Friday, March 29, 2024
HomeTrending Newsప్రభుత్వం అంటే భయమా? కేశవ్

ప్రభుత్వం అంటే భయమా? కేశవ్

Keshav on APERC :

ప్రభుత్వం నుంచి బాకీలు వసూలు చేసుకోవడంలో విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. విద్యుత్ రంగ సంస్థలను సక్రమంగా నిర్వహించాల్సిన ఈఆర్సీ తన బాధ్యతను విస్మరించిందని విమర్శించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీలను ప్రజల నెత్తిన రుద్దేలా మూడు నెలల నుంచి ట్రూ అప్ ఛార్జీలు విధించారని, చివరకు హైకోర్టు జోక్యంతో వాటిని ఉపసంహరించుకున్నారని కేశవ్ గుర్తు చేశారు.

విద్యుత్ చట్టం ప్రకారం ఈఆర్సీకి విశేష అధికారాలుంటాయని, అలాంటిది ప్రభుత్వానికి ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. విద్యుత్ రంగం సంక్షోభంలో ఉంటే అదానీ కంపెనీలతో వేల కోట్ల రూపాయలతో ఒప్పందాలు ఎలా కుదుర్చుకుంటారని, దీనికి ఈఆర్సీ ఎలా అనుమతిస్తుందని కేశవ్ నిలదీశారు. ప్రభుత్వం చేసుకుంటున్న చీకటి ఒప్పందాలకు ఈఆర్సీ అడ్డుకట్ట వేయాలని, కమిషన్ దీనిలో భాగస్వామ్యం కాకూడదని హితవు పలికారు.

కాగా, విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం)కు రావాల్సిన 25,257 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ శాఖల నుంచి రూ.9,783 కోట్లు, విద్యుత్ సబ్సిడీ కింద మరో 15,474 కోట్ల రూపాయలు కూడా రావాల్సి ఉందని,  వీటిని వెంటనే విడుదల చేయాలని కోరింది. ప్రభుత్వ బకాయిలు పేరుకు పోవడంతో డిస్కంల మనుగడ ప్రమాదంలో పడిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే బాకీలు చెల్లించాలని లేఖలో పేర్కొంది. 14 రోజుల్లోగా స్పందన రాకపోతే విద్యుత్ సరఫరా నిలిపి వేస్తామని హెచ్చరించింది. ఈనెల9న పయ్యావుల ఈఆర్సీ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి, ట్రూ అప్ ఛార్జీలు తదితర అంశాలపై చర్చించారు. ఈ భేటీ తర్వాత ఈఆర్సీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈఆర్సీ నుంచి రాష్ట్ర ఇంధన శాఖా కార్యదర్శికి రాసిన లేఖను పయ్యావుల స్వయంగా బైటపెట్టడం గమనార్హం.

Also Read :  అదానీ కోసమే: సోలార్ విద్యుత్ పై కేశవ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్