Sunday, March 3, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమి లార్డ్, యువరానర్ అనక్కర్లేదు

మి లార్డ్, యువరానర్ అనక్కర్లేదు

Only Sir, No My lord: సాధారణంగా ప్రపంచంలో డాక్టర్ అన్న మాట వైద్య విద్య చదివి, పాసయి, వైద్యం ప్రాక్టీస్ చేసే వారికి; పి హెచ్ డి పూర్తి చేసి ఆ పట్టా పొందినవారికి వర్తిస్తుంది. కానీ ప్రపంచంలో దిక్కూ దివాణం లేని ఎన్నో యూనివర్సిటీలు కొందరి అలవిమాలిన సేవలను గుర్తించి డాక్టరేట్లను ఇవ్వడానికే పుట్టి ఉంటాయి. ఆ యూనివర్సిటీలు ఇచ్చిన డాక్టరేట్లను కూడా కొందరు ఇంటిపేరు ముందు శిలాక్షరాలతో చెక్కుకుని డాక్టర్ అని రాయకపోయినా, సభల్లో సంబోధించకపోయినా బదులు పలకనే పలకరు. అది వారి జన్మ హక్కుగానో, జన్యు లోపంగానో మారిపోతుంది. వైద్యం చేసే డాక్టర్లే డాక్టర్లు, పి హెచ్ డి చేసినవారే డాక్టర్లు అన్న ధోరణిలో సంకుచితత్వం ఉన్నట్లుంది. డాక్టర్ బిరుదునామం ఇంకా చాలా డెమొక్రటైజ్ కావాల్సి ఉంది. సొంత వైద్యం నేరం. ఇతరులకు వైద్యం చేయాల్సి వచ్చినప్పుడు లోకంలో అందరూ డాక్టర్లే. ఆ కోణంలో డాక్టర్ బిరుదు నామం కూడా అందరూ వాడుకోదగ్గదే.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాలు కూడా మన ఇంటిపేరు ముందు పద్మాలుగా సువర్ణాక్షర లిఖితమైపోతాయి. పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ గౌరవ పురస్కారాలే కానీ…బిరుదులు కానే కావు. వాటిని సాహితీ సమరాంగణ సార్వభౌమ లాంటి బిరుదులుగా ఇంటిపేరు ముందు అధికారికంగా కానీ, అనధికారికంగా కానీ వాడకూడదు అని విధి విధానాల్లో స్పష్టంగా ఉంటుంది. వాటిని గౌరవించేదెవరు? గౌరవించకపోతే పద్మాలను వెనక్కు తీసుకున్నదెప్పుడు?

సంస్కృతంతో కొద్ది పాటి పరిచయమున్నా “గ్రహీత” అన్న మాట వ్యుత్పత్తి, దాని అసలు అర్థం తెలిసిపోతుంది. గ్రహించినవారు, లాక్కున్న వారు, తీసుకున్నవారు అని దాని అర్థం. పద్మశ్రీ అవార్డు గ్రహీత, జ్ఞాన పీఠం అవార్డు గ్రహీత అంటే ఒకరు ఇస్తే తీసుకున్నవారు అనే ఆ క్రియాపదం చెబుతోంది. చాలా అవార్డులను లాక్కోవాలి. వల వేసి పట్టుకోవాలి. ప్రాధేయపడి తీసుకోవాలి. పైరవీలు చేసుకుని ఒడిసి పట్టుకోవాలి. ఖర్చు పెట్టి కొనుక్కోవాలి. ఇంకా సభా మర్యాద దృష్ట్యా బహిరంగంగా చెప్పడానికి వీల్లేని ఇతరేతర పనులు చేసి అవార్డులను గ్రహించాలి. అవార్డుల ప్రదానాలు, సన్మానాలు ఇప్పుడొక ప్రామిసింగ్ బిజినెస్. బాగా ప్రొఫెషనల్ గా ఎదిగిన గౌరవనీయ వ్యాపారం. కొందరు పుట్టు కళాబంధులు, కళామతల్లులు, కళారాధకులు, సేవా బంధులుగా పుడతారు. ఇలాంటి వారి జన్మదినం లోకానికి జన్మదినమవుతుంది. ఆ సందర్భంగా వారు ఎందరినో డాక్టర్లుగా చేసి లోకాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. అదొక అవ్యాజమయిన ఉచిత ప్రాథమిక నిర్బంధ కళారాధన!

