Monday, January 20, 2025
Homeసినిమాఅజరామర కీర్తి సంపన్నుడు...

అజరామర కీర్తి సంపన్నుడు…

NTR-The Legend: జీవితంలో తాము దేనికి పనికి వస్తామనేది తెలుసు కోవడం ఒక కళ. అలా తెలుసుకున్న తరువాత ఆ దిశగా అహర్నిశలు కృషి చేయడం వల్లనే విజయం వరిస్తుంది .. అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుంది. అలా నటన పట్ల ఆసక్తిని పెంచుకుని .. సినిమాలలోకి వెళితే రాణిస్తానని భావించి .. ఆ దిశగా అలుపెరగని ప్రయాణాన్ని కొనసాగించిన కథానాయకుడిగా ఎన్టీఆర్ కనిపిస్తారు. ఆశయాన్ని సాధించాలనే తపన .. అందుకోసం సాగించే తపస్సు…. ఈ రెండే ఎన్టీఆర్ ను తాను అనుకున్న గమ్యానికి చేర్చాయని చెప్పవచ్చు.

సాధారణంగా సినిమాల పట్ల ఆసక్తి .. తెరపై కనిపించాలనే ఉత్సాహం అందరికీ ఉంటాయి. కానీ కొంతమందికి అందమైన రూపం ఉంటే .. అందుకు తగిన అభినయం ఉండదు. ఒకవేళ ఆ రెండూ ఉంటే వాయిస్ ఉండదు. వాయిస్ బాగానే ఉందనుకుంటే, డైలాగ్ ను ఎలా చెప్పాలో తెలియకపోయినా కష్టమే. ఇలా ఏదో ఒక చోటున .. ఎక్కడో ఒక లోపంతో ఆగిపోయేవారే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి లోపాలు మచ్చుకు కూడా కనిపించని మహా అందగాడు ఎన్టీఆర్. ఏ భాషకి సంబంధించిన సినిమాలలోను అలాంటి రూపం కనిపించదు .. అలాంటి వాయిస్ వినిపించదు.

అప్పట్లో తెలుగు సినిమాకి కావలసిన నటీనటులను నాటకరంగమే ఇచ్చింది. నాటకాలలో మంచి అనుభవం సంపాదించినవారు, ఆ తరువాత తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మద్రాసు బాట పట్టేవారు. ఆ బాటలో అడుగులు వేసినవారే ఎన్టీఆర్. కృష్ణా జిల్లా ‘నిమ్మకూరు’లో జన్మించిన ఆయన, విజయవాడ .. గుంటూరులలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఆ సమయంలోనే ఆయన నాటకాలపై ఆసక్తిని పెంచుకున్నారు. చదువు పూర్తయిన తరువాత సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం వచ్చినప్పటికీ, నాలుగు గోడల మధ్య ఇమడలేక మద్రాసుకు చేరుకున్నారు.

మద్రాసు చేరుకున్న ఆయన అక్కడి స్టూడియోల చుట్టూ ఒక రౌండ్ వేశారు. సినిమాలు వాటిలోనే తయారై బయటికి వస్తాయనే విషయం ఆయనకి అర్థమైంది. తెచ్చుకున్న డబ్బులు పొదుపుగా ఖర్చు పెట్టుకుంటూ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. దర్శకుడు బీఏ సుబ్బారావు తన ‘పల్లెటూరి పిల్ల’ సినిమాలో హీరోగా ఆయనకి అవకాశం ఇచ్చారు. అయితే ఆ సినిమా మొదలుకావడానికి ఇంకా సమయం ఉండటంతో, ఎల్వీ ప్రసాద్ గారు రూపొందిస్తున ‘మనదేశం’ సినిమాలో ఒక చిన్న పాత్రను పోషించారు. అలా 1949లో తొలిసారిగా ఆయన తెరపై కనిపించారు.

