Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

తమిళ రాజకీయాలపై తెలుగు వారికి ఎప్పుడూ అమితమైన ఆసక్తే. మన తెలుగు బంధుమిత్రులు అక్కడ లక్షల సంఖ్యలో నివసిస్తుండడం కూడా దీనికి కారణం కావచ్చు. ఇప్పుడు కూడా ఆ రాష్ట్రంలో కొత్తగా ఉదయించిన సూర్యుడు, ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ చేపడుతున్న వినూత్న చేతల ఆసక్తికర విశేషాలు తెలుగువారిని ఆబ్బుర పరుస్తున్నాయి.

 

కొత్త సంప్రదాయాలకు నాంది
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక, స్టాలిన్ తనదైన శైలిలో సరికొత్త సంప్రదాయాలకు తెరతీశారు. పదవి స్వీకరించాక, విపక్ష నేత పళనిస్వామిని ఆయన ఇంటికే వెళ్లి కలిసి వచ్చారు. అలాగే, కరోనాను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన సన్నాహక కమిటీలో ప్రతిపక్ష నేతలనూ నియమించారు. ఇంతకన్నా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, డిఎంకెకి బద్ధ శత్రువు జయలలిత పేరిట వున్న అమ్మ క్యాంటీన్లను, అవే పేరుతో యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. ప్రతీకార చర్యలతో రగిలిపోయే తమిళ రాజకీయాల్లో ఇదొక ఆశ్చర్యకర పరిణామం.

సిద్ధాంతం నాస్తికత్వమే.. అయినా..
పార్టీ నాస్తిక సిద్ధాంతాన్ని నరనరాన జీర్ణించుకున్న స్టాలిన్, పాలనా పగ్గాలు చేపట్టాక, సమసమాజ ధర్మానికి కట్టుబడ్డారు. కరోనా కష్ట సమయంలో, భక్తుల రాక తగ్గి, జీవనోపాధి కోల్పోయిన, రాష్ట్రంలోని దాదాపు 34వేల గుళ్లలోని నిరుపేద అర్చకులకు, ఈ కరోనా సమయంలో రూ.4 వేలు ధనం, 10 కిలోల బియ్యం, 15 రకాల కిరాణ సామగ్రిని అందించాలని నిర్ణయించారు. డిఎంకె విధానాలను నిశితంగా పరిశీలించే వారికిది ఆశ్చర్యాన్ని కలిగించే నిర్ణయం. హిందుత్వ నినాదంతో, రాష్ట్రంలో కాలుమోపాలని ఉవ్విళ్లూరుతున్న కమలదళాన్ని, అసెంబ్లీ ఎన్నికల్లో  నిలువరించిన స్టాలిన్, తాజా చర్యలతో, ఇక బీజేపీకి ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వదలచుకోలేదని స్పష్టమవుతోంది.

 

ప్రజలతో మమేకం అవుతూ..
“భ్రమన్ సంపూజ్యతే రాజా“ అన్నది చాణక్యుడి నీతి. రాజు తన రాజ్యంలో పర్యటిస్తూ, ప్రజలకు అండగా వుంటే గౌరవం పొందుతాడని దీని అర్థం. స్టాలిన్ తీసుకుంటున్న చర్యలు, ప్రజల మనసులే కాదు, విపక్షాల నేతల అభిమానాన్నీ చూరగొంటున్నాయి. రోనా నియంత్రణ చర్యల్లో భాగంగా, స్టాలిన్ పీపీటీ కిట్ ధరించి, కోవిడ్ కేంద్రాన్ని పర్యటించారు. దీన్ని డిఎంకె నేతలు మామూలుగానే తీసుకున్నారు గానీ, కాంగ్రెస్ సిటింగ్ ఎంపీ జోతిమణి మాత్రం.. స్టాలిన్ ని ఆకాశానికెత్తేస్తూ, ప్రధాని మోదీకి చురకలు అంటించింది. పీపీటీ కిట్ ధరించిన స్టాలిన్ ఫోటోలు షేర్ చేస్తూ.. ఇదిగో మా ముఖ్యమంత్రి ఇక్కడున్నారు.. మరి ప్రధానిగారు ఎక్కడ..? అన్న శీర్షికతో, మోదీ నిష్క్రియాపరత్వంపై ఆమె చేసిన ట్వీట్ బాగా వైరల్ అయింది.

