Monday, November 25, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనేనంటే ఇది : నెమలి

నేనంటే ఇది : నెమలి

1963 నుంచి నన్నొక జాతీయపక్షిగా భారతదేశం పరిగణిస్తున్నందుకు సంతోషం. నా గురించి మీ చిన్నతనంలో పాఠ్యపుస్తకాలలో చదివి ఉండొచ్చు. నన్నొక ఆకర్షణీయ పక్షిగా చెప్పుకుంటున్నారు కదూ. అయినప్పటికీ నాకు సంబంధించిన కొన్ని విషయాలు మీకు చెప్పుకోవాలనిపించింది నెమలికి. సరే దాని మాటల్లోనే విందాం మరి…..

నా జీవితకాలం ఇరవై ఏళ్ళు. కానీ ఉద్యానవనాలు, జనసంచారం నిషేధించిన చోట్ల నలబై ఏళ్ళ వరకూ బతుకుతుంటాం మరి. నన్ను జాతీయపక్షిగా పాలకులెప్పుడో అధికారికంగా ప్రకటించినప్పటికీ కొందరు మమ్మల్ని వేటాడి చంపెస్తున్నారు. అటువంటి వేటగాళ్ళ కంటికి కనిపించకుండా తప్పించుకోవడానికి మా వంతు ప్రయత్నం చేసినా దొరికిపోతుంటాం మేము.

మా కాలి వేళ్ళ మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ మేము ఈత కొట్టం. నేల మీద నడవటానికీ చెట్ల కొమ్మలను పట్టుకోవడానికీ మా కాలి వేళ్ళ నిర్మాణం ఉపయోగపడతాయి. మా జాతిలో మగ నెమళ్ళకు అందమైన పురి ఉన్నాసరే ఈత కొట్టవు. మాలో మగవాటినే మీ మనుషులు ఎక్కువగా చూసి ఆనందిస్తుంటారుగా. మాలో ఆడ నెమళ్ళకు పురి ఉండదు.

ప్రపంచంలో పలు రకాల నెమళ్ళున్నాయని మీకు తెలిసిందిగా! కానీ అవేవీ మీ భారతదేశంలో ఉన్న అందమైన నెమళ్ళ సాటిరావు. చూడటానికి మాలో ఆడ నెమళ్ళే అందమైనవైనా కవులెందుకో మగవాటినే వర్ణిస్తుంటారు. ఇందువల్లే ఆడనెమళ్ళకు అప్పుడప్పుడూ కోపం వస్తుంటుంది మరి. మమ్మల్ని మీరెలా చూస్తేనేం, పరమేశ్వరుడి కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి మా మగనెమళ్ళనే తన వాహనంగా చేసుకున్నందుకు మాకానందమే. అలాగే చదువుల తల్లి సరస్వతీదేవికీ నెమలి అంటే ప్రియం కదా! ఇంకో విషయం చెప్తున్నా వినండి….గ్రీకు దేశస్తులూ మమ్మల్ని ఆరాధిస్తారు.

మీలో కొందరైనా తెల్ల నెమళ్ళను చూసే ఉంటారుగా. ఇదంతా మీ మనుషులు చేసిన ప్రయోగాలతో జరిగిందే.

మా వంశాభివృద్ధి గురించీ, గుడ్లు పెట్టడం గురించీ మనిషి కొన్ని కట్టుకథలు పుట్టించాడుగా. కానీ నిజమైతే ఇదే….మాలో ఆడవాటిని ఆకర్షించడం కోసం మగవి పురి విప్పి నాట్యమాడుతాయి. అది చూసి ఆకర్షితులయ్యే ఆడవి మగవాటితో కలుస్తాయి. అలా కలిసిన ఆడవి మూడు నుంచి ఆరు గుడ్లు పెడతాయి. వాటినీ పొదిగి పిల్లలై ఎదిగేవరకూ తల్లి నెమళ్ళు కంటికి రెప్పలా చూసుకుంటాయి. మేము ఒక్క తోడుతోనే బతకం. కలియడంకోసం వేర్వేరు నెమళ్ళు ఒకటవుతుంటాయి.

మేము రకరకాల శబ్దాలు పుట్టిస్తాం. అవి పదకొండు రకాలు. ఆ శబ్దాలు మనుషులకు అంతగా గిట్టవని తెలుసు. కానీ ఏం చేయగలం. మాకు సృష్టికర్త అటువంటి శబ్దాలిచ్చాడు. వర్ష రాకను మాత్రం నెమళ్ళన్నీ ఒకేలాంటి శబ్దం ఆ శబ్దాన్ని తమిళంలో అగవుదల్ అంటారు. మరి తెలుగులో ఏమంటారో మీరే తెలుసుకోండి.

