Saturday, November 23, 2024
HomeTrending Newsనీతి ఆయోగ్ భేటీ బహిష్కరణ - కెసిఆర్

నీతి ఆయోగ్ భేటీ బహిష్కరణ – కెసిఆర్

కేంద్రంలోని న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా ఆదివారం జ‌ర‌గ‌నున్న నీతి ఆయోగ్ భేటీని బ‌హిష్కరిస్తున్న‌ట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు శ‌నివారం సాయంత్రం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ నిర్ణ‌యం బాధాక‌ర‌మే అయినా కేంద్రం వైఖ‌రిని ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు తెలియ‌జెప్పేందుకు ఇదే ఉత్త‌మ మార్గ‌మ‌ని భావించామ‌ని ఆయ‌న తెలిపారు. ఇదే విష‌యాన్ని ప్ర‌ధాని మోదీకి బ‌హిరంగ లేఖ ద్వారా తెలియ‌జేశామ‌ని కూడా కేసీఆర్ చెప్పారు.

కేంద్రంపై కెసిఆర్ ఆరోపణలు ఆయన మాటల్లోనే…

కేంద్రం తీరుపై భవిష్యత్‌ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. ఇప్పుడు మాటల రూపంలో అడుగుతున్నామని, రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో కలిసి వచ్చే వారిని కలుపుకొని బలీయమైన ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని స్పష్టం చేశారు. ప్రజావ్యతిరేక విరోధంగా పోతున్నరు. ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నరు. పేదలకు, రైతులకు, కార్మికులకు, చేనేత కార్మికులకు, చివరి ఉపాధి కార్మికులకు నెత్తినోరుకొట్టే ప్రయత్నం చేస్తున్నరు. మీకు ఇష్టం లేదు ఆ పథకం నాకు తెలుసు.

పాత ప్రభుత్వాలు పెట్టినటువంటి సంక్షేమ నిర్ణయాలను, చిహ్నాలను చెరిపివేసే కుటిల ప్రయత్నం చేస్తున్నరు. ఎన్నోసార్లు వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఇదే నీతి ఆయోగ్‌లో కోరా.. బోలేడు ఉత్తరాలు రాసినం. ఆ నీతి ఆయోగ్‌ మీటింగ్‌లో వచ్చి నాలుగు నిమిషాలు మాట్లాడి.. నిరర్థకమైన సమావేశంలో పాల్గొనదలచుకోలేదు. ఇదే హాస్యాస్పదంగా జోక్‌లా మాట్లాడి.. పిచ్చిపిచ్చి మాట్లాడి.. కేసీఆర్‌ ది సొల్లుపురాణం అని తిట్టి.. పబ్బం గడుపుకుంటామంటే కాదు.. ‘ఆల్‌ దిస్‌ ఈజ్‌ బీయింగ్‌ రికార్డింగ్‌ బై మీడియా’. ఇది రికార్డుల్లో ఉంటది. ఇది పోయే యుగమా? ఇవన్నీ రికార్డుల్లో ఉంటయ్‌.
మీ నుంచి పరివర్తన ఆశిస్తున్నాం. చెప్పాలంటే ఎన్నో ఉన్నయ్‌.. ఎన్నో మాట్లాడారు డంబాచారాలు.. 2జీ స్పెక్ట్రమ్‌లో పెద్ద అన్యాయం జరిగినట్లు పెద్ద పెడబొబ్బలు పెట్టారు ఆ రోజు.. మరి ఈ రోజు 5జీ స్పెక్ట్రమ్‌ ఏం జరుగుతోంది.? ఐదులక్షల కోట్ల ఎస్టిమేట్‌ అయితే.. లక్ష కోట్లు వస్తదా? దీనిక వెనుక మతలబేంది? కుంభకోణమేంది? ఎక్కడికి పోయినాయ్‌ అంచనాలు. ఆనాడు 2జీ స్పెక్ట్రమ్‌పై చాలా పెద్దగా మాట్లాడిన్రు.. మరి ఇవాళ ఏం సమాధానం చెబుతారు? ఇతరులపై నెపం మోపడం.. బట్టగాల్చి మీద వేయడం సులభం. కానీ, దీని నుంచి మీరు తప్పించుకోగలగుతారా? అంటూ మండిపడ్డారు. కేంద్రం ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ మీటింగ్‌ను తాను బహిష్కరిస్తున్నానన్నారు.

ఎన్నో వాటిపై జీఎస్టీ విధిస్తున్నారని, చేనేత, మరమగ్గాలపై, పాలు, శ్మశాన వాటికలపై పన్ను వేస్తున్నారని, వెంటనే వాటిని ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. బీడీ కార్మికుల ఇబ్బందులకు గురవుతున్నారని, బీడీ ఇండస్ట్రీలు మూసివేతకు దగ్గరలో ఉన్నాయని మండిపడ్డారు. వారంతా ఉపాధిని కోల్పోతున్నారన్నారు. ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించాల్సిన అవసరం ఉందన్నారు. బీడీ ఇండస్ట్రీపై 28శాతం విధిస్తున్నారని, వారంతా ఉపాధికి దూరమవుతున్నారన్నారు. రైతులు సంతోషంగా లేరని, ప్రజలంతా అయోమయంలో ఉన్నారని, కేంద్రం ధరలను నియంత్రించడం లేదని, ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరిందని, నీరుద్యోగ రేటు 8.1శాతానికి చేరిందని విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్