పాఠశాలల విలీనంపై ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా పర్యటిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. స్కూళ్ళ విలీనంపై అందరు ఎమ్మెల్యేలకు లేఖలు రాశామని, వారినుంచి 400 వరకూ విజ్ఞాపనలు వచ్చాయని వివరించారు. స్కూళ్ళు విలీనం చేసినప్పుడు అదనపు తరగతులు లేక విద్యార్ధులు అవస్థలు పడుతున్నారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని, వీటిపై స్వయంగా పరిశీలిస్తామని బొత్స స్పష్టం చేశారు. మొత్తం 5800 స్కూళ్ళను మ్యాపింగ్ చేస్తే 400 చోట్ల నుంచే అభ్యంతరాలు వచ్చాయని దీన్ని బట్టి మిగతావి బాగానే ఉన్నట్లు తెలుస్తోందన్నారు. టెన్త్ క్లాస్స్ సప్లిమెంటరీ ఫలితాలను మంత్రి బొత్స విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన స్కూళ్ళ విలీనం, ఉపాధ్యాయుల ఆందోళన లాంటి అంశాలను కూడా ప్రస్తావించారు.
విద్యా వ్యవస్థలో ప్రయోగాత్మకంగా కొన్ని మార్పులు చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయని, వాటిలో లోటుపాట్లపై సమీక్షించుకుంటామని, కానీ అనవసరంగా విమర్శలు చేయడం తగదని విపక్షాలు, కొన్ని మీడియా సంస్థలకు బొత్స సూచించారు. ప్రభుత్వం తీసుకునే విదానపరమైన నిర్ణయాలకు ఉద్యోగులు తప్పకుండా సహకరించాల్సిందేనని ఇది వారి విధి అని, వారికి ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్నీ ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాతే చేయాలని కొందరు చెప్పడం సమంజసం కాదని, వారు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని, అందుకే విలీన ప్రక్రియపై కూడా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని బొత్స వివరించారు.
Also Read : స్కూళ్ళ మూసివేత కాదు, విలీనం మాత్రమే: బొత్స