Saturday, January 18, 2025
HomeTrending Newsసంగీత కళానిధి సుబ్రమణ్య అయ్యర్

సంగీత కళానిధి సుబ్రమణ్య అయ్యర్

రెండు దశాబ్దాలకు పైగా కచేరీలు చేసి ఎనలేని పేరుప్రఖ్యాతులం సంపాదించిన సుప్రసిద్ధ శాస్త్రీయ సంగీత విద్వాంసులు ముసిరి సుబ్రమణ్య అయ్యర్. కృతులలోని భావాన్ని రాగయుక్తంగా ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేయడం ఆయన ప్రత్యేకత. ఆయన సరళిని అనుసరించిన వారెందరో ఉన్నారు.

తమిళనాడులోని బొమ్మలపాళ్యం (తిరుచ్చి జిల్లా)లో శంకర శాస్త్రి, సీతాలక్ష్మి దంపతులకు 1899 ఏప్రిల్ తొమ్మిదో తేదీన సుబ్రమణ్య అయ్యర్ జన్మించారు. ఆయన తండ్రి సంస్కృత పండితుడు. తన చిన్నతనంలోనే తల్లిని ఓ సోదరి (రాజాత్తి)ని కోల్పోయారు.

ఆయన పద్నాలుగో ఏట నాగలక్ష్మిని వివాహమాడారు. ఇంగ్లీషుపై గట్టి పట్టున్న ముసిరి అలనాటి నటుడు, గాయకుడు అయిన ఎస్.జి. కిట్టప్ప పాటలు విని సంగీతంపట్ల ఆసక్తి పెంచుకున్నారు. కిట్టప్పలాగే ముసిరి గొంతు కూడా ఘనంగా ఉండేది.

ఎస్. నారాయణ స్వామి అయ్యర్ వద్ద సంగీతంలో రెండేళ్ళ పాటు శిష్యరికం చేసిన ముసిరి చెన్నైలో వాయులీన విద్వాంసుడు కరూర్ చిన్నస్వామిని ఆశ్రయించారు. అయితే చిన్నస్వామి తాను ఎక్కువసేపు సంగీత పాఠాలు చెప్పలేకపోతుండటంతో ముసిరిని పురసవాక్కం (మద్రాసు) లో ఉంటున్న టి.ఎస్. సబేశ అయ్యర్ దగ్గరకు పంపారు. సబేశ అయ్యర్ వద్ద దాదాపు తొమ్మిదేళ్ళు సంగీతం అభ్యసించిన ముసిరి 1920లో మద్రాసులోనే అనేక కచేరీలు చేశారు. అయితే ఆయన అరంగేట్రం తిరుచ్చీలో 1917లో జరిగింది.

ఓ కచేరీలో ఆయన పేరుని ముసిరికి చెందిన సుబ్రమణ్య అయ్యర్ అని ప్రకటించారు. అప్పటి నుంచే ముసిరి సుబ్రమణ్య అయ్యర్ గానే ప్రసిద్ధి పొందారు. నిజానికి ఆయన పుట్టింది ముసిరిలో కాదు. మరి ఈ ముసిరి అనే తన పేరు ముందు ఎలా కలిసిందో చెప్తూ తను జన్మస్థలమైన బొమ్మలపాళయం కన్నా ముసిరి పది మందికీ తెలిసిన పేరవడంతో ముసిరి అనే పేరు ఇంటిపేరులా స్థిరపడిందన్నారు.

నగుమోము కృతిని ఆయనకు తెచ్చిపెట్టిన పేరు ఇంతా అంతా కాదు. వాగ్గేయకారుడు త్యాగయ్య కృతి అయిన నగుమోముని అందరూ ఆభేరి రాగంలో పాడుతుండగా ముసిరి దేవగాంధారి రాగంలో పాడి ఓ కొత్తదనం తీసుకొచ్చారు. ఆయన పాడిన తీరు బాగుందనిపించి ఆ తర్వాత నుంచి ఎందరో విద్వాంసులు సైతం ఆ కీర్తనను దేవగాంధారంలోనే ఆలపించి మన్ననలు పొందడం విశేషం. అలాగే మరికొన్ని కృతులను కూడా ఆయన తన శైలిలో పాడి వాటికి ముసిరి బాణీ అని ముద్ర వేయించారు.

ముసిరి సుబ్రమణ్య అయ్యర్ ఓ సినిమాలో నటించారు. ఆ సినిమా పేరు భక్త తుకారాం. తుకారాం పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆయన పాడిన పాటలకు విశేష ఆదరణ లభించినా ఆ తర్వాత నటించడం మానేశారు. ఈ సినిమాలో ఆయన భార్యపాత్రలో జీజా బాయిగా కె. సీతాదేవి నటించారు.

మహిళలతో కలిసి నటించడం, మేకప్పు‌, లైట్లు అసౌకర్యంగా భావించి ఇక నటించబోనని చెప్పేసారు. అలాగే ఆయన సినిమాలో నటించడం గురువుగారికి కూడా అంతగా నచ్చలేదు.

అనారోగ్య కారణాలతో ఆయన 1945 తర్వాత కచేరీలు మానేశారు. అయితే ఆయన 1949లో సెంట్రల్ కాలేజ్ ఆఫ్ కర్నాటిక్ మ్యూజిక్ (మద్రాసు) తొలి ప్రిన్సిపాల్ అయ్యారు. 1965లో రిటైరైన ముసిరి శ్రీ త్యాగరాజ బ్రహ్మ మహోత్సవ సభకు గౌరవ కార్యదర్శిగా, కోశాధికారిగా సంగీతానికి తన వంతు సేవలందించారు. తిరువయ్యారులో త్యాగరాజు సన్నిధిలో త్యాగరాజు ఆరాధన నిర్వణలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.

సంగీత కళానిధి, సంగీత కళా శిఖామణి వంటి ఎన్నో పురస్కారాలు పొందిన ముసిరి సుబ్రమణ్య అయ్యరుని 1971లో భారత ప్రభుత్వం పద్మభూషన్ తో సన్మానించింది. అలాగే సంగీతానికి చేసిన సేవలకు గుర్తుగా 1999లో పోస్టేజ్ స్టాంపుని ప్రచురించింది.

ముసిరి ప్రముఖ సంగీత విద్వాంసుడు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ కు అత్యంత సన్నిహితులు. ఈయన మైలాపూరులోని ఆలివర్ వీధిలో జాగా కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇంట మొదటి అంతస్తులోనే సంగీత సాధన చేసేవారు. ఎక్కువ సమయం ఇక్కడే గడిపేవారు.

ఆయనకు ప్రభుత్వాధికారులు న్యాయ వాదులతో మంచి పరిచయాలుండేవి. మిత్రులను తన ఇంటికి ఆహ్వానించి కచేరీ చేసేవారు. 1975 మార్చి 25వ తేదీన కన్నుమూసిన ముసిరి జ్ఞాపకార్థం ఆయన నివసించిన ఆలివర్ వీధికి ముసిరి సుబ్రమణ్య అయ్యర్ పేరు పెట్టారు.

– యామిజాల జగదీశ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్