ఇలా నానా రకాలుగా గ్రహించిన బిరుదు నామాలతో పిలవకపోతే ఈ అవార్డు గ్రహీతలకు చాలా బాధగా ఉంటుంది. కోపమొస్తుంది. అసహనంతో కూడిన అనారోగ్యం చేస్తుంది.

ఆమధ్య-
సార్, మేడం అన్న వలసవాద గౌరవ వాచకాలను కేరళ మథుర్ గ్రామ పంచాయితీ నిషేధించింది. దేశంలో ఒక సంబోధన చర్చకు తెర లేపింది. పంచాయతీ ఆఫీసులో పనులకోసం వచ్చే ప్రజలు ఉద్యోగులను మలయాళంలో సాధారణ సంబంధ వాచకాలు అన్న, అక్క, చెల్లి, తమ్ముడు అని పిలవవచ్చు అని పంచాయతీ కార్యాలయం ముందు బోర్డు పెట్టింది. వయసులో పెద్దవారయితే గారు లాంటి మాటను ఉపయోగించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో సార్, మేడం అని అనకండి. అభ్యర్ధనల్లో రాయకండి అని కోరింది. వారి అసలు పేరుకు ముందు వయసును బట్టి ఏ మలయాళ మాట అంటే గౌరవంతగ్గకుండా ఉంటుందో సూచించాల్సిందిగా మలయాళ అధికార భాషా సంఘానికి ఒక లేఖ కూడా రాసింది.

ఇదివరకు ఉత్తరాల్లో-
మహారాజ రాజశ్రీ మీ ఘనమయిన పాద పద్మములకు నమస్కరించి వ్రాయునది…అని మొదలు పెట్టేవారు. చివర-
చిత్తగించవలెను.
ఇట్లు,
మీ విధేయుడు…

అని చిత్తగించుకుని, విన్నవించుకుని, మన్నించమంటూ తమను తాము చాలా చిన్నబుచ్చుకునే వారు. ఇదంతా రాజులకాలం నాటి ఉత్తర ప్రత్యుత్తరాల మర్యాదల భాష. రాజులు పోయినా మన భాషలో ఆ మర్యాదలు మహారాజుగా అలాగే ఉండిపోయాయి. ఇంగ్లీషు వారు వచ్చాక…వారు ప్రభువులు…మనం బానిసలు అని అనుక్షణం గుర్తు చేసేలా పిలుపులు, మర్యాదలను బిగించి పెట్టారు. వారు పోయి డెబ్బయ్ ఐదేళ్లయినా వారి ఘనమయిన రాయల్ పిలుపులు చింత చచ్చినా చావని పులుపుల పిలుపులై అలాగే ఉన్నాయి. ప్రాంతీయ భాషలన్నిటిలో గారు లాంటి సొంతమయిన గౌరవ వాచకాలున్నాయి.

మథుర్ గ్రామ పంచాయతీ పిలుపుల ఆదర్శం ఆచరణలో ఎంతవరకు జనం అలవాటు చేసుకుంటారో గానీ, ఉద్దేశం మాత్రం మంచిదే. నరనరాన బానిస భావజాలాన్ని ఎక్కించేశారు మన ప్రభువులు. అసెంబ్లీలో నన్ను పొగిడి టైమ్ వేస్ట్ చేయకండి మహాప్రభో! అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వేడుకుంటే…ఆహా! మా లీడర్ ఎంత గొప్పవాడు! అని వెంటనే పొగడ్తలు మొదలు పెడితే…ఆయన తలపట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది. అలా ఉంటుంది మన బానిస హృదయం.

