వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ జంటగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కొండపొలం’ అక్టోబర్ 8న విడుదల కాబోతోంది. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌ను కర్నూలులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎం కీరవాణి, రాజీవ్ రెడ్డి, క్రిష్, వైష్ణవ్ తేజ్, సాయి చంద్ తదితరులు పాల్గొన్నారు.
ఎంఎం కీరవాణి మాట్లాడుతూ “కర్నూలులో ఉన్న అభిమానులందరికీ థ్యాంక్స్. నాకు కర్నూలు జిల్లా అంటే చాలా ఇష్టం. మంత్రాలయం, శ్రీశైలం, జోగులాంబ ఇలా నాకు ఇష్టమైన పుణ్యక్షేత్రాలున్నాయి. ఆత్మన్యూనత భావం, అపనమ్మకం ఉన్నప్పుడు పాడుకునే మంత్రాన్ని నేను కంపోజ్ చేశాను. ఇక్కడకు వస్తూ వస్తూనే ఓ పాటను విడుదల చేశాం” అన్నారు.
సీనియర్ సాయి చంద్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు నాకు ప్రత్యేకం. నేను కర్నూలులో పుట్టాను. పుడితే కర్నూలులోనే పుట్టాలి. నాలుగేళ్లు ఉన్నప్పుడే హైద్రాబాద్‌కు వెళ్లాను. కర్నూలు రుణం ఎలా తీర్చుకోవాలని అనుకున్నాను. అన్ని యాసలో పాత్రలను చేశాను కానీ.. కొండపొలం సినిమాలో కర్నూలు యాసలోనే మాట్లాడాను. కర్నూలుతో తెలుగు సాహిత్యానికి, తెలుగు సినిమాకు మధ్య గొప్ప సంబంధం ఉండేది. కానీ చాలా ఏళ్ల క్రితమే ఆ బంధం విడిపోయింది. కానీ ఈ సినిమాతో మళ్లీ ఆ బంధం కుదిరింది. క్రిష్ గారు ఆ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు” అన్నారు.
సన్నపురెడ్డి వెంకట రామి రెడ్డి మాట్లాడుతూ.. ‘మాది కడప జిల్లా. నల్లమల కొండలు ఇవతల కర్నూలు, అవతల కడప జిల్లా. నల్లమల అడవుల్లో ఓ 40 రోజులు ఉండి, అక్కడ జరిగిన సంఘటనల ఆధారంగానే కొండపొలం నవల రాశాను. ఆ నవలను క్రిష్ గారు సినిమాగా తీశారు. ఓ యువకుడు సాగించిన ప్రయాణమే ఈ చిత్రం. ఇది మన కథ, మన ప్రాంతం కథ. రాయలసీమ కథ సినిమాగా రావడం మనకెంతో గర్వకారణం. ఇది వరకు అయితే… కత్తులు, బాంబులు, తొడగొట్టడాలు, సుమోలు గాల్లోకి ఎగిరేవి. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కథ అని ఫిక్స్ అయ్యారు కానీ ఇది అలాంటిది కాదు. ఒకటి రెండు శాతం ఉండే ఫ్యాక్షన్‌ను తీసేసి మిగతా 98 శాతం ఉండే రైతులు, గొర్లకాపర్లు, అట్టడుగు వర్గాల వారి బాధలు, కష్టాల గురించి చెప్పే కథ’ అని అన్నారు.
రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ “నిర్మాతలకు కొంత మంది హీరోలతో పని చేయాలని ఉంటుంది కానీ నాకు మాత్రం మ్యూజిక్ డైరెక్టర్‌తో పని చేయాలని ఉంది. అది కేవలం కీరవాణి గారు మాత్రమే. మళ్లీ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్. క్రిష్‌కు థ్యాంక్స్ చెప్పను. ఆయన నాకోసం చేయాల్సింది చేస్తాడు. కొండపొలం కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. అక్టోబర్ 8న ఈ చిత్రం రాబోతోంది” అన్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ “లండన్‌లో సినిమా షూటింగ్‌లో ఉన్నాను. అందుకే ఈవెంట్‌కు రాలేకపోయాను. ఓబులమ్మ పాత్ర నాకు ఎంతో నచ్చింది. కొత్త లుక్కులో చూపించారు. ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు, నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు క్రిష్‌కు థ్యాంక్స్. ఈ జర్నీ నాకు ఎంతో నచ్చింది. ఇంత కంటే గొప్పది ఏమీ కోరుకోలేం. వైష్ణవ్ తేజ్‌కు ఎంతో భవిష్యత్తు ఉంది. ఇంత మంచి చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. ఓబులమ్మ మీ హృదయంలో నిలిచిపోతుంది” అన్నారు.
దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ “ఈ కొండపొలం సినిమా చూసిన తరువాత బస్సులో వస్తున్నప్పుడు ఆలోచించాను. పవన్ కళ్యాణ్ గారికి నేను మొట్టమొదటగా థ్యాంక్స్ చెప్పాలి. వందల కోట్లతో భారీ బడ్జెట్ సినిమా చేస్తుంటే.. మధ్యలో గ్యాప్ వస్తే.. ఇలా వెళ్లి ఒక సినిమా చేసి వస్తాను అని చెబితే.. వెన్నుతట్టి ‘అవసరం క్రిష్.. నీకు నీ టీంకు అవసరం… వెళ్లు సినిమా చేసుకో. మళ్లీ మనం సినిమా చేద్దామని’ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్. ‘హరిహర వీరమల్లు’ మధ్యలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఆయన అనుమతించకపోయినా, ఏఎం రత్నం గారు అంగీకరించకపోయినా.. ఇంద్రగంటి, సుకుమార్ గారు ఈ నవలను నాకు పరిచయం చేయకపోయినా.. సన్నపురెడ్డి వెంకటరెడ్డి ఈ నవలను రాయకపోయినా ఈ చిత్రం వచ్చేది కాదు. ఈ అందరికీ థ్యాంక్స్”
“ఈ చిత్రం కోసం అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. పడుతూ లేస్తూ ఉన్నాం. రాజీవ్‌కు ఈ నవల చెప్పి, చేద్దామని అంటే.. కథ కూడా అడగలేదు. ఆయన వల్లే ఇలాంటి చిత్రాలు చేయగలుగుతున్నాను. నేను సినిమా తీసింది అంతా ఓ ఎత్తు అయితే.. పై మెట్టులో పెట్టింది ఎంఎం కీరవాణి. ఆయన ఈ చిత్రాన్ని మరో లెవెల్‌కి తీసుకెళ్లారు. ‘రయ్ రయ్’ అనేది పాట కాదు మంత్రం. కీరవాణి, సిరివెన్నెల గారు అద్భుతమైన పాటలు రాశారు. ఆత్మ న్యూనత భావం ఉన్న రవీంద్ర అనే యువకుడు.. తనది తాను ఎలా సాధించుకున్నాడు అనేది కథగా రాస్తే.. దాన్ని అందంగా చిత్రీకరించాం. నేను రకుల్ దగ్గరి నుంచి క్రమశిక్షణను నేర్చుకున్నాను. వైష్ణవ్ చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. వంద ఏళ్లు, వంద సినిమాలతో ఓ గొప్ప నటుడిగా ఉంటావని ఆశిస్తున్నాను” అన్నారు క్రిష్.
వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ “కీరవాణి గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ రోజు ఆయనే హీరో. ఈ కథలో రవీంద్ర అనే క్యారెక్టర్.. ఎన్ని ఒడిదొడుకులున్నా కూడా తలెత్తుకుని తిరగాలని చెబుతాడు. సన్నపురెడ్డి వెంకటరెడ్డి గారు రాసిన కథను తెరపైకి తీసుకొచ్చేందుకు క్రిష్ చాలా కష్టపడ్డారు. ఎప్పుడూ తలెత్తుకుని మన దేశాన్ని గర్వపడేలా చేయాలని క్రిష్ చెబుతుంటారు. తలెత్తుకుని ఉంటూ మనదేశాన్ని గర్వపడేలా చేయాలని అనుకునే కుర్రాడి కథ. ఇది మీలోని ఒక్కరి కథ. ‘రయ్ రయ్ రయ్యార’నే మంత్రం మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను” అన్నారు.