Wednesday, February 28, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపిచ్చోపనిషత్తు

పిచ్చోపనిషత్తు

Self-made: ఇండ్ల రామసుబ్బా రెడ్డి, ఆయన కొడుకు విశాల్ ఇద్దరూ జగమెరిగిన మానసిక వైద్యులు. వాళ్ళిద్దరితో నాది పాతికేళ్ల స్నేహం. రామసుబ్బా రెడ్డి వైద్య వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా రచనా వ్యాసంగాన్ని వదిలిపెట్టలేదు. మానసిక రుగ్మతలు- వాటి పరిష్కారాల గురించి నలభై ఏళ్లుగా అందరికీ అర్థమయ్యేలా వ్యాసాలు రాస్తున్నారు. అవన్నీ సంకలనాలుగా పుస్తకాల రూపంలో ప్రచురితమయ్యాయి కూడా. విశాల్ కూడా తండ్రి బాటలో కలం పట్టి ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తో కలిసి పిల్లల పెంపకం మీద పుస్తకం వెలుగులోకి తెచ్చారు.

మొన్న ఒక రోజు సాయంత్రం విజయవాడలో రామసుబ్బారెడ్డి నన్ను వారి ఇంటికి ఆహ్వానిస్తే వెళ్లాను. మా మధ్య సాహిత్య చర్చలో గంటలు నిమిషాల్లా దొర్లిపోతూ ఉంటాయి.

ఆధ్యాత్మిక సాహిత్యంలో చంద్రుడికి- మనసుకు ఉన్న సంబంధం; చంద్రుడి పదహారు కళలు మనిషి మీద, మనసు ప్రవర్తన మీద ఎలా ప్రభావం చూపుతుందన్న విషయంతో మొదలై శ్లోకాలు, పద్యాలు, పాటలతో నాకు తెలిసినవి చెప్పాను. మానసిక వైద్యులుగా వారిద్దరూ చెప్పిన విషయాలు లోకం తెలుసుకోవాలి. అందులో ప్రధానమయిన విషయాలు వారి మాటల్లోనే-

“మానసిక చికిత్సల కోసం వచ్చే రోగుల్లో 20 నుండి 40 ఏళ్ల వయసువారే ఎక్కువ. పిచ్చిని ఇప్పుడు పిచ్చి అని అనడం లేదు. కొంచెం నాజూగ్గా ఉన్మాదం అని అంటున్నారు. ఉన్మాదం ఉన్నవారు తమకు తాముగా మెంటల్ ఆసుపత్రులకు వెళ్లరు. వారిని వారి బంధువులు ఆసుపత్రులకు తీసుకువెళ్లాలి. తమలో తామే మాట్లాడుకోవడం; విపరీత ప్రవర్తన, ఏదయినా చేయగలం అని ఒకసారి, ఏమీ చేయలేమని మరో సారి; అంతులేని దిగులు; ప్రతిదానికి భయపడిపోవడం; ఏదో అయిపోతుందని ఆందోళన; నిద్ర పట్టకపోవడం; నలుగురిలో కలవకపోవడం; కలిసినా మాట్లాడకపోవడం…లాంటివి ఉన్మాద లక్షణాలు.

మెదడులో డొపమిన్, సీరోటోనిన్, నార్ ఎఫినఫిర్- మూడు రసాయనాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఇలాంటి ఉన్మాద లక్షణాలు బయటపడుతూ ఉంటాయి.

ఇక రెండో రకం డిప్రెషన్- దిగులు అధికంగా ఉన్నవారు. ఇలాంటివారు వారికి వారే మానసిక వైద్యుల దగ్గరికి వెళుతున్నారు. వ్యాపారంలో నష్టాలు, ప్రేమ విఫలం, పరీక్షలో ఫెయిల్, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు…ఇలా రోజువారీ సమస్యలే కుంగదీస్తూ ఉంటాయి. వీరికి మందుల అవసరం లేకుండా మాటల కౌన్సిలింగ్ తోనే దిద్దుబాటు చేయవచ్చు.

ఇక మూడోరకం ఓ సి డి. కడిగిన చేతులను మళ్లీ కడగడం, వేసిన తలుపులు వేయలేదనుకుని మళ్లీ వెళ్లి చూసి రావడం, అతి శుభ్రత వ్యసనం కావడం, పరుపు మీద దిండు అర అంగుళం పక్కకు జరిగినా…టేబుల్ మీద పుస్తకం ఒక సెంటీమీటర్ జరిగినా…పాల గిన్నె ఉండాల్సిన చోట పెరుగు గిన్నె పెట్టినా…వీరికి హిరోషిమా నాగసాకి అణుబాంబు విస్ఫోటనం కంటే పెద్ద ప్రమాదం జరిగినట్లు. తట్టుకోలేరు. బాత్ రూములో టవల్ ఉండాల్సిన చోట కర్చీఫ్ ఉన్నందుకు అవసరమయితే భర్తను వదులుకోవడానికి భార్య, భార్యను వదులుకోవడానికి భర్త బరువెక్కని గుండెతో సిద్ధపడతారు కానీ…అటుదిటు జరిపి సర్దుకుపోలేని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ వీరిది.

ఇక నాలుగోది వృద్ధాప్యంలో కొందరికి వచ్చే డిమెన్షియా, అల్జీమర్స్- మతిమరుపు.

ఇందులో మొదటిది; నాలుగోది కొంతవరకు మన చేతిలో లేనిది. రెండోది, మూడోది మనకు మనం చేజేతులా సృష్టించుకుంటున్నది. పిచ్చివారికి పిచ్చి ఉన్నట్లు చెబితే ససేమిరా ఒప్పుకోరు. పిచ్చి కాని- రెండు, మూడో స్థాయి వారు ఉన్మాద ఫలితమే అనుభవిస్తున్నారని చెప్పినా తెలుసుకోలేరు”.

ఫలశ్రుతి:-

ఇదంతా చదివిన తరువాత-
1 . ఎవరి పిచ్చి వారికి ఆనందం
2 . లోకమే ఒక పిచ్చి మాలోకం
3 . మనోరోగానికి మందు లేదు- అని అనుకుని పిచ్చిని పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారో?
ఎవరిని వారు అద్దంలో చూసుకుని ఎంతో కొంత సంస్కరించుకుంటారో?
ఎవరికి వారే తేల్చుకోవచ్చు.
ఇందులో బలవంతమేమీ లేదు!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్