చేపట్టిందని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.  ముఖ్యమంత్రి అక్కడకు వెళ్లి, వారితో ఫోటోలు దిగి ఆర్భాటం చేయలేదని కానీ, అనుక్షణం దీనిపై సమీక్ష నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు యంత్రాంగానికి తగు సూచనలు ఇచ్చారని వివరించారు.  పెద్దలకు తిండి లేదు- పిల్లలకు పాల చుక్కలేదు అంటూ  ఓ పత్రికలో వచ్చిన కథనంపై ఆయన మండిపడ్డారు. లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలను సహాయ పునరావాస శిబిరాలకు తరలించడం, వారికి ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం చొరవ చూపిందని, కొన్ని ప్రాంతాల్లో బాధితులు తాము రామని చెప్పినా వారికి నచ్చజెప్పి శిబిరాలకు తీసుకెళ్లామన్నారు.  బాధితులకు ఒక్కొక్కరికీ రెండు వేల రూపాయలు తక్షణ ఆర్ధిక సాయం అందించామని, గతంలో ఎక్కడైనా ఇలా జరిగిందా అని ప్రశ్నించారు.  ఆరు జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు అక్కడకు వెళ్లి సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

పోలవరంపై మాజీ మంత్రి దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలపై అంబటి తీవ్రంగా ప్రతిస్పందించారు. అసభ్య పదజాలంతో తమను ఉమా దూషిస్తున్నారని, తాము అంతకంటే ఎక్కువగానే తిట్టగాలమని, ఉమా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. గోదావరికి 27 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని, పోలవరం కాఫర్  డ్యాం 28లక్షల కెపాసిటీతో మాత్రమే నిర్మించారని, ఇంకా వరద ఎక్కువైతే కాఫర్ డ్యాం కొట్టుకుపోతుందని భావించి వెంటనే సిఎం ఆదేశాలతో ఇంజనీర్లు, అధికారులు, యంత్రాంగంతో డ్యాం ఎత్తు అడుగు యుద్ధ ప్రాతిపదికన పెంచామని రాంబాబు గుర్తు చేశారు.

సాధారణంగా జూలైలో వరదలు వచ్చే అవకాశం తక్కువ అని, అయినా సరే ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టిందని రాంబాబు చెప్పారు. తనకు అన్నీ విషయాలు తెలియవని, ప్రాజెక్టుల విషయంలో ఏదైనా సమాచారం కావాలంటే కార్యదర్శి, అధికారులు, చీఫ్ ఇంజనీర్ నారాయణ రెడ్డి లను అడిగి తెలుసుకుంటానని, కానీ ఉమా అన్నీ తనకే తెలుసనే అహంకారంతో మాట్లాడడం తగదని రాంబాబు హితవు చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్