తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా తన నియామకంపై వస్తోన్న విమర్శలకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. 17 సంవత్సరాల క్రితమే టీటీడీ చైర్మన్ అయిన వ్యక్తినని, ఇప్పుడు 8 కోట్లమంది వీక్షిస్తోన్న ఎస్వీబీసీ చానెల్ తన బుర్రలో పుట్టిన ఆలోచన అని, శ్రీవారి దయతో మతాంతీకరణలు ఆపడానికి 32 వేలమంది సామాన్యులకు కళ్యాణమస్తు ద్వారా పెళ్ళిళ్ళు చేయించిన ఆలోచన తనదేనన్నారు. తన సోదరుడు భూమన సుబ్రమణ్యం (భూమన్) పుట్టినరోజు సందర్భంగా తిరుపతి మానవ వికాస వేదిక ప్రచురించిన ‘మూడు తరాల మనిషి భూమన్’ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న కరుణాకర్ రెడ్డి భావోద్వేగంతో మాట్లాడారు.
వేద విశ్వ విద్యాలయాన్ని స్థాపించడంలో అత్యంత కీలకపాత్ర పోషించానని, తిరుమల ఆలయ నాలుగుమాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగకూడదనే నిర్ణయం తీసుకుంది… అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు చేసిందీ…. దళితవాడలకు శ్రీవెంకటేశ్వర స్వామిని తీసుకుని వెళ్ళి కళ్యాణం చేయించింది… తానేనని, క్రిస్టియన్ అని నాస్తికుడనని ఆరోపణలు చేస్తున్న వారికి ఇదే తన సమాధానమని స్పష్టం చేశారు.
వివాదాలకు భయపడి రాజకీయాల్లో కొనసాగే వ్యక్తిని తాను కాదని, ఈ విషయం తనను విమర్శించే వారికి కూడా తెలుసనీ, విప్లవ రాజకీయాల నుంచి ఉద్భవించిన వాళ్ళమని, పోరాటాల నుండి పైకి వచ్చిన వాడినని విమర్శలకు భయపడి మంచి పనులు చేయడం ఆపబోనని తేల్చి చెప్పారు.