Friday, November 22, 2024
HomeTrending Newsపాకిస్తాన్ లో పెచ్చరిల్లిన హింస.. ఎన్నికలకు భారీ భద్రత

పాకిస్తాన్ లో పెచ్చరిల్లిన హింస.. ఎన్నికలకు భారీ భద్రత

రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్థాన్‌లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. రెండు పేలుళ్ళలో సుమారు 26 మంది చనిపోయారు. అనేక మందికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రులకు తరలించారు. ఇప్పటివరకు రెండు శక్తివంతమైన బాంబు పేలుళ్లు జరిగినట్లు పాక్ మీడియా వెల్లడించింది. పాక్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అస్ఫంద్యార్ ఖాన్ కాకర్ నివసించే పిషిన్ జిల్లాలో జరిగిన మొదటి పేలుడులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 30 మందికి తీవ్రగాయాలు అయినట్లు తెలిసింది.

ఈ పేలుడు జరిగిన అరగంట లోపే మరో బాంబు పేలినట్లు అధికారులు వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దుకు సమీపంలోని ఖిల్లా సైఫుల్లా పట్టణంలో రెండవ దాడి జరిగింది. జమాయతే ఉలేమా ఇస్లాం పాకిస్థాన్ ఎన్నికల కార్యాలయం బయట బాంబు పేలింది. ఈ ఘటనలో 9 మంది చనిపోగా.. మరో 12 మంది గాయపడినట్లు తెలిపారు.

దాడుల వెనుక ఎవరున్నారన్నది స్పష్టం కాలేదు. ఇస్లామిక్ ఉగ్రవాదులు, బబూచిస్థాన్‌ వేర్పాటు వాదులు ఈ పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రచారం అంతా ముగిసిపోయిన సమయంలో ఉన్నట్టుండి బాంబు పేలుళ్లు అలజడి రేపాయి. ఎన్నికలు జరిగే సమయంలో ఇమ్రాన్ ఖాన్ అనుచరులు ఆందోళనలు చేపట్టే ప్రమాదముందని పోలీసులు ముందుగానే జాగ్రత్తపడుతున్నారు. వీలైనంత వరకూ ఓటింగ్ శాతాన్ని పెంచాలని చూస్తున్నారు.

రాబోయే ఎన్నికల్లో నవాజ్‌ షరీఫ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని పాక్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండటం..ఆయనకు పోటీ చేసేందుకు న్యాయస్థానం అవకాశం ఇవ్వలేదు. పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (PTI) తరపున పోటీ చేస్తున్న అనేక మంది కీలక నేతలు… కేసులు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఎన్నికలకు అనర్హులు అయ్యారు.

దివంగత నేత బెనజీర్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సింద్ ప్రాంతానికే పరిమితం అయింది. బిలావల్ భుట్టో జాతీయ స్థాయిలో ప్రభావం చుపలేకపోతున్నారు. వయోభారం దృష్ట్యా తండ్రి ఆసిఫ్ అలీ జర్దారి ప్రచారంలో చురుకుగా పాల్గొనలేకపోతున్నారు.

విపక్ష పార్టీలు నామమాత్రం కావటం…మిలిటరీ ఆశిస్సులు నవాజ్ షరీఫ్ కు ఉండటంతో ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అని తేలిపోయింది. నవాజ్ షరీఫ్ ప్రభుత్వం అయినా పూర్తి స్థాయి పదవీ కాలం ఉండి… సుస్థిరమైన పాలన అందిస్తుందా  అనేది మిలిటరీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది.

పాకిస్థాన్‌లో గురువారం జాతీయ ఎన్నికలు జరుగనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలైన బలూచిస్తాన్, ఖైభార్ పఖ్తుంఖ్వా రాష్ట్రాల్లో మరిన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే ముప్పు ఉందని వార్తలు వస్తున్నాయి. పేలుళ్ల నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్