మేము శాంతస్వరూపులమే. మనుషులకు అతి సులభంగా చేరువవుతాం. ఏ మనిషైతే ఆదరిస్తాడో అతనితో చేరువవుతాం. కొత్తవారికి దగ్గరవడానికి ఆలోచిస్తాం.

మమ్మల్ని మీరు ఇళ్ళల్లో పెంచుకోలేరు. ఎందుకో చెప్పమంటారా? 1972లో వన్యప్రాణి రక్షణ చట్టాన్ని మీ పాలకులు అమలులోకి తీసుకొచ్చారు. ఈ చట్టంవల్ల మీరు మమ్మల్ని ఇళ్ళల్లో పెంచుకోలేరు. అయితే ఆలయాలలో పెంచబడే నెమళ్ళు పాములను చూస్తే వాటిని తరిమికొడతాయి.

అడవులలో, పంట పొలాల్లో కొన్ని సమయాల్లో మాకు పాములు కన్పిస్తుంటాయి. విషసర్పాలైనా సరే వాటితో తలపడితే గెలుపు మాదేసుమీ. మేము వాటిని ఆరగిస్తాంకూడా.

మాలో మగనెమళ్ళకు పొడవాటి ఈకలున్నా ఎక్కువ దూరం ఎగరలేవు. అవి కొంత దూరమే ఎగరుతాయి. అదీనూ తమను రక్షించుకోవలసిన సమయాలలో ఎగురుతాయి.

మా ఆహార విషయానికొస్తున్నా. విత్తనాలు, పువ్వులు, చీమలు, ధాన్యాలు, చిన్న చిన్న పాములు, కప్పలు, సీతాకోకచిలుకలు, ఎలుకలను తింటాం.

మరీ దట్టమైన అడవుల్లో మేము నివసించం. తక్కువ సంఖ్యలో ఉండే చెట్లల్లో నివసిస్తాం. అక్కడ ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతాం. పంట పొలాలు కనిపిస్తే ఆహారం కోసు వాలుతాం.

భారతదేశంలోనూ, బర్మాలోనూ, శ్రీలంకలోనూ మమ్మల్ని ఎక్కువగా చూడొచ్చు. ఈ దేశాల్లో మా సంతతి అధికమే. దేవభాష సంస్కృతంలో మమ్మల్ని మయూరం అని, మీ తెలుగోళ్ళేమో నెమలి అని, తమిళులేమో మయిల్ అని, ఇంగ్లీషులో పీకాక్ ఇలా ఒక్కో భాషలో ఒక్కోలా మమ్మల్ని పిలుస్తుంటారు.

భారతదేశంలో మా నెమళ్ళు దాదాపు రెండు వందల రకాలదాకా ఉన్నాయి. భారతదేశంలోని పక్షి జాతిలో మాకున్న అందం మీ అందరికీ తెలిసిందేగా. అంతేకాదు, భారతదేశంలో మాకున్న చరిత్ర దీర్ఘమైనది. మీ రుగ్వేదంలో మా ప్రస్తావన ఉంది. మాకు కృష్ణుడంటే మరీ మరీ ఇష్టం. ఎందుకంటే మా ఫించాన్ని కృష్ణుడు తన శిరస్సులో ఉంచుకుంటాడు కనుక. అలాగే బౌద్ధ మతంలోనూ మమ్మల్ని తెలివైన వాటిగా అభివర్ణించారు. మా ఈకలను ఓ అందమైన అలంకార ప్రధానంగా మనిషిజాతి చూడటం మాకానందమే. ఒక్కో పురిలో రెండు వందలదాకా ఈకలుంటాయి.

గ్రీకు వీరుడు అలెగ్జాండర్ మమ్మల్ని భారతదేశం నుంచు తమ దేశానికి తీసుకుపోయాడు. అక్కడి నుంచీ మరి కొన్ని దేశాలకు మా సంతతి విస్తరించింది.

భారతదేశం, శ్రీలంకల నుంచి మా నెమలి ఫించాలను అరేబియాకి ఎగుమతి చేస్తుంటారు.

జాతీయ పక్షిగా మీ భారత ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తుంచుకుని మమ్మల్ని వేటాడక పరిరక్షించుకోవలసిన బాధ్యత మీది. మరి మమ్మల్ని జాగర్తగా చూసుకుంటారుగా. నా మాట వింటారనే నమ్మకం నాకైతే ఉంది. ఆపై మీ ఇష్టం.

– యామిజాల జగదీశ్

Also Read: చిత్రకారుడు కావాలనుకున్న హిట్లర్

Also Read: నేను బతికే వున్నా

RELATED ARTICLES

Most Popular

న్యూస్