Babu on Ramakuppam incident: ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మరోసారి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విమర్శలు గుప్పించారు. రామకుప్పంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలో పెద్దిరెడ్డి వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. కుప్పంలో మూడోరోజు పర్యటనలో ఉన్న చంద్రబాబును దళిత సంఘాలు కలుసుకున్నాయి. విగ్రహ ఏర్పాటు వివాదాన్ని అయన దృష్టికి తీసుకెళ్ళాయి. దీనిపై బాబు స్పందిస్తూ 14 ఏళ్ళపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన తన సొంత నియోజకవర్గంలో దళితులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని… దళితుల పక్షాన ఉంటారో, కొంతమంది దళారుల పక్షాన ఉంటారో ఆలోచించుకోవాలని సూచించారు.
ప్రభుత్వమే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలని, కానీ దళితులు సొంతంగా నిధులు సమకూర్చుకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటుంటే అడ్డుపడడం తగదని హెచ్చరించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని తాము వ్యతిరేకించడం లేదని దళితులు స్పష్టంగా చెబుతున్నారని బాబు అన్నారు. అంబేద్కర్ విగ్రహం కోసం ఆందోళన చేసిన దళితుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, కనీసం మహిళా పోలీసులను పెట్టకుండానే మగ పోలీసులే దళిత మహిళలపై అసభ్యంగా ప్రవర్తించడం…. యువకులపై రౌడీ షీటర్లు తెరుస్తామని పోలీసులు హెచ్చరించడం దారుణమని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంలో మంత్రి పెద్దిరెడ్డి వ్యవహరించిన తీరు బాగాలేదని, అయన తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడని బాబు విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలో అయన పెత్తనం ఏమిటని నిలదీశారు. జిల్లా మంత్రిగా దళితులకు పెద్దిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి ప్రవర్తన మార్చుకోకపోతే దళితులు తిరుగుబాటు చేస్తే జిల్లా వదిలి పారిపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Also Read : ఓటమి భయంతోనే బాబు టూర్: పెద్దిరెడ్డి