Lokesh on Polavaram: పోలవరం నిర్వాసితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం వారికి రావాల్సిన పరిహారాన్నివెంటనే అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లోకేష్ లేఖ రాశారు. నాలుగు వారాలుగా నిర్వాసితులు దీక్షలు చేస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు వచ్చి సమస్యలను సిఎం దృష్టికి తీసుకు వెళతామని హామీ ఇచ్చి దీక్షను విరమింపజేశారని కానీ ఇంతవరకూ ఆ సమస్య పరిష్కారం కాలేదని లోకేష్ లేఖలో వివరించారు. పోలవరం ఏటిగట్టు సెంటర్ లో నిర్వాసితుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రోజుకు ఒక్కో గ్రామం నుంచి 30 మంది వచ్చి దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందన లేదని అయన ఆవేదన వ్యక్తం చేశారు.
- అందరికీ చట్టప్రకారం పునరావాసం కల్పించాలి.
- ఆర్&ఆర్ ప్యాకేజీ అందరికీ ఇవ్వాలి.
- జగన్ పాదయాత్రలో ప్రకటించిన 10 రూపాయల లక్షల ప్యాకేజీ అందించా
- 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలి
- 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ప్యాకేజీ వర్తింపజేయాలి
- నిర్వాసితులకు కేటాయించిన కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి
- గ్రామాలను ఖాళీ చేయించిన తేదీనే కటాఫ్ తేదీగా పరిగణించాలి
అంటూ లేఖలో సిఎం జగన్ ను లోకేష్ డిమాండ్ చేశారు.
నాడు ప్రతిపక్షనేతగా వున్నప్పుడు నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత నేడు సిఎం స్థానంలో ఉన్న జగన్ పై ఉందని లోకేష్ స్పష్టం చేశారు. నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు తమ సర్వస్వం ధారపోసిన నిర్వాసితుల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని, వారితో దీక్షలు విరమింపజేసేలా చూడాలని కోరారు.
Also Read : ఎక్కడున్నా వదిలిపెట్టను: లోకేష్ హెచ్చరిక