Sunday, May 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమారింది సంవత్సరం నంబరొక్కటే

మారింది సంవత్సరం నంబరొక్కటే

New Year, matter of number change: ఇదివరకు పెద్దబాలశిక్ష చదివే రోజుల్లో ప్రభవ, విభవ, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగీరస . . . అని ఎలిమెంటరీ స్కూలు పిల్లలకు మన సంప్రదాయ క్యాలెండర్ 60 సంవత్సరాల పేర్లు, రాశులు, నక్షత్రాల పేర్లు నోటికి నేర్పేవారు. నెమ్మదిగా ఇంగ్లీషు క్యాలెండరు ముందుకొచ్చి ఉగాది పంచాంగం వెనక్కు వెళ్ళింది కాబట్టి ప్రభవ ప్రాభవం కోల్పోయింది. విభవ విసిగిపోయింది. ప్రమోదూత ప్రమాదంలో చిక్కుకుంది. అశ్విని భరణి కృత్తిక కుత్తుక తెగింది. మేష వృషభ మిథున రాశుల వాసి తగ్గింది. శాలివాహన శకాలకు ఏ సీ- బీ సీ కరెంటు షాకులు తగిలాయి. చైత్ర వైశాఖ జ్యేష్ఠాలు శ్రేష్ఠం కాకుండా ఎప్పుడో మూలనపడ్డాయి. జనవరి ఫిబ్రవరి అర్థమయినంతగా భాద్రపద ఆశ్వియుజాలు అర్థం కావు. శరదృతువు పలకడమే కష్టం కావడంతో- రుతువులు సమ్మర్ వింటర్ కే కుచించుకుపోయాయి. యుగధర్మం అనుకోవాలి. మార్పు సహజం అనుకుని సర్దుకుపోవడం తప్ప వీటిమీద మరీ గుండెలుబాదుకుని ప్రయోజనంలేదు. పుణ్యక్షేత్రాల్లో కూడా జనవరి ఒకటి ఇసుకవేస్తే రాలనంతగా జనం ఉంటారు. ఇందులో పెద్దగా తప్పు పట్టాల్సింది ఏమీ లేదు.

కొత్త సంవత్సరం కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త సంకల్పాలు సహజం. అయితే ఏడాది అంతా ఆ సంకల్పాలను పొదివిపట్టుకుని నడిచేవారెందరు అన్నదే ప్రశ్న. జనవరి ఒకటిన ఉత్సాహం నింపుకోవడంలో తప్పులేదు. ఆ ఉత్సాహం ఏడాది అంతా కొనసాగేలా చూసుకోవడంలోనే ఉంది సవాలు.

సంస్కృతంలో ఒక వేదాంత ధోరణి శ్లోకం. మనిషి ఆయుష్షు వందేళ్లు సంపూర్ణంగా లెక్కకట్టినా- అందులో సగం నిద్రకే పోతుంది. అంటే మిగిలింది 50 ఏళ్లు. ఈ యాభైలో 25 ఏళ్లు చదువు సంధ్యలు, ఉద్యోగ సద్యోగాలకు పోతుంది. నికరంగా మనిషి తనను తాను నిరూపించుకోవడానికి మిగిలింది 25 ఏళ్ళే.

కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో
తుమ్మెదజన్మకు నూరేళ్లు ఎందుకు?
రోజే చాలులే . . . అంటాడు వేటూరి.
సార్థకమయిన జీవితం గడపాలనుకుంటే క్షణకాలాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చట.

అంతములేని ఈ భువనమంతయు పురాతన పాంథశాల . . అంటాడు పానశాలలో దువ్వూరి రామిరెడ్డి. ఇంత పెద్ద ప్రపంచం అంతులేని కాలంలో ఒక పాత బాట అట. దీనికి పొద్దున సాయంత్రం రెండు ద్వారాలట. ఎవ్వరయినా పొద్దున ద్వారం ద్వారా లోపలికివచ్చి కాసేపు ఉండి; సాయంత్రం ద్వారంలోనుండి బయటికి వెళ్లిపోవాల్సిందే అంటాడు. కాలం ఎకాయెకి దొర్లుతునేయుండు, వెనకకు మరల్పలేము ఒక్క క్షణమయినా . . . అని జాషువా అన్నాడు.

కాలం ఎప్పటికీ మారదు. మారేది మనమే. కాలాన్ని దోషిగా, విలన్ గా చిత్రీకరించి మనమీద నేరం పడకుండా జాగ్రత్తపడ్డామని ఆనందిస్తూ ఉంటాం. మనల్ను చూసి కాలం జాలిగా నవ్వుకుంటూ ఉంటుంది.

సామజవరగమనా . . . కీర్తనలో కాలాతీత విఖ్యాత . . . అని త్యాగరాజు గొప్పమాట వాడాడు. కృష్ణుడిగా అవతరించిన రాముడిని ఆయన కాలాతీత విఖ్యాత! అని సంబోధించాడు. అంటే కాలాలకు అతీతంగా అన్నికాలాల్లో కీర్తి ప్రతిష్ఠలతో నిలబడి ఖ్యాతి పొందుతున్నవాడు అని అర్థం.

మనం కాలాతీత విఖ్యాతులు కాకపోయినా, కాలేకపోయినా- మనకాలంలో అయినా విఖ్యాతులు కావడానికి ప్రయత్నించవచ్చు. లేదా కాలగతిలో నలుగురు మనగురించి చెడ్డగా చెప్పుకోవాల్సిన అవసరంలేకుండా అతిసాధారణంగా, హాయిగా బతకవచ్చు.

“ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో?
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో?

అన్నార్థులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరమో?
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో?
పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో?
గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో?”

అన్నాడు దాశరథి. 2019 సంవత్సరం కరోనా బడబానలాన్ని దాచుకుని భూగోళం మీద పడింది. కరోనాతో పోరాటంలో కానరాని భాస్కరులెందరో? కోట్ల మంది వలస కార్మికులను నిరాశ్రయులను చేసి 2020 నిర్దయగా సొంత ఊళ్లకు తరిమేసింది. అన్నార్థులు, అనాథలుండని 2021 ని చూడాలనుకుంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పాం. గాయపడిన జగతి గుండెల్లో రాయబడని కావ్యాలన్నీ వాలిపోతున్న 2021 రేకులతో పాటు రాలి, రేకు విచ్చుకుంటున్న 2022 తో కొత్త ఆశలు తీగసాగాలని కోరుకుంటూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం.

(చివరి వాక్యంలో సంవత్సరం సంఖ్య 2020 దగ్గర 2021 అన్న మార్పు తప్ప, మిగతాదంతా అక్షరాలా గడచిన సంవత్సరం జనవరి ఒకటి నాడు రాసినది. మళ్లీ అవే భయాలు, అవే మాస్కులు, అవే ఆంక్షలు…కాబట్టి పునరపి మననం…పునరపి స్మరణం…అంతే!)

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

కాలమా! ఆగుమా!

RELATED ARTICLES

Most Popular

న్యూస్