అభివృద్ధి పథమే స్టాలిన్ సూత్రం

అందరినీ కలుపుకపోతూ, వినూత్న రీతిలో దూసుకు వెళ్తున్న స్టాలిన్ తరహాలోనే రాష్ట్రాభివృద్ధి కూడా దూసుకు వెళ్తుందని తమిళ ప్రజలు విశ్వసిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. చెన్నై నగరపాలిక సంస్థ మేయర్ గా పనిచేసిన కాలంలో, స్టాలిన్, నగర అభివృద్ధిపై తనదైన ముద్ర వేశారు. నగరంలో రహదారుల విస్తరణలో భాగంగా, ఆయన నిర్మించిన 9 పెద్ద వంతెనలు, 49 దాకా చిన్న వంతెనలు, ఇవాళ కూడా ట్రాఫిక్ నియంత్రణలో కీలకంగా మారాయి. పైగా ఆయన కార్పొరేషన్ స్కూళ్ల పనితీరును కూడా బాగా మెరుగు పరిచారు. ఇక మంత్రిహోదాలో తీసుకున్న నిర్ణయాలూ మహిళా సాధికరతకు పట్టం కట్టాయి. అందుకే, స్టాలిన్ మీద ప్రజల విశ్వాసం అనతికాలంలోనే రెట్టింపయింది.

విశిష్ట అవకాశాల సృష్టికర్త

స్టాలిన్ అన్న పేరే తమిళనాట ఓ కలకలం.. ఓ పోరాటం.. ఓ ఉత్తేజం.. ఓ స్పూర్తిమంతం..  తన 14వ ఏటనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన స్టాలిన్ ది సుదీర్ఘ రాజకీయానుభవం. 1964లో రాజకీయాల్లోకి వచ్చీరాగానే, స్టాలిన్, చెన్నై పరిధిలోని గోపాలపురంలో, పార్టీ పటిష్టత కోసం, డిఎంకె యువజన విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆయన వినూత్న ఆలోచన, అది ఫలించిన తీరు చూశాకే,  కరుణానిధి పార్టీకి రాష్ట్రస్థాయి యువజన విభాగాన్ని ఏర్పాటు చేసి, స్టాలిన్ కి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఇలా ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. తనకంటూ విశిష్ట అవకాశాన్ని సృష్టించుకోవడం స్టాలిన్ కి వెన్నతో పెట్టిన విద్య.

 

పోరాటమే ఊపిరి

నిజానికి, కరుణానిధి తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఎం.కె.స్టాలిన్, వారసత్వ పుణ్యాన గాలివాటంగా ముఖ్యమంత్రి అయిపోలేదు. ఆదినుంచీ ఆయనది పోరాట తత్త్వమే. పోరాడి జనహృదయాలు గెలిచిన నాయకత్వమే. విపక్షంలో వున్నప్పుడు ప్రజాహితం కోసం ఆయన అనుసరించిన ధోరణి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేంది. ఆ క్రమంలో 1976వ సంవత్సరంలో అంతర్గత భద్రత చట్టం (మీసా) కింద అరెస్టయి.. ఏడాది పాటు జైల్లో వున్నారు. ఆ తర్వాత, యువజన విభాగం ఒత్తిడితో, చెన్నై పరిధిలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి 1984లో పోటీ చేసి ఓడిపోయారు. అయినా, వెనుకంజ వేయలేదు. ఆ తర్వాతి కాలంలో కూడా నీట్, సీఏఏ వంటి కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడారు. తమిళ సంస్కృతికి దర్పణంగా వుంటూ, తమ సంస్కృతిని పరిరక్షించుకున్నారు.

యథా రాజా తథా ప్రజాః
“రాజ్ఞధర్మణి ధర్మిష్ఠాః పాపే పాప పరాః సదా
రాజానుమనువర్తన్తే యథా రాజా తథా ప్రజాః”

…అంటే, రాజు ధర్మాన్ని అనుసరించేవాడైతే, ప్రజలూ ధర్మాత్ములవుతారు. రాజు పాపి అయితే, ప్రజలు పాపమార్గంలోకే వెళతారు. రాజు ఉదాసీనుడైతే ప్రజలూ అలాగే తయారవుతారు. మొత్తానికి రాజు ఎలా వుంటే ప్రజలు అలాగే వుంటారు అని అర్థం. కక్షలు, ప్రతీకార చర్యలతో రగిలిపోయే తమిళ రాజకీయాల్లో, స్టాలిన్ తీరును గమనిస్తున్న ప్రజలు, రాష్ట్రంలో సరికొత్త సూర్యుడు ఉదయించినట్లుగానే భావిస్తున్నారు. ఇక రాష్ట్ర అభివృద్ధి శరవేగం అవుతుందనీ నమ్ముతున్నారు. అయితే, కాల నిర్ణయం ఏంటో వేచి చూడాలి.

-పి.విజయకుమార్

 

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com