నమీబియా సూపర్ -12 ఆశలపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టు నీళ్ళు జల్లినది. టి 20వరల్డ్ కప్ లోగ్రూప్ ‘ఏ’ చివరి లీగ్ మ్యాచ్ లో మిరేట్స్ 7 పరుగులతో విజయం సాధించింది. దీనితో నమీబియా టోర్నీ నుంచి నిష్క్రమించగా నెదర్లాండ్స్ సూపర్ 12 కు చేరుకుంది.
ఎమిరేట్స్ విధించిన 149 పరుగుల విజయ లక్ష్యం కోసం బరిలోకి దిగిన నమీబియా 69 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయినా డేవిడ్ వీస్, రుబెన్ తో కలిసి ఎనిమిదో వికెట్ కు 70 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి విజయం కోసం చివరి వరకూ పోరాటం చేశారు. కానీ చివరి ఓవర్లో వీస్ ఔట్ కావడంతో నమీబియాకు ఓటమి తప్పలేదు.
జీలాంగ్ లోని సైమండ్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఎమిరేట్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముహమ్మద్ వసీమ్-50; రిజ్వాన్-43; బసీద్ హమీద్-25; అరవింద్-21 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లలో వీస్, స్కాల్జ్, బెన్ షికొంగో తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఎమిరేట్స్ బౌలింగ్ దెబ్బకు నమీబియా వరుస వికెట్లు సమర్పించుకుంది. డేవిడ్ వీస్ 36 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 55; రుబెన్ 25 (నాటౌట్) పరుగులతో రాణించారు.
ఎమిరేట్స్ బౌలర్లలో బాసిల్ అహ్మద్, జహోర్ ఖాన్ చెరో రెండు; జునైద్ సిద్దిఖి, మేయప్పన్, ముహమ్మద్ వసీమ్ తలా ఒక వికెట్ సాధించారు.
వసీమ్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : T20 World Cup 2022: సూపర్ 12కు శ్రీలంక