Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

‘రైతన్న’ సినిమాను చూడాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు, హీరో ఆర్.నారాయణమూర్తి కోరారు. ఈ నెల 14న విడుదలవుతున్న ఈ సినిమాను ఆదరించాలని విజ్ఞప్తి చేహ్సారు. మంత్రుల నివాస సముదాయంలో నిరంజన్ తో నారాయణమూర్తి భేటి అయ్యారు. చిత్ర విశేషాలను ఆయనకు తెలియజేశారు, ఆ తర్వాత ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడారు.

సమాజ హితం కోసం అనేక మాద్యమాల ద్వారా పలువురు కృషి చేస్తుంటారని… సినిమా మాద్యమం ద్వారా  ప్రజల పక్షపాతి, రైతు పక్షపాతి, తెలుగు ప్రజలకు సుపరిచితుడైన నారాయణమూర్తి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి రైతన్న సినిమాను నిర్మించారని మంత్రి నిరంజన్ రెడ్డి కితాబిచ్చారు.  సినిమాలో మట్టికి, మనిషికి ఉన్న సంబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారని ప్రశంసించారు. రైతులు, ప్రజలు, మీడియాతో పాటు సమాజంలోని అందరూ ఈ సినిమాను చూడాలని మంత్రి పిలుపునిచ్చారు.

ప్రజల హితాన్ని కోరే సినిమాలు  చాలా అరుదుగా వస్తుంటాయని,  వ్యాపార విలువలే ప్రధానంగా ఉన్న పరిస్థితులలో ప్రజల కోసం, రైతుల హితం కాంక్షిస్తూ వస్తున్న ప్రభోధాత్మక సినిమా ‘రైతన్న’ అని అయన కొనియాడారు.  ప్రజా ప్రయోజనం జరిగే కృషి ఏ రంగంలో జరిగినా మనం స్వాగతించాలన్నారు.  ఒక శ్యాం బెనగల్, ఒక మృణాల్ సేన్ మాదిరిగా తెలుగులో నారాయణమూర్తి గారు సినిమాలను తీస్తున్నారన్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఇబ్బంది కలిగించేవి అయినప్పడు స్పందించాల్సిన విపక్షాలు తమ బాధ్యతను విస్మరిస్తున్నాయని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వ నిర్ణయాలు తమకు వ్యతిరేకమని ప్రజలు ఒకసారి భావిస్తే వారే విపక్షపాత్ర పోషిస్తారు. అంశాలవారీగా హేతుబద్దతతో కూడిన విమర్శలను సమాజంలో అందరూ స్వాగతించాల్సిందేనని అభిప్రాయపడ్డారు.  కానీ ప్రస్తుత రాజకీయాలలో దురదృష్టవశాత్తు విమర్శ అంటే కువిమర్శ, తిట్లు, సంస్కారహీనత, రెచ్చగొట్టడం విమర్శలుగా మారాయి .. ఈ ధోరణి మంచిది కాదని మంత్రి హితవు పలికారు.

ఈ సందర్భంగా తెలంగాణ సిఎం కెసియార్ పై నారాయణ మూర్తి ప్రసంశల జల్లు కురిపించారు.  రైతుబంధుతో కేసీఆర్ గారు దేశానికి ఆదర్శంగా, దిక్సూచిలా నిలిచారన్నారు. త 36 ఏళ్లుగా దేశంలోని సమస్యల మీద కవులు, కళాకారులు, మీడియా స్పందించినట్లు మాదిరిగా సినిమా మాద్యమం ద్వారా నేను స్పందిస్తున్నానని తెలిపారు.  అర్ధరాత్రి స్వతంత్రం నుండి అన్నదాత సుఖీభవ వరకు 36 సినిమాలు తీశానని,  ఈ నెల 14న 37వ సినిమా గా ‘రైతన్న’ విడుదలవుతుందని, అందరూ ఆదరించాలని కోరారు.

కేంద్రప్రభుత్వం తీసుకువస్తున్న నూతన వ్యవసాయ చట్టాలు, కరంటు చట్టాలు రైతులకు వరాలు కావని, శాపాలని అయన వ్యాఖ్యానించారు.  ఎనిమిది నెలలుగా కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నారని గుర్తు చేశారు. కరోనా విపత్తులో ప్రపంచం వణికిపోతుంటే ధైర్యంగా వ్యవసాయం చేసి ప్రజలకు ఆహారం అందించింది రైతాంగం అని చెప్పారు.

ఇలాంటి చట్టాలు వర్ధమాన దేశమైన భారతదేశానికి మంచివి కావని, స్వేచ్చా వాణిజ్యం పేరుతో రైతుల మెడకు ఉరి బిగించడం తగదని పేర్కొన్నారు.  బీహార్ లో మార్కెట్లు ఎత్తేస్తే గిట్టుబాటు ధర దక్కక రైతులు విలవిలలాడుతున్నారని,  బీహార్ లో ఇప్పుడు రైతులు లేరని, రైతు కూలీలే మిగిలారని…. కొత్త వ్యవసాయ చట్టాలు అమలయితే ఈ దేశంలో కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని నారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం కొత్త చట్టాలను పక్కకు పెట్టి స్వామినాధన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని అయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com