మార్చి 2,3 తేదీల్లో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, దావోస్ లో పాల్గొంటున్న పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వస్తారని రాష్ట్ర పారిశ్రామిక, ఐటి శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. విశాఖ సమ్మిట్ సన్నాహకాల్లో భాగంగానే దావోస్ వెళ్లలేదని, దీనిపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తమని స్పష్టం చేశారు. అసలు ఆహ్వానమే అందలేదని వారు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, తమకు అందిన ఇన్విటేషన్ ను ఇప్పటికే విడుదల చేశామని పేర్కొన్నారు.
ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ స్థానంలో ఉన్నామని, దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువగా 11.43 శాతం జీడీపీతో ఉన్నామని, ఎగుమతుల్లో కూడా లక్షా యాభై వేల కోట్ల రూపాయలు సాధించామని వివరించారు. మనం ఏ సెక్టార్ లో వృద్ధి సాధించామో ఆ రంగాల నుంచి ఎగుమతులు ఉన్నాయని, తెలంగాణాలో ఐటి ఎగుమతులు ఉన్నాయని తెలిపారు. గతంలో చంద్రబాబు దావోస్ వెళ్ళినప్పుడల్లా ప్రచారం చేసుకోవడానికే సరిపోయిందని ఫలితం లేదని, ఆ బిల్డప్ చూడలేకపోయేవారమని గుడివాడ వ్యాఖ్యానించారు.
తనపై టిడిపి నేత బొండా ఉమా చేసిన వ్యాఖ్యలపై గుడివాడ తీవ్రంగా స్పందించారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ లో ఉన్న వ్యక్తికి తనపై విమర్శలు చేసే అర్హత లేదని, వారి విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అమర్నాథ్ స్పందించారు. విజయవాడ దావూద్ ఇబ్రహీం దావోస్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తులు సిఎం జగన్ పై విమర్శలు చేస్తుంటే బాధగా ఉందన్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పడం వారి పాలసీలో భాగమని, ఎందుకు వెళ్లలేదని అడిగితే సమాధానం చెప్పేవాల్లమని, కానీ వీళ్ళ మొహం చూసి అసలు పిలవలేదని విమర్శలు చేయడం సమంజసం కాదని అన్నారు.
విశాఖ సదస్సుతో ఏపీ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు మనం అక్కడకు వెళ్తే వారు విశాఖ వచ్చేందుకు వెనకాడే పరిస్థితి ఉందని, అందరినీ ఇక్కడకు పిలిచి, మన వనరులను, అవకాశాలను ప్రమోట్ చేసుకునేందుకే దావోస్ వెళ్లకూడదని అమర్నాథ్ వివరించారు.