Sunday, January 19, 2025
HomeTrending Newsబ్రిటన్ మంత్రితో కేటిఅర్ భేటి

బ్రిటన్ మంత్రితో కేటిఅర్ భేటి

తెలంగాణకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా యూకేలో పర్యటిస్తున్న మంత్రి కే తారకరామారావు పర్యటన తొలిరోజు బిజీబిజీగా కొనసాగింది. తొలిసారిగా యూకేలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ తెలంగాణలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను ఇక్కడి సంస్థలకు కంపెనీలకు పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగా బ్రిటన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ మినిస్టర్ రనిల్ జయవర్ధనతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. లండన్లోని మంత్రి జయవర్ధన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక రంగంలో ప్రభుత్వం ప్రాధాన్యతలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలకు సంబంధించి, వివిధ అంశాలపైన చర్చించారు. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బయో ఏషియా సదస్సులో పాల్గొనాల్సిందిగా జయవర్ధనకు మంత్రి కేటీఆర్ ఆహ్వానం పలికారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ts-ipass విధానం గురించి తెలుసుకున్న బ్రిటన్ మంత్రి, ఈ విధానంపైన ప్రశంసలు కురిపించారు.

అంతకు ముందు యునైటెడ్ కింగ్ డం ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొనడంతో పాటు పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమాలకు హాజరైన ప్రముఖ కంపెనీల సీనియర్ ప్రతినిధి బృందాలకు తెలంగాణ రాష్ట్రంలోని వ్యాపార వాణిజ్య అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. ముఖ్యంగా టీఎస్ ఐపాస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్ ఫైనాన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా-లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు కోసం తీసుకువచ్చిన పాలసీలు, వాటితో ఇప్పటిదాక తెలంగాణకు వచ్చిన భారీ పెట్టుబడుల వివరాలను కంపెనీ ప్రతినిధులకు తెలియచేశారు. డెలాయిట్, హెచ్ఎస్బిసి, జెసిబి, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొన్న ఈ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ వెంట పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఫార్మా రంగంలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడి పెట్టబోతుంది. దేశంలో ఎక్కడా లేని అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ లాబొరేటరీని ఇంగ్లాండ్ కు చెందిన సర్ఫేస్ మెజర్‌మెంట్ సిస్టమ్స్ ఏర్పాటుచేయబోతుంది. ఏడువేల చదరపు మీటర్ల వైశాల్యంలో హైదరాబాద్ లో ఏర్పాటుచేయబోయే ఈ ల్యాబ్ లో ఔషధాల తయారీలో కీలకమైన ఫార్మాసుటికల్ పౌడర్ క్యారెక్టరైజేషన్ పై పరిశోధనలు జరుగుతాయి. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీల ఔషధ ప్రయోగాలకు ఈ ల్యాబొరేటరీ వేదిక కానుంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ ల్యాబ్ ను మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నట్టు సర్ఫేస్ మెజర్ మెంట్ సిస్టమ్స్ ప్రకటించింది.

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావుతో సర్ఫేస్ మెజర్ మెంట్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డారిల్ విలియమ్స్, గ్లోబల్ ఛానల్ మేనేజ్‌మెంట్ & ఇంటర్నేషనల్ సేల్స్ మేనేజర్ డానియల్ విల్లాలోబోస్, లండన్ లోని ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ సయ్యద్ కుతుబుద్దీన్ లు సమావేశం అయ్యారు. తమ కంపెనీ ప్రణాళికలు, పరిశోధనలను మంత్రి కేటీఆర్ కు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిశీల, పారిశ్రామిక అనుకూల విధానాలే హైదరాబాద్‌లో తమ అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ లాబొరేటరీని ఏర్పాటుచేయడానికి కారణమని సర్ఫేస్ మెజర్ మెంట్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డారిల్ విలియమ్స్ చెప్పారు. తమలాంటి కంపెనీల పెట్టుబడులకు ఇండియా ఆకర్షణీయ గమ్యస్థానమన్నారు.పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబొరేటరీ (హైదరాబాద్) భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీలతో కలిసి పనిచేస్తుందన్నారు. ఈ ల్యాబ్ తో తెలంగాణ ఫార్మా రంగం ప్రతిష్ట అంతర్జాతీయంగా మరింత పెరుగుతుందన్నారు. తమ కంపెనీకి యునైటెడ్ కింగ్‌డమ్ తో పాటు జర్మనీ, అమెరికా, చైనా , ఇండియాలో యూనిట్లు ఉన్నాయని తెలిపారు. అపార నైపుణ్యం కల శాస్త్రవేత్తలు తమతో కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ లాంటి పారిశ్రామిక అనుకూలతలు ఉన్న నగరంలో తమ ల్యాబ్ ను ఏర్పాటుచేయడం సంతోషంగా ఉందన్నారు.

Also Read : లండన్ లో మంత్రి కేటిఆర్ కు ఘనస్వాగతం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్