ఎవరో ఒకరు, ఎపుడో అపుడు ఈ చర్చను మొదలు పెట్టడం ఆహ్వానించాల్సిందే. మథుర్ పంచాయితీ ప్రజాస్వామిక స్ఫూర్తి, ప్రజలే ప్రభువులు అన్న ఆదర్శాలకు అభినందనలు చెప్పాల్సిందే.

మథుర్ గ్రామ పంచాయతీ ఆదర్శం కొనసాగింపుగా…ఒరిస్సా హై కోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. కోర్టుల్లో న్యాయమూర్తులను మి లార్డ్! యువరానర్! అని మాత్రమే సంబోధించాలి. ఇది న్యాయస్థానాల్లో నియమమో? లేక గౌరవించే సంప్రదాయమో? తెలియదు కానీ దశాబ్దాలుగా అలాగే అలవాటయ్యింది. ఇకపై కోర్టు విచారణల్లో న్యాయవాదులు న్యాయమూర్తులను సార్! మేడం! అంటే చాలని...మి లార్డ్, యువరానర్ అని అనాల్సిన పనిలేదని ఒరిస్సా హై కోర్టు అధికారికంగా ఉత్తర్వు ఇచ్చింది.

భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పర్యటించినప్పుడు ఆయనకు స్వాగతం చెప్తూ వెలిసిన అనేక హోర్డింగుల్లో కూడా ఈ గౌరవ వాచకం సమస్య వచ్చినట్లు ఉంది. ఇంగ్లీషులో Chief Justice of the Supreme Court of India మాటకు హిందీలో భారత్ గణరాజ్య కే ముఖ్య్ న్యాయాధీశ్. తెలుగులో భారత సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి. కానీ ఇదంతా రాసి మళ్లీ పేరు ముందు జస్టిస్ శ్రీ ఎన్ వి రమణ అని రాశారు. అప్పుడది పునరుక్తి అయి ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తి అవుతోంది. శ్రీ శ్రీమతి భారతీయ సంప్రదాయం. జస్టిస్ న్యాయస్థాన సంప్రదాయం కావడంతో ఏ గౌరవ వాచకం మిస్సయితే ఏమి ప్రమాదమో? ఎందుకొచ్చిన గొడవ? అసలే కోర్టులు అన్న భయభక్తులతో కూడిన గౌరవం వల్ల వచ్చిన జాగ్రత్తతో అనేక భాషల పునరుక్తులను తాటికాయంత అక్షరాలతో వాడి ఉంటారు.

ఇదివరకు రాజుల కాలంలో మహా రాజ రాజశ్రీ అభినవ భాస్కర రాయ దక్షిణాధీశ అపార కృపా పారావార చతుస్సాగర ధరాముద్రిత మహీవలయ పాలకా…మల్లయ్యా! అని బిరుదులతో పిలిచేవారు. ఇందులో మల్లయ్య ఒక్కటే ఆయన పేరు. మిగతాదంతా విశేషణ పూర్వపద బిరుదు సమాసపదబంధుర సాగరం!

రాజులు పోయి…రవి అస్తమించని ఇంగ్లీషు రాజులు వచ్చారు. ఆ రవి అస్తమించినా వారి పద్ధతులు, వారి సంబోధనలు అలాగే ఉండిపోయాయి. రాజ్యాంగ బద్దంగా ఏర్పడే వ్యవస్థలన్నీ ప్రజాస్వామిక మౌలిక సూత్రాలకు లోబడే పనిచేయాలి. ఒరిస్సా హై కోర్టు ఆ దిశగా ఒకడుగు ముందుకు వేసింది.

యువరానర్ ఇట్ ఈజ్ అవరానర్.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

రాజకీయ విద్య

RELATED ARTICLES

Most Popular

న్యూస్