తన సస్పెన్షన్ అనేది సరైన రాజకీయ అవగాహన, స్పష్టత, ఆలోచన లేనివాళ్ళు చేసే పనిగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అభివర్ణించారు. అసలు వివరణ తీసుకోలేదని, అసలు అడగలేదని చెప్పారు. మండలి ఎన్నికల్లో పార్టీ పరంగా ఇద్దరు ఎమ్మెల్యేల గురించి తాము పట్టించుకోలేదని, వారిని ఓటు అడగలేదని సజ్జల చెప్పిన విషయాన్ని ఆనం ప్రస్తావించారు. ఇలా చెప్పిన 24 గంటల్లోనే సస్పెన్షన్ అంటూ ప్రకటించారని, అసలు ఎవరైనా ఇలా మాట్లాడతారా అంటూ ఆనం తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్య సలహాదారులు రాజకీయ ఆలోచన ఏదైనా ఉందా అంటూ ప్రశ్నించారు. ఓ టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆనం ఈ వ్యాఖ్యలు చేశారు.
మీరు ఎవరికైనా ఓటు వేయమని అడిగి ఉంటే… తాము వేయకపోతే… తాము వేయలేదని ఎలక్షన్ కమిషన్ నిర్ధారిస్తే అప్పుడు చర్యలు తీసుకోవాలని అంతేగానీ ఇష్టానుసారం తానూ క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డానని ఆరోపించడం, సస్పెన్షన్ వేయడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. తనకు ముడుపులు ముట్టాయని చెప్పడంపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఏదైనా బ్యాంకు లావాదేవీలు ఉన్నాయా అని నిలదీశారు. అసలు సలహాదారులకు ఉన్న అర్హత ఏమిటని, వారి నియామకంపై కోర్టు కూడా ప్రశ్నిస్తోందని తీవ్రంగా వ్యాఖ్యానించారు. మరొకరిని ప్రశ్నించే అర్హత వారికి లేదన్నారు. ఓటు గురించి తనను ఎవరైనా అడిగారా, మంత్రులు, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులు ఎవరైనా అడిగారా అని ఆనం అడిగారు.
ఉగాది రోజు తనకు ప్రసాదరాజు ఫోన్ చేసి పోలింగ్ కు వస్తున్నారా అని అడిగారని, మర్నాడు కూడా అసెంబ్లీకి వచ్చినప్పుడు కలిశారని, కానీ ఎవరికి ఓటు వేయాలో కూడా కనీసం చెప్పలేదని ఆనం వివరించారు.
సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ జరిగినప్పుడు, క్రాస్ ఓటింగ్ జరిగిందని కొన్ని ఆరోపణలు వస్తుందని, ఇలా చేయడానికి అవకాశాలు ఉన్నాయా అనే అంశంపై తాను ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తానని వెల్లడించారు. చట్టపరంగా చర్యలు తీసుకోవడంపై కూడా ఆలోచిస్తున్నామన్నారు.