కరోనా మహమ్మారి సమయంలో కోర్టు ఆదేశాలతో చాలా మంది ఖైదీలను జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. ఇందులో చాలా మంది ఇప్పటి వరకు పెరోల్ గడువు ముగిసినా ఇంకా తిరిగి జైలుకు రాలేదు. ఈ విధంగా మహారాష్ట్రలో 451 మంది అదృశ్యమయ్యారు. ఇదే అదునుగా భావించిన ఖైదీలు పరారయ్యారు. ఇందులో 357 మంది ఖైదీలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఖైదీల ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మహారాష్ట్ర పోలీసులకు టాస్క్…ఆచూకీ లేని ఖైదీలు
మహారాష్ట్రలో కరోనా కాలంలో… ఏడేళ్లు లేదా అంతకంటే తక్కువ శిక్ష పడిన ఖైదీలను పెరోల్‌పై విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. అధికారుల సమాచారం ప్రకారం.. మార్చి 2020 వరకు మహారాష్ట్రలోని జైళ్లలో దాదాపు 35వేల మంది వరకు ఖైదీలున్నారు. ప్రస్తుతం వారంతా ఎక్కడ తలదాచుకున్నారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. జైళ్లలో పెద్ద సంఖ్యలో ఖైదీలు కరోనా మహమ్మారి బారినపడి విషయం తెలిసిందే. ఖైదీల భద్రత, సామాజిక దూరాన్ని దృష్టిలో పెట్టుకొని బెయిల్, పెరోల్‌పై అండర్ ట్రయల్‌తో సహా కొంత మంది శిక్షార్హులను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.