బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాసిన యనమల రామకృష్ణుడు, అయన బాస్ చంద్రబాబును దేశం నుంచి బహిష్కరించాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. నాడు చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవడంలో సహకరించిన యనమల నిన్న మళ్ళీ అదే తేదీ సెప్టెంబర్ 1న రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. దేశంలో ప్రతిష్టాత్మకమైన మూడు బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించి… ఒకటి హిమాచల్ ప్రదేశ్‌కు, రెండవది గుజరాత్‌కు, మూడవ ప్రాజెక్ట్ క్షిణాది రాష్ట్రాల్లో ఫార్మాకు అనుకూలమైన ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్‌ను గుర్తించి మంజూరు చేస్తే దానిమీద యనమల కేంద్రానికి లేఖ రాయడం అన్యాయమన్నారు.
రెండేళ్ల క్రితం చిత్తూరు జిల్లాలో అమర్‌రాజా బ్యాటరీస్‌కు సంబంధించి ఫిర్యాదు వస్తే, చుట్టుపక్కల గ్రామాల్లో కలుషితం జరుగుతుందని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాన్ని ధ్రువీకరిస్తే ఆరోజున మీరెందుకు (చంద్రబాబు, యనమల) మాట్లాడలేదని చంద్రబాబు, యనమలను అమర్నాథ్ ప్రశ్నించారు.తమవారికి చెందినా పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదు కానీ, రాష్ట్రంలో ఎక్కడైనా మంచి జరుగుతుంటేనో, ఏదైనా పరిశ్రమ వస్తేనో మీకు ఎందుకు కడుపుమంట అని నిలదీశారు.
రాష్ట్రానికి మేలు జరుగుతున్న తరుణంలో చంద్రబాబు, యనమల లాంటి వ్యక్తులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా వారిని ఈ రాష్ట్రం నుంచి, దేశం నుంచి బహిష్కరించాలని గుడివాడ తీవ్రంగా వ్యాఖ్యానించారు. వారికి ఈ రాష్ట్రంలో ఉండే అర్హతే లేదని, ఇలాంటి వ్యక్తులు ఉంటే రాష్ట్రానికి, దేశానికి నష్టమని, మంచి జరగదని స్పష్టం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం వైయస్సార్ పడిన తపన, ఆయన సుపరిపాలనను ఎవరైనా ఇప్పటికీ తలచుకుంటారని గుడివాడ కొనియాడారు. వైయస్సార్ వర్థంతి కార్యక్రమాన్ని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ఏటా సెప్టెంబరు 2వ తేదీన ఏదొక మీటింగో, లేక కార్యక్రమమో పెట్టి విమర్శలు చేయడం పరిపాటిగా మారిందని అదే కోవలో నేడు కూడా టిడిపి రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం పెట్టుకున్నారని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.
Also Read : బల్క్ డ్రగ్ పార్క్ వద్దు: యనమల లేఖ