Nara Lokesh Election Campaign In Kuppam Municipality :
కుప్పం గడ్డ చంద్రబాబు అడ్డా అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో లోకేష్ పాల్గొన్నారు. కుప్పంలో జరిగిన అభివృద్ధి అంతా బాబు చలవేనని అన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్టు పనులు 90 శాతం తాము పూర్తిచేశామని, ఈ ప్రభుత్వం మిగిలిన 10 శాతం కూడా పూర్తి చేయలేక పోయిందని విమర్శించారు. బాబు సిఎంగా ఉండగా కుప్పం కంటే ముందు పులివెందులకు నీరు ఇచ్చారని, కానీ వైసీపీ ఏనాడైనా కుప్పం అభివృద్ధిపై ఆలోచించిందా అని లోకేష్ ప్రశ్నించారు. వైసీపీ నేతలు కేవలం ఎన్నికల కోసమే కుప్పం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రశాంతంగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో అలజడి సృష్టిస్తున్నారని, పరిసర నియోజకవర్గాల నుంచి రౌడీలు, గుండాలు దిగారని ఆరోపించారు. కొందరు అధికారులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, వారు తమ పధ్ధతి మార్చుకోకపోతే తాము అధికారంలోకి వచ్చిన తరువాత వారి సంగతి చెబుతామని హెచ్చరించారు. భయపెట్టడం, బెదిరించడం అనేది వైసీపీ అనుసరిస్తున్న రాజకీయమని, కుప్పంలో ఇలాంటి రాజకీయాలు చెల్లబోవని ధీమా వ్యక్తం చేశారు. తాను ఇంతవరకూ పోలీస్ స్టేషన్ కు వెళ్లలేదని కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత తనపై 11 కేసులు పెట్టిందన్నారు.
జగన్ ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లుగా ప్రజలపై పన్నుల భారం పెంచుకుంటూ పోవడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని లోకేష్ విమర్శించారు. జగన్ మాయమాటలు నమ్మొద్దని, కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Also Read : ఎయిడెడ్ ఉద్యమం అన్ స్టాపబుల్: లోకేష్