Ntrs Devotional Characters

ఆరంభంలో ఎన్టీఆర్ ఓ మాదిరి పర్సనాలిటీతోనే కనిపించేవారు. అయితే ఆయన కనుముక్కుతీరు ఎంతో అందంగా ఉండేది. ఆ కళ్లలో ఏదో మెరుపు .. ఆ వాయిస్ లో ఏదో ఆకర్షణ ఉండేవి. అందువలన ఇక ఆయనను వెతుక్కుంటూ అవకాశాలు రావడం మొదలైంది. ‘పాతాళభైరవి’ .. ‘మల్లీశ్వరి’ .. పెళ్లిచేసి చూడు’ సినిమాలు ఎన్టీఆర్ ను ఎక్కడికో తీసుకునివెళ్లాయి. ఒక వైపున సినిమాలు చేస్తూనే ఎన్టీఆర్ తన హైటుకు తగిన విధంగా బరువు పెరిగారు. అనునిత్యం వ్యాయామం చేస్తూ, ఆయన తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వెళ్లారు.

అందువలన ఆయన సాంఘికాలు .. జానపదాలు .. పౌరాణికాలు .. చారిత్రకాలు .. ఇలా ఏ జోనర్లో .. ఏ పాత్రను వేసినా ఎన్టీఆర్ కి ఎదురుండేది కాదు. ముఖ్యంగా పౌరాణికాలలో ఆయన విశ్వరూప విన్యాసం చేశారు. తెరపై రాముడిగా .. కృష్ణుడిగా .. శివుడిగా .. విష్ణుమూర్తిగా .. వేంకటేశ్వరస్వామిగా ఆయనను చూసిన ప్రేక్షకులంతా, ఆయన భక్తులుగా మారకుండా ఉండలేకపోయారు. ఆ పాత్రలను ఆయన ఎంతో నియమనిష్ఠలను పాటిస్తూ పోషించడం మరింత విశేషం. రావణుడు .. దుర్యోధనుడు .. కర్ణుడు వంటి ప్రతినాయక పాత్రలతోను ఒప్పించిన .. మెప్పించిన ఘనత ఆయన సొంతం. 

సాంఘికాల్లో మిస్సమ్మ .. గుండమ్మకథ .. గుడిగంటలు, జానపదాల్లో జగదేకవీరుని కథ .. గులేబకావలి కథ .. రాజమకుటం, పౌరాణికాలలో భూకైలాస్ .. మయా బజార్ .. శ్రీకృష్ణార్జున యుద్ధం .. లవకుశ .. దానవీరశూరకర్ణ .. ఇలా ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు ఆయన కెరియర్లో పరిమళిస్తూ కనిపిస్తాయి .. పరవశింపజేస్తాయి. ఒక్క పుటలోనో .. ఒక్క  పూటలోనో ఆ సినిమాలను గురించి చెప్పుకోలేం. ఆయన పౌరాణికాలలో ఒక్కో పాత్రపై ఒక మహా గ్రంథమే రాయవచ్చు. ఇక ఆ తరువాత కాలానికి అనుగుణంగా ఆయన అడవిరాముడు .. యమగోల .. కొండవీటి సింహం .. బొబ్బిలి పులి వంటి సినిమాలతో కొత్త ట్రెండును సెట్ చేశారు.

ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా సమయాన్ని వృథా చేసేవారు కాదు. ఏదో ఒక సినిమాకి సంబంధించిన పనులతోనే ఆయన ఉండేవారు. ఒక వైపున ఇతర సినిమాలను చేస్తూనే తన సొంత బ్యానర్లో సినిమాలను నిర్మిస్తూ ఉండేవారు. తానే దర్శకత్వం వహిస్తూ ఉండేవారు. దర్శకత్వం విషయంలో ఆయన కేవీ రెడ్డిని అనుసరిస్తూ ఉండేవారు. నటుడిగా .. దర్శక నిర్మాతగా కూడా ఆయన సక్సెస్ అయ్యారు. సినిమాలు చేస్తూనే రాజకీయాలలోకి ప్రవేశించి అక్కడ కూడా తన ప్రతిభను .. ప్రత్యేకతను చాటుకున్నారు. పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులను ఆయన అందుకున్నారు. తెలుగు సినిమా ఉన్నంత కాలం రాముడిగా .. కృష్ణుడిగా ఆయన ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ ఉంటారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఈ రోజున ఆయన వర్ధంతి .. ఈ సందర్భంగా మనసారా ఓ సారి ఆయనను స్మరించుకుందాం.

(ఎన్టీఆర్ వర్ధంతి ప్రత్యేకం)

— పెద్దింటి గోపీకృష్ణ

Also Read : తెలుగు సినిమా సమున్నత శిఖరం ఎల్వీ ప్రసాద్

RELATED ARTICLES

Most Popular

న్యూస్