ఏ క్షణమైనా విశాఖ కార్యనిర్వాహక రాజధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడినుంచైనా పాలన చేయవచ్చని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసమే మూడు రాజదానులపై చట్టం చేశామని అయితే కొన్ని దుష్ట శక్తులు కోర్టుకు వెళ్లాయని, త్వరలోనే న్యాయపరమైన చిక్కులు అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి జగన్ అభిమతమన్నారు. రాజ్యాంగం, చట్టానికి అనుగుణంగానే మూడు రాజధానులపై ముందుకు వెళతామని, చట్టం చేసినప్పుడే రాజధాని తరలిపు ప్రక్రియ ప్రారంభమైందని బొత్స వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి చెదకూడదని తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
నిన్న విశాఖలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ అతి త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభమవుతుందని చెప్పిన సంగతి తెలిసిందే. నేడు బొత్స కూడా కార్యనిర్వాహక రాజధానిపై మాట్లాడడంతో అతి త్వరలో జగన్ విశాఖకు మకాం మారుస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.