వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఆడే అవకాశం వస్తే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు బంతితో చుక్కలు చూపిస్తానని హైదరాబాదీ పేసర్ సిరాజ్ మహ్మద్ చెబుతున్నాడు.
విలియమ్సన్ కు చక్కటి లైన్ అండ్ లెన్త్ తో బౌలింగ్ చేస్తానని, ఎక్కువ డాట్ బాల్స్ వేసి చికాకు తెప్పిస్తానని, ఈ విధంగా ఒత్తిడికి గురి చేసి షాట్ కొట్టబోయి అవుట్ అయ్యేలా చేస్తానంటూ ధీమాగా వెల్లడించాడు. గత డిసెంబర్ లో ఆస్ట్రేలియా టూర్ లో తన బౌలింగ్ తో ఆకట్టుకున్న సిరాజ్ సీరీస్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆ టూర్ లో సిరాజ్ ప్రదర్శనను ప్రాతిపదికగా తీసుకున్న సెలక్షన్ కమిటీ ఇంగ్లాండ్ టూర్ కు ఎంపిక చేసింది.
ఆస్ట్రేలియా పిచ్ లు బౌన్స్, పేస్ లకు అనుకూలంగా ఉంటాయని కానీ ఇంగ్లాండ్ పిచ్ ల్లో బంతి స్వింగ్ అవుతుందని అందుకే తెలివిగా బౌలింగ్ చేయాలని, బాట్స్ మెన్ ఫ్రంట్ పుట్ కు వచ్చి ఆడేలా వేయాల్సి ఉంటుందని వివరించాడు. మన కంటే న్యూజిలాండ్ జట్టు అక్కడి వాతావరణ పరిస్థితులకు త్వరగా అలవాటు పడుతుందని, అందులోను ఫైనల్ కు ముందుగా ఇంగ్లాండ్ జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోందని గుర్తు చేశాడు. ఐపిఎల్ తరువాత తాము క్రికెట్ ఆడలేదని, చాలా రోజులుగా క్వారెంటైన్ లో గడుపుతున్నామని, కానీ న్యూజిలాండ్ ముందుగానే ఇంగ్లాండ్ చేరుకోవడం, రెండు టెస్టు మ్యాచ్ లు ఆడుతుండడం ఆ జట్టుకు కొంత అనుకూలంగా ఉన్నా…. మెరుగైన ఆట తీరుతో ఫైనల్ లో విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. మొదట్లో గ్రౌండ్ లో ఉన్నప్పుడు నెర్వస్ గా ఉండేదని….. టాప్ రేటింగ్ జట్లు, సీనియర్ ఆటగాళ్ళతో కలిసి ఆడడం వల్ల దాన్ని అధిగామించానని చెప్పాడు.
ఫిట్ నెస్ కాపాడుకోవడం, కఠోర శిక్షణ తోనే మంచి బౌలర్ గా రాణించవచ్చని ఈ 27 ఏళ్ళ పేసర్ వివరించాడు. రాబోయే రెండు మూడు నెలల క్రికెట్ సిరాజ్ నైపుణ్య ప్రదర్శనకు మరింత దోహదపడుతుందని ఆశిద్దాం.